DailyDose

కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లోకి చేరిన తుల ఉమ-తాజా వార్తలు

కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లోకి చేరిన తుల ఉమ-తాజా వార్తలు

* కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లోకి చేరిన తుల ఉమ

వేములవాడ బీజేపీ టికెట్ ఆశించి భంగపడిన తుల ఉమ.. బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సోమవారం (నవంబర్ 13న) ఉదయం బీజేపీ పార్టీ సభ్యత్వానికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పదవికి తుల ఉమ రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి పంపించారు. అనంతరం ఆమె తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. మంత్రి కేటీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. కేటీఆర్ ఆమెకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.వేములవాడ బీజేపీ టికెట్ ఇస్తామని ముందుగా చెప్పడంతో తుల ఉమ ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేసుకున్నారు. నామినేషన్ వేసే సమయంలో ఆమెకు బీజేపీ నాయకులు షాక్ ఇచ్చారు. చివరి లిస్టులో తుల ఉమ పేరు ప్రకటించిన బీజేపీ అధిష్ఠానం.. ఆ తర్వాత మార్పులు చేసింది. చివ‌రి నిమిషంలో తుల ఉమ అభ్యర్థిత్వాన్ని క్యాన్సిల్ చేసి.. వికాస్‌రావుకు టికెట్ ఇచ్చింది. దీంతో తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. పార్టీ నాయకులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ తనను మోసం చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

* బీఆర్‌ఎస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనం

: వైఎస్సార్‌టీపీ(YSRTP) పార్టీ నుంచి పలువురు నేతలు, అన్ని జిల్లా కోఆర్డినేటర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గట్టు రాంచందర్ రావు అధ్వర్యంలో బీఆర్‌ఎస్‌(BRS)లో చేరారు. వైఎస్సార్‌టీపీ పార్టీని బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయడానికి వచ్చిన నాయకులు, కార్యకర్తలకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు  (Minister Harish Rao) స్వాగతం తెలిపారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఎన్నికల్లో వైఎస్సార్టీపీ (YSRTP) పోటీ చేయట్లేదని.. కాంగ్రెస్‌ పార్టీకి (Congress) బేషరతుగా మద్దతిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల (YS Sharmila) ప్రకటించిన సంగతి తెలిసిందే. నమ్మివస్తే తమను నట్టేట ముంచిన షర్మిలపై  రాజీనామా చేసిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ పార్టీని బీఆర్‌ఎస్‌లో విలీనం చేయడానికి సిద్ధమయ్యారు. సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని తాము భావించి బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు వారు స్పష్టం చేశారు.

నాంపల్లి అగ్ని ప్రమాద మృతుల కుటంబాలకు ఆర్థిక సహాయం

తెలంగాణ మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. నాంపల్లి అగ్ని ప్రమాద సంఘటన జరిగిన నేపథ్యంలో మరణించిన కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం ప్రకటించారు మంత్రి కేటీఆర్. ఒక్క మృతుని కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం చేస్తామని వెల్లడించారు.హైదరాబాద్‌ నాంపల్లి బజార్ ఘాట్‌లో అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్. ఈ సందర్భంగా నాంపల్లి బజార్ ఘాట్‌లో అగ్ని ప్రమాదానికి గల కారణాలను అధికారులని అడిగి తెలుసుకున్నారు మంత్రి కేటీఆర్. అనంతరం మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు.  నాంపల్లి బజార్ ఘాట్‌లో అగ్ని ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. ఇక ఈ అగ్ని ప్రమాద ఘటనపై విచారణ చేస్తామని కూడా, నిందితులను వదిలిపెట్టబోమని వివరించారు మంత్రి కేటీఆర్

* రేవంత్ రెడ్డి ఖాకీ నిక్కర్ కామెంట్స్

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేతలు వేలం పాటకు సిద్ధంగా ఉండాలన్నారు. తాను ప్రసంగిస్తే దేశమంతా వణికిపోతుందన్నారు. తమ జోలికి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఇక, రేవంత్ రెడ్డి అసదుద్దీన్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. అసద్ తన షెర్వానీ లోపల పైజమా ఉందనుకున్నానని కానీ లోపల ఖాకీ నిక్కర్ ఉందన్నారు. ముస్లింల హక్కుల కోసం వాళ్ల నాన్న బారిష్టర్ చదివిస్తే అసద్ మాత్రం ముస్లింలను ఇబ్బంది పెట్టే పార్టీకి మద్దతు ఇస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ పై మజ్లిస్ ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పాలని రేవంత్ ఫైర్ అయిన విషయం తెలిసిందే.

 అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ టాప్‌

ఇప్పటికే కాలుష్య కోరల్లో చిక్కుకున్న దేశరాజధాని ఢిల్లీని (New Delhi) దీపావళి (Diwali) వేడుకలు మరింత కష్టాల్లోకి నెట్టాయి. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. తేలికపాటి వర్షంతో గత శనివారం నగరంలో పరిస్థితి కాస్త మెరుగుపడిన విషయం తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలను భేఖాతరు చేసి ఢిల్లీ వాసులు ఆదివారం టపాసులు పేల్చడంతో రాజధాని ప్రాంతంలో మరోసారి దట్టమైన పొగ అలుముకుంది. దీంతో ఏక్యూఐ (AQI) అత్యంత ప్రమాదకర స్థాయికి పెరిగింది. ఆదివారం రాత్రి ఏకంగా 680కి పెరిగినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా, దీపావళి ఎఫెక్ట్‌తో దేశంలోని మరో రెండు నగరాలు కూడా ఢిల్లీ సరసన చేరాయి.ప్రపంచంలోనే 10 అత్యంత కాలుష్య నగరాల జాబితాను (World Most Polluted Cities) స్విస్‌ గ్రూప్‌ ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ ( Swiss group IQAir) తాజాగా విడుదల చేసింది. ఆ జాబితా ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో దేశరాజధాని ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. ఇక మరో రెండు భారతీయ నగరాలు కూడా టాప్‌ 10లో నిలిచాయి. దీపావళి కారణంగా పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతా (Kolkata), మహారాష్ట్ర రాజధాని ముంబై (Mumbai) నగరాలు కూడా తీవ్ర వాయుకాలుష్యంలో చిక్కుకున్నాయి. సోమవారం ఉదయం ఢిల్లీలో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 420గా నమోదైంది. ఇది ప్రమాదకర కేటగిరీ కిందకి వస్తుంది. ఇక ఇదే జాబితాలో ఎయిర్ క్వాలిటీ సూచిక 196తో కోల్‌కతా నాలుగో స్థానంలో ఉంది. ఎయిర్ క్వాలిటీ సూచిక 163తో ముంబై 8వ స్థానంలో నిలిచింది.ఏక్యూఐ సూచిక 400 నుంచి 500 మధ్య నమోదైతే వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు. ఈ స్థాయిలో ఉండే వాయు కాలుష్యం ఆరోగ్యవంతమైన వ్యక్తులపై కూడా ప్రభావం చూపుతుంది. ఇప్పటికే ఏదైనా వ్యాధులతో బాధపడుతున్నవారికి ఇది అత్యంత ప్రమాదకరం. ఎయిర్ క్వాలిటీ సూచిక 150 నుంచి 200 మధ్య నమోదైతే అస్తమా, ఊపిరితిత్తులు, గుండె సమస్యలతో బాధపడుతున్న వారు అస్వస్థతకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. ఏక్యూఐ 0 నుంచి 50 మధ్య ఉంటే మాత్రమే పరిస్థితులు మెరుగ్గా ఉన్నట్లు.

