Business

  ఇంటెల్ కీలక నిర్ణయం- వాణిజ్య వార్తలు

  ఇంటెల్ కీలక నిర్ణయం- వాణిజ్య వార్తలు

ఇంటెల్ కీలక నిర్ణయం

లాప్‌టాప్‌ యూజర్లకు ప్రముఖ టెక్ దిగ్గజం ఇంటెల్ (INTEL) శభవార్త తెలిపింది. ఇకపై భారత్‌లోనే లాప్‌టాప్‌ల తయారీ చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు భారత్‌లోని ఎనిమిది స్థానిక (భగవతీ ప్రొడక్ట్స్, డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా, కేన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్, ఆప్టిమస్ ఎలక్ట్రానిక్స్. పనాచే డిజిటల్ లైఫ్, స్మైల్ ఎలక్ట్రానిక్స్, సిర్మా ఎస్జీఎస్ టెక్నాలజీ, వీవీటీఎన్ టెక్నాలజీ) కంపెనీలతో జత కట్టింది. అయితే ఈ కంపెనీల ఒప్పందం ప్రకారం.. ఆయా సంస్థలకు ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ సర్వీసెస్, ఒరిజినల్ డిజైన్ మాన్యుఫాక్యరర్లతో ఎంట్రీ లెవల్ ల్యాప్‌టాప్‌ల తయారీకి అవసరమైన టెక్నాలజీని ‘INTEL’ షేర్ చేసుకుంటుంది. అంతే కాకుండా ల్యాప్‌టాప్‌ల తయారీలో క్వాలిటీ కంట్రోల్, ప్రొడక్ట్ బెంచ్ మార్క్ కాపాడే విషయంలోనూ అవసరమైన తోడ్పాటును అందిస్తుంది.

*   జుకర్‌బర్గ్‌ మోకాలికి శస్త్రచికిత్స

 మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌  పోటీకి సన్నద్ధమవుతున్న ఫేస్‌బుక్ అధినేత, మెటా సీఈవో  మార్క్ జుకర్‌బర్గ్ ఇటీవల శిక్షణ సమయంలో గాయాలపాలైన విషయం తెలిసిందే. మెకాలి గాయం  కారణంగా శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. తాజాగా వైద్యులు విజయవంతంగా శస్త్ర చికిత్స చేశారు. ఈ విషయాన్ని జుకర్‌బర్గ్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఫొటోను షేర్‌ చేశారు. ఎడమ మోకాలి వద్ద ఉండే లిగ్‌మెంట్‌కు గాయమైనట్లు తెలిపారు. ఆపరేషన్‌ విజయవంతమైనట్లు వివరించారు .మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకుంటుండగా మోకాలికి గాయమైంది. ఇప్పుడే ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్న డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందికి ధన్యవాదాలు. నేను వచ్చే ఏడాది జరగబోయే మ్యాచ్‌కు ట్రెయినింగ్ తీసుకుంటున్నాను. కానీ ఇప్పుడు గాయం కారణంగా అది కాస్త ఆలస్యం అవుతోంది. నేను త్వరగా కోలుకొని మళ్లీ శిక్షణ తీసుకునేందుకు ఎదురుచూస్తున్నాను. ప్రేమ, మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ అంటూ పోస్టు పెట్టారు. ఈ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది.

