Business

అప్పటికల్లా ప్రతి ఒక్కరికి బీమా

అప్పటికల్లా ప్రతి ఒక్కరికి బీమా

2047 నాటికి అందరికీ బీమా అందించడంలో ఎల్‌ఐసీ (LIC) కీలక పాత్ర పోషిస్తుందని సంస్థ ఛైర్మన్‌ సిద్ధార్థ మొహంతి తెలిపారు. ఈ లక్ష్యాన్ని అందుకోవడంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసం ప్రత్యేక పాలసీలను తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో వీలైనంత ఎక్కువ మంది గ్రామీణ ప్రజలకు బీమా అందించడంపై దృష్టి సారిస్తామన్నారు. తమ వ్యాపారంలో వాళ్ల వాటాను గణనీయంగా పెంచుతామని తెలిపారు.

బీమా విస్తరణలో భాగంగా ఐఆర్‌డీఏఐ (IRDAI) ‘బీమా విస్తార్‌’ అనే సమగ్ర పాలసీని ప్రతిపాదించిందని మొహంతి వెల్లడించారు. అందుకు ఆ నియంత్రణా సంస్థకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. జీవిత, ఆరోగ్య, ప్రాపర్టీ బీమాతో కూడిన పాలసీయే బీమా విస్తార్‌ అని వివరించారు. దీన్ని విక్రయించడం కోసం ‘మహిళా ఆధారిత పంపిణీ ఛానెల్‌’ ద్వారా ‘బీమా వాహక్‌’లను నియమిస్తామన్నారు.

బ్రిటీష్ పాలన నుంచి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 2047 నాటికి వందేళ్లు పూర్తవుతుంది. అప్పటికల్లా భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి, ప్రపంచంలో భారత్‌ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. అయితే, ప్రపంచ సగటుతో పోలిస్తే బీమా పంపిణీ మాత్రం తక్కువగా ఉంది.

గ్రామ పంచాయతీల స్థాయిలో ‘బీమా వాహక్‌’ల పేరిట ప్రత్యేక పంపిణీ ఛానెల్‌ను ఐఆర్‌డీఏఐ ప్రతిపాదించింది. అందుకు సంబంధించిన ముసాయిదా మార్గదర్శకాలను ఈ ఏడాది జూన్‌లో విడుదల చేసింది. బీమా పంపిణీ కోసం ‘కార్పొరేట్ బీమా వాహక్‌’లతో పాటు ‘వ్యక్తిగత బీమా వాహక్‌’లను నియమించాలని ఈ మార్గదర్శకాలు సిఫార్సు చేశాయి. ‘కార్పొరేట్ బీమా వాహక్‌’లు సంబంధిత చట్టాలకు అనుగుణంగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వీరిని బీమా సంస్థలు నియమించుకుంటాయి. మరోవైపు ‘వ్యక్తిగత బీమా వాహక్‌’లను బీమా సంస్థలు లేదా ‘కార్పొరేట్‌ బీమా వాహక్‌’లు నియమించుకుంటాయి.

మరోవైపు తమ కార్యకలాపాల డిజిటలీకరణ కోసం LIC.. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రాజెక్టు DIVE (డిజిటల్ ఇన్నోవేషన్ అండ్ వాల్యూ ఎన్‌హాన్స్‌మెంట్)ని ప్రారంభించింది. దీని నిర్వహణకు ఒక కన్సల్టెంట్‌ను కూడా నియమించుకుంది. ‘‘డైవ్ ప్రాజెక్ట్ ద్వారా మా వాటాదారులు, కస్టమర్లు, మధ్యవర్తులు, మార్కెటింగ్ వ్యక్తులు, ప్రతి ఒక్కరికీ అత్యుత్తమ డిజిటల్ కార్యక్రమాలను అందించడమే మా లక్ష్యం’’ అని మొహంతి చెప్పారు. తొలి దశలో భాగంగా కస్టమర్లను చేర్చుకునే ప్రక్రియను డిజిటలీకరిస్తామని ఆయన చెప్పారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z