Business

ప్రజలకు ఆర్బీఐ హెచ్చరిక-వాణిజ్య వార్తలు

ప్రజలకు ఆర్బీఐ హెచ్చరిక-వాణిజ్య వార్తలు

* ప్రజలకు ఆర్బీఐ హెచ్చరిక

రుణ మాఫీ ఆఫర్ల పేరిట వార్తా పత్రికలు, సోషల్ మీడియా వేదికల్లో వస్తున్న వాణిజ్య ప్రకటనలను నమ్మి మోసపోవద్దని ప్రజలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) హెచ్చరించింది. వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో తీసుకున్న రుణాలు మాఫీ అవుతాయంటూ కొన్ని సంస్థలు చేస్తున్న ప్రచారం ఆర్బీఐ ద్రుష్టికి వచ్చింది. దీంతో అటువంటి అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు సూచించింది.‘రుణ మాఫీ ఆఫర్లంటూ కొన్ని సంస్థలు వార్తాపత్రికల్లో, సోషల్ మీడియా వేదికలపై విస్త్రుతంగా ప్రచారం చేస్తూ.. సర్వీస్ లేదా చట్టపరమైన ఫీజు పేరిట నగదు వసూలు చేసిన రుణ మాఫీ ధ్రువ పత్రాలు జారీ చేస్తున్నాయి. ఇలా ధ్రువ పత్రాలు జారీ చేసేందుకు సదరు సంస్థలకు అనుమతి లేదు’ అని ఆర్బీఐ తెలిపింది.‘ప్రజలు తీసుకున్న రుణాలు సదరు బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు తిరిగి చెల్లించనవసరం లేదని వినియోగదారులకు చెబుతున్నాయి. ఇటువంటి ప్రచారం వల్ల బ్యాంకులు, ఆర్థిక సంస్థల స్థిరత్వం, డిపాజిటర్ల ప్రయోజనాలు దెబ్బ తింటాయి. అసత్య ప్రచారం చేస్తున్న సంస్థలతో సంబంధాలు కలిగి ఉండటం వల్ల ఆర్థికంగా నష్టపోతారు. కనుక ఇటువంటి ప్రకటనలను నమ్మకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలి’ అని ఓ ప్రకటనలో ప్రజలకు ఆర్బీఐ సూచించింది.

బెల్లం పొడితో వ్యాపారం

మంచి వ్యాపారం చెయ్యాలని అనుకుంటున్నారా? ఎటువంటి రిస్క్ లేకుండా అదిరిపోయే బిజినెస్ ఐడియాను మీకోసం తీసుకొచ్చాము.. అదేంటంటే బెల్లం బిజినెస్.. ఆల్రెడీ మార్కెట్ లో చాలా మంది చేస్తున్నారు అనుకుంటున్నారా? అదేనండి బెల్లం పొడితో వ్యాపారం.. తక్కువ ఖర్చుతో అధిక లాభాలను పొందవచ్చు.. ఈ బిజినెస్ ను ఎలా మొదలు పెట్టాలి.. ఎంత లాభాలు వస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక సమస్యలు వస్తుండటంతో ఎక్కువగా బెల్లంను వినియోగించేవారి సంఖ్య నానాటికి పెరుగుతూ వస్తుంది. అందరూ ఆర్గానిక్ బెల్లం పొడిని వాడుతున్నారు. ఆరోగ్య నిపుణులు కూడా అదే సూచిస్తున్నారు. చెరుకు రసం తయారు చేసిన బెల్లం పానకంలో ఎలాంటి రసాయనాలు కలపరు. గడ్డకట్టించి బెల్లంగా దాన్ని మారుస్తారు.. ఇది పొడి రూపంలో మనకు మార్కెట్ లో దొరుకుంది…దీన్ని మీరు తయారు చేస్తూ అధిక లాభాలను పొందవచ్చు.. ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి మీరు ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాలి.. నిజానికి రైతులే బెల్లం పొడిని తయారు చేస్తారు.. వారి దగ్గర నుంచి క్వింటాల్ లెక్కన కొనుగోలు చెయ్యాలి.. అప్పుడు మీకు తక్కువ రేటుకు వస్తుంది.. దాన్ని కిలో లెక్కన ఫ్యాక్ చేసి బయట మార్కెట్ లో అమ్మవచ్చు.. ఈ బెల్లం పొడి ధర కిలో 50 నుండి 60 రూపాయలు ఉంటుంది.. దీనికి సంబందించిన వీడియోలు కూడా నెట్టింట చాలానే దొరుకుతున్నాయి.. వాటిని చూస్తే ఒక అవగాహనా కూడా వస్తుంది..

ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ వృద్ధికి కొత్త పథకం!

