Business

ఆత్మకథపై ఇస్రో చైర్మన్ సంచలన నిర్ణయం-వాణిజ్య వార్తలు

ఆత్మకథపై ఇస్రో చైర్మన్ సంచలన నిర్ణయం-వాణిజ్య వార్తలు

* జుకర్ బర్గ్ ఎలాన్ మస్క్ మధ్య మాటల యుద్ధం

ఏదైనా ఒకే రంగంలో ఉన్న రెండు సంస్థల మధ్య, వ్యక్తుల మధ్య వృత్తిగత వైరం ఉండడం సహజమే. మార్క్ జుకర్ బర్గ్, ఎలాన్ మస్క్ మధ్య కూడా అలాంటి స్పర్ధ కొనసాగుతోంది. మార్క్ జుకర్ బర్గ్ ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ లకు సొంతదారు కాగా, ఎలాన్ మస్క్ ఇటీవలే ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్నారు. ట్విట్టర్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి మస్క్, జుకర్ బర్గ్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. జుకర్ బర్గ్ ట్విట్టర్ ను పోలిన థ్రెడ్స్ ను తీసుకువచ్చాక… పరస్పర విమర్శల దాడి మరింత పెరిగింది.ఈ క్రమంలో ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మార్క్ జుకర్ బర్గ్ కు చెందిన ఇన్ స్టాగ్రామ్ ను ఓ పోర్న్ సైట్ తో పోల్చారు. పేరులో తప్ప ఇంకెక్కడా తేడా లేదని, కంటెంట్ అంతా ఒకటే అనే విధంగా మస్క్ వ్యాఖ్యానించారు.సీబీ డోజ్ అనే యూజర్ ఎక్స్ లో చేసిన ఓ ట్వీట్ తో ఇదంతా మొదలైంది. ఇన్ స్టాగ్రామ్ కు ఓన్లీ ఫ్యాన్స్ కు మధ్య తేడా ఏదైనా ఉందంటే అది పేరులోనే అంటూ సీబీ డోజ్ పేర్కొన్నాడు. ఈ ట్వీట్ ను ఎలాన్ మస్క్ సమర్థిస్తూ “భలే చెప్పావు” అని ప్రశంసించాడు.

* ఆత్మకథపై ఇస్రో చైర్మన్ సంచలన నిర్ణయం

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) చైర్మన్ ‘ఎస్ సోమనాథ్’ (S.Somanath) ‘నిలవు కుడిచ సింహగల్‌’ (వెన్నెల తాగిన సింహాలు) పేరుతో మలయాళంలో తన ఆత్మకథను రాసారు. తన జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో సమస్యలను యువతరానికి అందించి వారిలో స్ఫూర్తి నింపడానికి ఈ పుస్తకం రాసారు. ప్రచురణకు సిద్దమైన ఈ పుస్తకం ఇప్పుడు నిలిచిపోయింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.సోమనాథ్ ఆత్మకథలో ఇస్రో మాజీ చీఫ్ కె.శివన్‌పై కొన్ని విమర్శలు చేశారంటూ ప్రచారం జరుగుతోంది. తాను ఇస్రో చైర్మన్ పదవిని చేపట్టకుండా అడ్డుకునేందుకు శివన్ ప్రయత్నించారని సోమనాథ్ తన పుస్తకంలో ఆరోపించినట్టు తెరపైకి రావడంతో సోమనాథ్ స్పందించారు.పుస్తకంలో పేర్కొన్న అంశాలను తప్పుగా అర్థం చేసుకున్నారని, శివన్ తన ఎదుగుదలను అడ్డుకున్నట్లు ఎక్కడా ప్రస్తావించలేదని వెల్లడించారు. స్పేస్ కమిషన్ సభ్యుడిగా ఎంపికైతే ఇస్రో చైర్మన్ పదవి వస్తుందని అందరూ అనుకుంటారు. కానీ ఆ సమయంలో మరో డైరెక్టర్‌ను నియమిస్తే అలాంటి అవకాశాలు తగ్గుతాయని మాత్రమే పుస్తకంలో పేర్కొన్నట్లు సమాచారం.పుస్తకం ఇంకా అధికారికంగా విడుదల కాలేదు. నా పబ్లిషర్ కొన్ని కాపీలను విడుదల చేసి ఉండవచ్చు.. కానీ ఈ వివాదం తర్వాత, ప్రచురణను నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. తాను రాసిన పుస్తకం విమర్శనాస్త్రం కాదని, జీవితంలో సమస్యలను అధిగమించి తమ కలలను సాధించాలనుకునే వ్యక్తులకు స్ఫూర్తిదాయకమైన కథ అని ఇస్రో చైర్మన్ వెల్లడించారు.