ప్రతినెలా ఉచిత సినిమా టిక్కెట్లు

ఎస్‌బీఐ కార్డ్, రిలయన్స్ రిటైల్ సంయుక్తంగా కొత్త కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌ను ప్రారంభించాయి. ఈ కార్డు పేరు ‘రిలయన్స్ SBI కార్డ్’. ఈ కార్డ్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. రిలయన్స్ SBI కార్డ్, రిలయన్స్ SBI కార్డ్ ప్రైమ్. రిలయన్స్ రిటైల్ ఎకోసిస్టమ్‌లోని స్టోర్‌లలో రెండు కార్డ్‌లతో చెల్లింపులు చేయడం ద్వారా మీరు గొప్ప ప్రయోజనాలు, రివార్డ్ పాయింట్‌లను పొందుతారు. రెండు కార్డులపై వేర్వేరు ఆఫర్‌లు అందుబాటులో ఉంటాయి. ఆపర్లు, ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం.రిలయన్స్ రిటైల్, SBI కార్డ్ కస్టమర్‌లకు ప్రత్యేక ప్రయోజనాలను అందించే లక్ష్యంతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయి. ఈ భాగస్వామ్యం కింద, రిలయన్స్ రిటైల్ కస్టమర్‌లు SBI కార్డ్‌ల విస్తృతమైన నెట్‌వర్క్‌ను పొందవచ్చు. వారికి ప్రత్యేకమైన ప్రయాణ, వినోద ప్రయోజనాల వంటి అనేక రకాల ప్రయోజనాలకు యాక్సెస్‌ను అందిస్తుంది.రిలయన్స్ SBI కార్డ్ జాయినింగ్ ఫీజు రూ. 499. ఇందులో పన్ను ఉండదు. వార్షిక రుసుము రూ. 499 + పన్నులు. మీరు రూ. 1 లక్ష ఖర్చు చేస్తే వార్షిక రుసుము మినహాయించబడుతుంది. వెల్‌కమ్ ఆఫర్ కింద, మీరు రూ. 500 రిలయన్స్ రిటైల్ వోచర్‌ను పొందుతారు. రిలయన్స్ బ్రాండ్ కోసం రూ. 3200ల తగ్గింపు వోచర్ అందుబాటులో ఉంటుంది. ఈ కార్డ్‌తో లాంజ్ ప్రయోజనాలు అందుబాటులో ఉండవు.రిలయన్స్ SBI కార్డ్ ప్రైమ్ యొక్క జాయినింగ్ ఫీజు రూ. 2999 + పన్నులు. ఇది కాకుండా, వార్షిక రుసుము కూడా అదే. 3 లక్షలు ఖర్చు చేసిన తర్వాత వార్షిక రుసుము మాఫీ చేయబడుతుంది. వెల్‌కమ్ ఆఫర్ కింద, మీరు రూ. 3000 రిలయన్స్ రిటైల్ వోచర్‌ను పొందుతారు. వివిధ రిలయన్స్ బ్రాండ్‌లకు రూ.11,999 విలువైన తగ్గింపు వోచర్‌లు అందుబాటులో ఉంటాయి. ఈ కార్డ్‌లో 8 దేశీయ, 4 అంతర్జాతీయ విమానాశ్రయాల లాంజ్ ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. మీరు ప్రతి నెలా రూ. 250 విలువైన సినిమా టిక్కెట్‌ను ఉచితంగా పొందుతారు.

ఎస్బీఐ రెండో త్రైమాసికం నికర లాభాల్లో 8శాతం గ్రోత్

కేంద్ర ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంక్.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) సెప్టెంబర్ త్రైమాసికంలో ఎనిమిది శాతం గ్రోత్ సాధించింది. 2023-24 రెండో త్రైమాసికంలో రూ.14,330 కోట్ల నికర లాభం గడించింది. కానీ, మార్కెట్ వర్గాలను అందుకోలేకపోయింది. ఎస్బీఐ రెండో త్రైమాసికంలో రూ.14,500 కోట్ల నికర లాభం గడిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేశారు.కానీ, నికర వడ్డీ ఆదాయంలో మాత్రం మార్కెట్ అంచనాలను బీట్ చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 12 శాతానికి పైగా రూ.39,500 కోట్లు నికర వడ్డీ ఆదాయం సముపార్జించింది. మార్కెట్ వర్గాలు రూ.38,500 కోట్ల నికర వడ్డీ ఆదాయం పొందుతుందని అంచనా వేశాయి. సెప్టెంబర్ త్రైమాసికం మొత్తం ఆదాయం 26.4 శాతం పెరిగి రూ.1.12 లక్షల కోట్లకు చేరుకున్నది.స్థూల మొండి బకాయిలు 2.55 శాతంగా ఉన్నాయి. జూన్ త్రైమాసికంలో 2.76 శాతం ఉంటే, గతేడాది సెప్టెంబర్ త్రైమాసికంలో స్థూల మొండి బకాయిలు 3.52 శాతం. ఇక నికర మొండి బకాయిలు గతేడాదితో పోలిస్తే 0.80 శాతం నుంచి 0.64 శాతానికి తగ్గాయి. జూన్ త్రైమాసికంలో 0.71 శాతం నికర మొండిబకాయిలు నిలిచాయి.