దేశంలో ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీని పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. అందుకోసం కొత్త పథకాన్ని తీసుకొచ్చే పనిలో ఉందని ప్రభుత్వాధికారి ఒకరు సోమవారం ప్రకటనలో వెల్లడించారు. పరిశ్రమల సంఘం సీఐఐ ఎలక్ట్రానిక్స్ సమ్మిట్‌లో ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ మాట్లాడుతూ, ప్రస్తుతం దేశీయంగా తయారవుతున్న పరికరాలు 99 శాతం స్థానిక మార్కెట్లో ఉన్నాయని, తదుపరి దశకు చేరడానికి కంపెనీలు ప్రపంచ మార్కెట్లో పోటీతత్వాన్ని మెరుగుపరిచేందుకు ఎగుమతులు చేపట్టాలని అన్నారు.దేశీయంగా తయారీని 10-15 శాతం వరకే పరిమితం చేయకుండా, మరింత మార్కెట్ వాటాను సొంతం చేసుకునేందుకు ఏం చేయాలనే దానిపై పరిశీలన జరగాలని, దీన్ని కీలక సవాలుగా తీసుకోవాలని కృష్ణన్ చెప్పారు. మొత్తం సరఫరాను ఏ ఒక్క దేశమూ సొంతం చేసుకోలేదనే విషయం గుర్తుంచుకోవాలి, భారత్ లక్ష్యం తయారీలో ఎంత భాగం కలిగి ఉన్నామో అనేదానిపై ఉండాలని ఆయన పేర్కొన్నారు.ఎలక్ట్రానిక్స్ కంపోనెంట్స్ అండ్ సెమీకండక్టర్ల తయారీ ప్రోత్సాహక పథం(ఎస్‌పీఈసీఎస్)పై ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఎలక్ట్రానిక్స్ తయారీకి అవసరమైన మూల పరికరాలను కూడా కంపెనీలు స్థానికంగా ఉత్పత్తి చేయడంపై ఆలోచించాలని పేర్కొన్నారు.

* భారీగా తగ్గిన బంగారం ధర

దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారెట్స్) ధర రూ.900 తగ్గి రూ.61,300 వద్ద ముగిసింది. గ్లోబల్ మార్కెట్లలో బలహీనతల ప్రభావం దేశీయ బులియన్ మార్కెట్ పైనా పడిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ పేర్కొంది. కిలో వెండి ధర కూడా రూ.200 పతనమై రూ.76,000 వద్ద స్థిర పడింది. ఆదివారం 24 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.62 వేలుగా స్థిరపడింది.అమెరికాలో జాబ్స్ డేటా పుంజుకున్న తర్వాత యూఎస్ ట్రెజరీ బాండ్లు, డాలర్ విలువ కూడా పెరగడంతో ఇన్వెస్టర్లు బంగారంపై సోమవారం ఇన్వెస్ట్‌మెంట్లు తగ్గించారని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమొడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.ఓవర్సీస్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1995 డాలర్ల వద్ద తచ్చాడుతుంటే, ఔన్స్ వెండి ధర 22.98 డాలర్ల వద్ద కొనసాగుతున్నది. కామెక్స్‌లో స్పాట్ గోల్డ్ ధర 10 డాలర్లు తగ్గి 1995 డాలర్లు పలికింది. గతవారం ఆల్ టైం గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత బంగారం ధర బలహీన పడిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది. గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్లో సోమవారం రూ.95 తగ్గి, రూ.61,624 లకు చేరుకున్నది. యూఎస్ కస్టమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) డేటా విడుదలతోపాటు యూఎస్ ఫెడ్ రిజర్వ్ సమావేశం నేపథ్యంలో బంగారానికి ధర తగ్గిందని సౌమిల్ గాంధీ తెలిపారు. న్యూయార్క్ లో బంగారం ఔన్స్ ధర 0.06 శాతం తగ్గుముఖం పట్టి, 2013 డాలర్ల వద్ద నిలిచింది.

తొలిసారి 70వేల మార్క్‌ను దాటిన సెన్సెక్స్‌.

దేశీయ బెంచ్‌ మార్క్‌ సూచీలు సోమవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌, నిఫ్టీ తొలిసారిగా జీవనకాల గరిష్ఠానికి చేరాయి. సెన్సెక్స్‌ తొలిసారిగా 70వేల మార్క్‌ను దాటగా.. నిఫ్టీ సైతం 21,026 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. ఉదయం సూచీలు లాభాలతో మొదలయ్యాయి. బెంచ్‌మార్క్‌ సూచీలు తొలిసారిగా ఆల్‌టైమ్‌ హైకి చేరుకోవడంతో మదుపరులు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్‌ 69,925.63 పాయింట్ల వద్ద ప్రారంభం కాగా.. ఇంట్రాడేలో 70,057.83 పాయింట్ల వద్ద ఆల్‌టైమ్‌ హైకి చేరగా.. చివరకు 102.93 పాయింట్ల లాభంతో 69,928.53 వద్ద ముగిసింది.నిఫ్టీ సైతం తొలిసారిగా 21,026.10 పాయింట్ల గరిష్ఠాన్ని చేరుకుంది. చివరకు 27.70 పాయింట్ల లాభంతో 20,997.10 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 2,211 షేర్లు పురోగమించగా.. 1358 షేర్లు క్షీణించాయి. 174 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో యూపీఎల్‌, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఆటో, అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఎల్‌టీఐమైండ్‌ట్రీ టాప్‌ గెయినర్స్‌గా నిలువగా.. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, సిప్లా, యాక్సిస్ బ్యాంక్, బీపీసీఎల్‌, ఎంఅండ్‌ఎం నష్టపోయాయి. పీఎస్‌యూ బ్యాంక్‌, ఎఫ్‌ఎంసీజీ, క్యాపిటల్‌ గూడ్స్‌, పవర్‌, మెటల్‌, రియల్టీ 0.5శాతం నుంచి ఒక్కోశాతం వరకు పెరిగాయి. ఫార్మా ఇండెక్స్‌ 0.4శాతం పతనమయ్యాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఒకశాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.7 శాతం పెరిగాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z