* నేడు గ్యాస్ సిలిండర్ ధరలు

నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. అయితే ఇటీవల 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను వరుసగా పెంచారు. అలాగే గృహ వినియోగ ధరల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో అవి స్థిరంగా కొనసాగుతున్నాయి.హైదరాబాద్: రూ.966,వరంగల్: రూ.974,విశాఖపట్నం: రూ.912,విజయవాడ: రూ.927, గుంటూర్: రూ.944.

* నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ‘ఆనంద్ మహీంద్రా’ ట్వీట్

ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ‘ఆనంద్ మహీంద్రా’ (Anand Mahindra) ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ.. ఆసక్తికరమైన చాలా విషయాలను షేర్ చేస్తూ ఉంటాడు. ఇందులో భాగంగానే తాజాగా తన ట్విటర్ ఖాతా ద్వారా ఒక వీడియో పోస్ట్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఒక ఎలుగుబంటి తనను తాను అద్దంలో చూసుకుని ఒక్కసారిగా కంగారుపడిపోయింది. వెంటనే దాని ముందు తనలాంటిదే ఇంకొకటుందని అద్దం వెనుకకు వెళ్లి చూసింది. అక్కడ కనిపించకపోయేసరికి అద్దాన్ని పట్టుకుని బలంగా కిందకు లాగింది.ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కడుపుబ్బా నవ్వుకుంటుంటారు. ఆనంద్ మహీంద్రా ఈ వీడియో షేర్ చేస్తూ ఆదివారాల్లో మరీ ఉదయాన్నే లేచినపుడు తన రియాక్షన్ కూడా ఇలానే ఉంటుందని వెల్లడించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.

* క్రోమా పండగ ఆఫర్లు

టాటా అనుబంధ ఈ-కామర్స్‌ సంస్థ క్రోమా (Croma) పండగ ఆఫర్లను ప్రకటించింది. ‘ఫెస్టివల్ ఆఫ్ డ్రీమ్స్’ పేరుతో సేల్‌ని తీసుకొచ్చింది. సేల్‌లో భాగంగా స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, వాషింగ్ మెషీన్‌లు, ఏసీలు, రిఫ్రిజిరేటర్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది. అయితే ఈ ఆఫర్లు నవంబరు 15 వరకు మాత్రమే ఉండనున్నాయి. క్రోమా వెబ్‌సైట్, టాటా న్యూ (tata neu) యాప్‌ల ద్వారా చేసే కొనుగోళ్లకు డిస్కౌంట్లు వర్తిస్తాయి.క్రోమా నిర్వహిస్తున్న ఈ సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్‌22 అల్ట్రా (Samsung Galaxy S22 Ultra) స్మార్ట్‌ఫోన్‌పై 44శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ ఫోన్‌ 12జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.1,09,999 కాగా.. తాజా క్రోమా సేల్‌లో రూ.61,799కే కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్‌ 15 (iphone 15) ప్రత్యేక సేల్‌లో భాగంగా రూ.74,900కే లభిస్తోంది. యాపిల్‌ ఐప్యాడ్‌ ఎయిర్‌ 5వ జెనరేషన్‌ (Apple ipad Air 5 Gen) ధర రూ.59,900 కాగా.. ప్రస్తుతం రూ.52,390కే విక్రయానికి ఉంది.స్మార్ట్‌టీవీలపై ఆకర్షణీయమైన ఈఎంఐ ఆప్షన్లను కూడా క్రోమా అందిస్తోంది. 55, 65, 75 అంగుళాల 4కే ఎల్‌ఈడీ టీవీ కొనుగోళ్లపై రూ.2,990 నుంచి ఈఎంఐ ఆప్షన్లు ప్రారంభమయ్యాయి. శాంసంగ్‌ 55 అంగుళాల లైఫ్‌స్టైల్ ఫ్రేమ్ టీవీ 42శాతం తగ్గింపుతో రూ.83,990కే లభిస్తోంది. దీని కొనుగోలుపై ఉచిత బెజెల్‌ని కూడా ఇస్తోంది. ఈ సేల్‌లో ఇంటెల్‌ కోర్‌ ఐ3 ల్యాప్‌ట్యాప్‌ని రూ.30,900 కే కొనుగోలు చేయొచ్చు. దీంతో పాటూ అన్ని ల్యాప్‌ట్యాప్‌ల కొనుగోళ్లపై 24 నెలల ఈఎంఐ సదుపాయాన్ని ఉంది. స్మార్ట్‌వాచ్‌ కొనుగోళ్లకు కూడా రూ.999 ఈఎంఐ సదుపాయాన్ని ఇస్తోంది.హెచ్‌డీఎఫ్‌సీ (HDFC), ఐసీఐసీఐ కార్డ్‌ (ICICI card) డెబిట్‌/ క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ పొందొచ్చు. ఎంపిక చేసిన కొనుగోళ్లపై నో కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. అంతేకాదు ప్రతి రూ.3 వేల కొనుగోళ్లపై రూ.500 తగ్గింపు కూడా అందిస్తోంది.