లాభాల్లో పుంజుకున్న బ్యాంక్ ఆఫ్ ఇండియా

ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నికర లాభం 52 శాతం పెరిగి రూ.1,458.13 కోట్లకు చేరుకున్నట్లు ప్రకటించింది. ఇది గత ఏడాది ఇదే కాలంలో రూ.960 కోట్లుగా ఉంది. ఆస్తి నాణ్యతలో గణనీయమైన మెరుగుదల, మార్జిన్లు పెరిగిన నేపథ్యంలో లాభాల్లో పెరుగుదల నమోదైనట్లు బ్యాంక్ పేర్కొంది. బ్యాంక్ ఆస్తి నాణ్యత స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 5.84 శాతం మెరుగుపడగా, ఇది గత ఏడాది ఇదే కాలంలో 8.51 శాతంగా ఉంది.నికర వడ్డీ ఆదాయం రూ.5,740 కోట్లుగా నమోదైంది. వడ్డీయేతర ఆదాయం రూ.1,417 కోట్ల నుండి సంవత్సరానికి 19 శాతం పెరిగి రూ.1,688 కోట్లకు చేరుకుంది . బ్యాంక్ నిర్వహణ లాభం రూ. 3,756 కోట్లకు చేరుకుంది, ఇది గత ఏడాది ఇదే కాలంలోని రూ.3,374 కోట్లతో పోలిస్తే దాదాపు 11 శాతం అధికం. బ్యాంక్ ప్రస్తుతం దేశీయంగా 5,135 బ్రాంచ్‌లను కలిగి ఉంది. వీటిలో 1,855 గ్రామీణ ప్రాంతాల్లో, 1456 సెమీ-అర్బన్, 830 పట్టణ, 992 మెట్రో నగరాల్లో ఉన్నాయి.

రియల్‌మీ ఫోన్‌పై భారీ తగ్గింపు

ప్రముఖ చైనా కంపెనీ రియల్ మీ ఎప్పటికప్పుడు జనాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అదిరిపోయే ఫీచర్స్ తో కొత్త స్మార్ట్ మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. తాజాగా రిలీజ్ అయిన రియల్‌మీ నార్జో 60 ఎక్స్‌ స్మార్ట్ ఫోన్‌పై మంచి డీల్‌ అందిస్తోంది అమెజాన్.. ఈ స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ. 14,999కాగా, 22 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 11,749కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. వీటితోపాటు పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేసే వారికి అదనంగా రూ. వెయ్యి వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు…ఈ స్మార్ట్ ఫోన్‌ను రూ. 10 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఇక రియల్‌మీ నార్జో 60 ఎక్స్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే 5జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్‌ చేసే ఈ ఫోన్‌లో 4జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌లో తీసుకొచ్చారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ పని చేస్తుంది..ఇక 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఈ ఫోన్‌ సొంతం. 70 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీ ఛార్జ్‌ కావడం ఈ ఫోన్‌ ప్రత్యేకత. బ్యాక్‌ ఫింటర్‌ ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు.. అలాగే స్మార్ట్ ఫోన్‌లో 33 వాట్స్‌ పవర్‌ ఫుల్ సూపర్‌ వూక్‌ ఛార్జింగ్ టెక్నాలజీ అందించారు..కెమెరా విషయానికొస్తే సెల్ఫీ ప్రియులకు పండగే.. ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. కనెక్టివిటీ ఫీచర్‌ విషయానికొస్తే ఇందులో బ్లూటూత్‌, సెల్యూలార్‌, వైఫై, ట్రూ జీపీఎస్‌ వంటి ఫీచర్స్‌ను.. ఇకపోతే ఈ ఫోన్‌లో 6.72 ఇంచెస్‌తో కూడిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. 90 హెచ్‌జెడ్‌ ఈ స్క్రీన్‌ సొంతం. ఈ ఫోన్‌లో పంచ్‌ హోల్‌ డిస్‌ప్లేను ఇచ్చారు.. ఈ ఫోన్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ కూడా ఉంది.

