ష్ట్రంలో ఇంటర్‌మీడియట్ పరీక్షలను మార్చి 1 నుంచి ప్రారంభించేందుకు ఇంటర్ బోర్డు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. విద్యాశాఖ మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమోదం తీసుకొని ఈ వారం రోజుల్లో టైంటేబుల్‌ను ప్రకటించనుంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎగ్జామ్స్‌కు, జవాబుపత్రాల మూల్యాంకనానికి ఇబ్బంది లేకుండా ఈసారి కొంత ముందుగా పరీక్షలను ప్రారంభించాలని భావిస్తున్నారు. గత విద్యా సంవత్సరం మార్చి 15 నుంచి ప్రారంభమైంది. ఏప్రిల్ 1-15 మధ్య జేఈఈ మెయిన్ చివరి విడత ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఇంటర్ పరీక్షలు ముగిసిన తర్వాత కనీస గడువు ఉంటే విద్యార్థులు సన్నద్ధమవడానికి వీలవుతుంది. దానికితోడు ఇంటర్ తర్వాతే పదో తరగతి పరీక్షలు నిర్వహించాలి. ఈసారి జూన్ 1వ తేదీ నుంచే ఇంటర్ కళాశాలలు ప్రారంభం కావడంతో కనీసం మార్చి 1వ తేదీ నుంచి పరీక్షలు మొదలుపెట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్ ఉంటాయి.
ఈసారి మార్పులివీ…
ఈసారి ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు నైతికత, మానవీయ విలువల ఎగ్జామ్ ఉండదు. అందులోని అంశాలను ఆంగ్లం సబ్జెక్టులో మిళితం చేసినట్లు ఇంటర్‌బోర్డు వర్గాలు ఇప్పటికే స్పష్టంచేశాయి. గతంలో రాయని పాత విద్యార్థులకు మాత్రం ఉంటుంది. అయితే మొదటి సంవత్సరంలో పర్యావరణ విద్య పరీక్ష మాత్రం అందరికీ ఉంటుంది.
ఇంటర్ ఫస్టియర్‌లో ఆంగ్లం సబ్జెక్టులో 20 మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటాయి. రాత పరీక్ష 80 మార్కులకే నిర్వహిస్తారు. ప్రాక్టికల్స్‌ను ఆయా కళాశాలలే నిర్వహిస్తాయి. భాష అనేది మాట్లాడితేనే వస్తుందని భావించి ఈసారి మార్పులు చేశారు. జస్ట్ ఏ మినిట్ పేరిట.. ఇచ్చిన అంశంపై ఒక నిమిషం ఆంగ్లంలో మాట్లాడటం, ఒక పేరాను చదవడం, సొంతంగా ఏదైనా ఒక అంశంపై రాయడం, ఒక ఆడియో పాఠాన్ని విని ప్రశ్నలు రూపొందించడం లాంటి వాటిని ప్రాక్టికల్స్‌లో చేరుస్తున్నారు.
బ్రిడ్జి కోర్సు పరీక్షకు దరఖాస్తు, ఫీజు అవసరం లేదు
ఇంటర్ బైపీసీ, ఒకేషనల్ విద్యార్థులు బీటెక్‌లో చేరేందుకు గణితం బ్రిడ్జి కోర్సును పూర్తి చేసి ఉండాలి. ఇంటర్ పరీక్షలప్పుడు చివరిలో బ్రిడ్జి కోర్సు ఎగ్జామ్ నిర్వహిస్తారు. అది రాయాలంటే ఫీజు చెల్లించాలి. చాలా మంది విద్యార్థులకు ఇది తెలియడం లేదు. దాంతో వారు పరీక్షలు రాయడానికి వీల్లేకుండా పోతోంది. అందుకే ఈసారి బ్రిడ్జి కోర్సు పరీక్షకు ప్రత్యేకంగా దరఖాస్తు, ఫీజు అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అందరూ బ్రిడ్జి కోర్సుకు హాజరయ్యేలా హాల్‌టికెట్లపై తేదీలను ముద్రించనున్నారు. ఆసక్తి ఉన్న ప్రతి ఇంటర్ బైపీసీ, ఒకేషనల్ గ్రూపు విద్యార్థులు హాజరు కావచ్చు.
ప్రత్యేకావసరాల పిల్లలకు ఒక సబ్జెక్టు మినహాయింపు
ప్రత్యేకావసరాల పిల్లలకు ద్వితీయ భాష పరీక్ష మినహాయింపు ఉంటుంది. అది రాయకున్నా ఇబ్బంది లేదు. చాలా మందికి ఆ విషయం తెలియడం లేదు. సెకండియర్‌లో తెలుసుకొని మినహాయింపు అడిగితే ఫస్టియర్‌లో రాసినందున ఇప్పుడు మినహాయింపు కుదరదని అధికారులు తేల్చిచెబుతున్నారు. దాంతో ఈసారి ప్రథమ సంవత్సరంలో రాసినా రెండో ఏడాది మినహాయింపు ఇవ్వనున్నారు.
👉 – Please join our whatsapp channel here –