* దీపావళికి ప్రత్యేక రైళ్లు

దీపావళి పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం భారత రైల్వే పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. వీటిలో కొన్ని ఏపీ స్టేషన్లలోనూ ఆగనున్నాయి. రైల్వే శాఖ ప్రకటన ప్రకారం, నవంబర్ 13, 20, 27 తేదీల్లో చెన్నై సెంట్రల్‌-భువనేశ్వర్‌ మధ్య ప్రత్యేక రైలు సర్వీసు (నెంబర్ 06073) నిర్వహించనున్నారు. ఈ రైలు చెన్నై సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌ నుంచి రాత్రి 11.45కి బయల్దేరి, మర్నాడు సాయంత్రం 6.30కి భువనేశ్వర్‌ చేరుకుంటుంది. కాగా, తిరుగు ప్రయాణానికి సంబంధించి ఈ నెల 14, 21, 28 తేదీల్లో భువనేశ్వర్‌ నుంచి చెన్నై సెంట్రల్‌‌కు ప్రత్యేక రైలు సర్వీసును కూడా (నెంబర్ 06074) రైల్వే సిద్ధం చేసింది. భువనేశ్వర్‌ స్టేషన్ నుంచి ఈ రైలు రాత్రి 9కి బయల్దేరి, మర్నాడు మధ్యాహ్నం 3కి చెన్నై చేరుకుంటుంది. చెన్నై-భవనేశ్వర్ రైళ్లు ఆంధ్రప్రదేశ్‌లోని గూడూరు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం, పలాస, ఖుర్ధా రోడ్డు రైల్వే స్టేషన్లలో ఆగుతాయని అధికారులు పేర్కొన్నారు. చెన్నై సెంట్రల్-సంత్రాగచ్చి మధ్య కూడా ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. నవంబర్ 11, 18, 25 తేదీల్లో చెన్నై సెంట్రల్ నుంచి సంత్రాగచ్చి వరకూ స్పెషల్ సూపర్ ఫాస్ట్ (నెంబర్ 06071) ఏర్పాటు చేశారు. చెన్నై సెంట్రల్‌లో రాత్రి 11.45కి ఈ రైలు బయల్దేరి, మూడో రోజు తెల్లవారుజామున గం.3.45కి సంత్రాగచ్చికి చేరుకుంటుంది. ఈ నెల 13, 20, 27 తేదీల్లో సంత్రాగచ్చి నుంచి చెన్నై సెంట్రల్‌‌కి ప్రత్యేక సూపర్‌ ఫాస్ట్‌ రైలు (నెంబర్ 06072) నిర్వహించనున్నారు. సంత్రాగచ్చిలో తెల్లవారు జామున 5కి బయలుదేరి, మరుసటిరోజు ఉదయం 11 గంటలకు చెన్నై సెంట్రల్‌ చేరుకుంటుంది. ఈ రైళ్లు ఆంధ్రప్రదేశ్‌లోని గూడూరు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం, పలాస, ఖుర్దా రోడ్డు రైల్వేస్టేషన్‌లలో ఆగుతాయి.