* సెహ్వాగ్ కి ఐసీసీ అత్యున్నత పురస్కారం

టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కి ఐసీసీ అత్యున్నత గౌరవం లభించింది. ఐసీసీ ప్రతిష్టాత్మక హాల్ ఆఫ్ ఫేమర్ల జాబితాలో వీరేంద్ర సెహ్వాక్ కి చోటు కల్పించింది. వీరుతో పాటు భారత మాజీ మహిళా క్రికెటర్ డయానా ఎడుల్జీ, శ్రీలంక దిగ్గజ ఆటగాడు అరవింద డిసిల్వాకు కూడా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమర్ల జాబితాలో చోటు దక్కింది. ఈ ముగ్గురినీ హాల్ ఆఫ్ ద ఫేమర్ల జాబితాలోకి చేరుస్తున్నట్టు ఐసీసీ ట్వీట్టర్ వేదికగా ప్రకటించింది.45 ఏళ్ల సెహ్వాగ్ 1999-2013 మధ్యలో 104 టెస్టులు, 251 వన్డేలు, 19 టీ 20లలో భారత్ కి ప్రాతినథ్యం వహించాడు. 18641 పరుగులను సాధించాడు. ఇందులో 38 సెంచరీలు 72 హాఫ్ సెంచరీలున్నాయి. పార్ట్ టైమ్ స్పిన్నర్ కూడా. వీరుడు తన కెరీర్ లో 136 వికెట్లను పడగొట్టాడు. 67 ఏళ్ల డయానా 1976-93 మధ్య 20 టెస్టులు, 34 వన్డేలలో భారత్ కి ప్రాతినిథ్యం వహించింది. ఇప్పటికీ కూడా మహిళల టెస్ట్ క్రికెట్ లో అత్యధిక బంతులు సంధించిన రికార్డు యానా పేరిటే ఉండటం విశేషం.లెప్ట్ ఆర్మ్ బౌలర్ అయిన డయానా తన అంతర్జాతీయ కెరీర్ లో 109 వికెట్లను పడగొట్టింది. 58 ఏళ్ల అరవింద డిసిల్వ 1984-2003 మధ్యలో 93 టెస్ట్ లు, 308 వన్డే శ్రీలంకకు ప్రాతినిథ్యం వహించి 15645 పరుగులు సాధించాడు. 31 సెంచరీలు, 86 అర్థ సెంచరీలున్నాయి. డిసిల్వ కెరీర్ లో 135 వికెట్లను తీశాడు.

ఫిరోజ్‌ ఖాన్‌ను అడ్డుకున్న ఎంఐఎం నేతలు

హైదరాబాద్‌ నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. బజార్‌ఘాట్‌లోని కెమికల్‌ గోడౌన్‌లో మంటలు చెలరేగి.. ఆ మంటల్లో చిక్కుకొని తొమ్మిది మరణించారు. ఈ ఘటనపై ఇప్పటికే గవర్నర్ తమిళి సై, సీఎం కేసీఆర్ స్పందించి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాజాగా.. ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన్ను స్థానిక ఎమ్‌ఐఎమ్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా రెండు గ్రూపుల మధ్య తోపులాట జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు స్వల్ప లాఠీఛార్జీ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

* నాంపల్లి  అగ్ని ప్రమాదంపై రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
నాంపల్లిలోని బజార్‌ఘాట్‌ అపార్ట్‌మెంట్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఘటనపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి స్పందించారు. అగ్ని ప్రమాదంపై రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ అగ్ని ప్రమాదాలకు నిలయంగా మారిందని సంచలన కామెంట్స్‌ చేశారు. కాగా, నాంపల్లి అగ్ని ప్రమాదంపై రేవంత్‌ మాట్లాడుతూ..‘హైదరాబాద్‌ నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైంది. ఈ జరిగిన అ‍గ్ని ప్రమాదంలో తొమ్మిది మంది మృతిచెందడం అత్యంత బాధాకరమైన విషయం. అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో కారు మరమ్మత్తులు చేయడం ఏంటి?. రెసిడెన్షియల్‌ ఏరియాలో కెమికల్‌ డ్రమ్ములు ఎలా నిల్వ చేశారు.ఈ విషయంలో సమగ్ర విచారణ జరపాలి. ప్రమాదంలో మృతిచెందిన వారికి ప్రగాఢ సంతాపం. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి’ అని డిమాండ్‌ చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z