వన్‌ప్లస్‌ దీపావళి ఆఫర్‌

 చైనాకు చెందిన మొబైల్‌ తయారీ సంస్థ వన్‌ప్లస్‌ (OnePlus) దీపావళి సేల్‌ను తీసుకొచ్చింది. ఈ సేల్‌లో మొబైల్‌ ఫోన్లు, ట్యాబ్లెట్స్‌, టీవీలపై స్పెషల్‌ డిస్కౌంట్లు అందిస్తోంది. కొత్తగా మార్కెట్‌లోకి తీసుకొచ్చిన స్మార్ట్‌ఫోన్లపై ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్లు, నో-కాస్ట్‌ ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తోంది. ఈ సేల్‌ ఇప్పటికే ప్రారంభమైంది. నవంబర్‌ 10 వరకు అందుబాటులో ఉంటుంది. ఒకవేళ మీరు వన్‌ప్లస్‌ ఫోన్‌ కోసం చూస్తున్న వారైతే ఈ ఆఫర్లపై ఓ లుక్కేయండి..దీపావళి సేల్‌లో భాగంగా వన్‌ప్లస్‌ తొలి ఫోల్డబుల్‌ ఫోన్‌ వన్‌ప్లస్‌ ఓపెన్‌ (OnePlus Open)పై ఆకర్షణీయమైన తగ్గింపును ఇస్తోంది. రూ.5 వేలు ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌, 12 నెలల పాటు నో-కాస్ట్‌ ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తోంది. ఆఫర్‌లోని ఎక్స్ఛేంజ్‌ ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా రూ.5 వేలు తగ్గింపును పొందొచ్చు. వన్‌ప్లస్‌ 11 5జీ (OnePlus 11 5G)పై రూ.3 వేలు ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌, 12 నెలలు నో-కాస్ట్‌ ఈఎంఐ సదుపాయాన్ని ఇస్తోంది.వన్‌ప్లస్‌ నార్డ్‌ సిరీస్‌లోని ఫోన్లపై ఆకర్షణీయమైన తగ్గింపును ఇస్తోంది. వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 5జీ (OnePlus Nord 3 5G)పై రూ.3,000 ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ అందిస్తోంది. దీంతో పాటు రూ.3 వేల స్పెషల్‌ ప్రైస్‌ కూపన్‌, 6 నెలల పాటు నో కాస్ట్‌ ఈఎంఐ సదుపాయాన్ని కూడా పొందొచ్చు. వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 3 (The OnePlus Nord CE 3) కొనుగోలుపై రూ.2 వేలు ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌తో పాటు రూ.2 వేల ప్రైస్‌ కూపన్‌ ఇస్తోంది. వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ లైట్‌ (OnePlus Nord CE 3 Lite), వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 2 లైట్‌ (OnePlus Nord CE 2 Lite) ఫోన్లపై రూ.1,500 ఇన్‌స్టాంట్‌ బ్యాంక్‌ డిస్కౌంట్‌ అందిస్తోంది. నార్డ్‌ సీఈ 2 లైట్‌పై 3 నెలలు నో కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది.వన్‌ప్లస్‌ 11 ఆర్‌ 5జీ (OnePlus 11R 5G), వన్‌ప్లస్‌ 11 ఆర్‌ 5జీ సోలార్‌ రెడ్‌ స్పెషల్‌ ఎడిషన్‌ (Solar Red Special Edition)పై రూ.2,000 తగ్గింపును ఇస్తోంది. వీటి కొనుగోలుపై 9 నెలల పాటు నోకాస్ట్‌ ఈఎంఐ సదుపాయం కూడా అందిస్తోంది. వన్‌ప్లస్‌ 10 ప్రో 5జీ (OnePlus 10 Pro 5G)పై 5,000 ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌, రూ.14 వేలు ప్రత్యేక కూపన్‌ పొందొచ్చు. వన్‌ప్లస్‌ 10టీ 5జీ (OnePlus 10T 5G) పై రూ.5,000 ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌, రూ.10వేలు స్పెషల్‌ ప్రైస్‌ కూపన్‌ ఇస్తోంది.వన్‌ప్లస్‌ 10 ఆర్‌ 5జీ (OnePlus 10R 5G) కొనుగోలుపై రూ.3,000 ఇన్‌స్టంట్‌ బ్యాంక్ డిస్కౌంట్, రూ.7,000 స్పెషల్‌ కూపన్‌ను ఇస్తోంది. 6 నెలల పాటు నో-కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. అమెజాన్‌, వన్‌ప్లస్‌ ఎక్స్‌పీరియన్స్‌ స్టోర్‌, వన్‌ప్లస్‌ వెబ్‌సైట్‌లో వీటిని కొనుగోలు చేయొచ్చు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z