* రద్దు చేసుకున్న రైలు టికెట్‌పై 100 శాతం నగదు వాపస్‌

దీపావళి సందర్భంగా రైలు, బస్సు టిక్కెట్ల కొనుగోలుపై పలు రాయితీలను అందిస్తున్నట్లు పేటీఎం (Paytm) వెల్లడించింది. తమ ప్లాట్‌ఫాం ద్వారా బస్సు టిక్కెట్ల కొనుగోలుపై రూ.500 వరకూ తగ్గింపును అందిస్తున్నట్లు పేర్కొంది. పేటీఎం (Paytm) నుంచి రైలు టిక్కెట్టును కొనుగోలు చేసి, ప్రయాణానికి ఆరు గంటల ముందు వరకూ రద్దు చేసుకున్నా, తక్షణమే వారి ఖాతాలోకి మొత్తం డబ్బు జమ అవుతుందని పేర్కొంది. తత్కాల్‌ సహా, అన్ని టిక్కెట్లకూ ఇది వర్తిస్తుందని తెలిపింది. యూపీఐ ద్వారా చెల్లించినప్పుడు ఎలాంటి అదనపు రుసుములూ ఉండవని పేర్కొంది.

* త్వరలో విడుదల కానున్న శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌24

ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ త్వరలో శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌24 సిరీస్‌ను విడుదల చేయనుంది. గెలాక్సీ ఎస్‌ 23 ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా, శాంసంగ్‌ ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌ను ఇప్పటికే మార్కెట్‌కి పరిచయం చేసిన ఫోన్‌లను విడుదల చేసిన తర్వాతనే ఈ లేటెస్ట్‌ సిరీస్‌ ఫోన్‌లను విడుదల చేయాలని శాంసంగ్‌ భావిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.నివేదికల ప్రకారం.. ఈ కొత్త సిరీస్‌లో బేస్ గెలాక్సీ ఎస్‌24,గెలాక్సీ ఎస్‌ 234 ప్లస్‌, గెలాక్సీ ఎస్‌ 24 ఆల్ట్రాలు ఉండనున్నాయి. గెలాక్సీ ఎస్‌ 24 సిరీస్‌ను కొత్త ఏడాది జనవరి 17న అమెరికా శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగే కార్యక్రమంలో విడుదల చేసే అవకాశం ఉందని ఎస్‌బీఎస్‌ బిజ్ రిపోర్ట్‌ తెలిపింది.శాంసంగ్‌ కంపెనీ గెలాక్సీ ఎస్‌23 ఎఫ్‌ఈ మోడల్‌ను సౌత్‌ కొరియాలో సుమారు రూ.70 వేల లోపు ధరతో విక్రయించనుంది. ఇంచు మించు శాంగ్‌ గెలాక్సీ ఎస్‌ 24 సిరీస్‌ ఫోన్‌ ధరలు సైతం అదే స్థాయిలో ఉండనున్నాయి. వీటి ఖచ్చిత ధర ఎంతనేది తెలియాలంటే ఈ ఫోన్‌ సీరీస్‌ విడుదలయ్యే వరకు ఎదురు చూడాల్సి ఉంది. యాపిల్‌ ఐఫోన్‌లకు గట్టి పోటీ ఇస్తూ ఆర్థిక మాంద్యం కారణంగా గెలాక్సీ ఎస్ 23 సిరీస్, ఎస్‌ 24 సిరీస్‌ ఫోన్‌ల అమ్మకాల తగ్గకుండా ఉండేలా వ్యూహాత్మకంగా మార్కెటింగ్‌ స్ట్రాటజీని అమలు చేయనుంది శాంసంగ్‌ . తద్వారా వాటి సేల్స్‌ పెంచుకోవాలని భావిస్తుంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z