Business

అయోధ్యకు దిల్లీ నుంచి విమాన సర్వీసులు

అయోధ్యకు దిల్లీ నుంచి విమాన సర్వీసులు

రామమందిర ప్రారంభం వేళ శ్రీరాముడి జన్మభూమి అయోధ్య (Ayodhya) నగరానికి విమాన సర్వీసులు నడపనున్నట్లు ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా (Air India) ప్రకటించింది. ఇందులో భాగంగా డిసెంబర్‌ 30న తొలిసారి దిల్లీ నుంచి అయోధ్యకు విమానం నడపనున్నట్లు వెల్లడించింది. ఆ తర్వాత జనవరి 16 నుంచి ఈ మార్గంలో ప్రయాణికులకు రోజువారీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. IX 2789 విమానం డిసెంబర్‌ 30న దిల్లీలో ఉదయం 11గంటలకు బయల్దేరి.. మధ్యాహ్నం 12.20 గంటలకు అయోధ్యలోని మర్యాద పురుషోత్తమ్‌ శ్రీరామ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటుందని అధికారులు తెలిపారు. అలాగే, అదే రోజు మధ్యాహ్నం 12.50గంటలకు అయోధ్యలో బయల్దేరి మధ్యాహ్నం 2.10గంటలకు దిల్లీకి చేరుకుంటుందన్నారు. అయోధ్యలో నిర్మించిన విమానాశ్రయ ప్రారంభోత్సవం జరిగిన వెంటనే అక్కడికి తమ సర్వీసులు నడిపేందుకు ఉత్సాహంగా ఉన్నామని.. ఇది దేశ వ్యాప్తంగా టైర్‌ 2, టైర్‌ 3 నగరాల నుంచి కనెక్టివిటీని పెంచాలన్న తమ నిబద్ధతకు నిదర్శనమని ఎయిరిండియా ఎండీ అలోక్‌ సింగ్‌ తెలిపారు.

జనవరి 6 నుంచి ఇండిగో సర్వీసులు
మరోవైపు, దిల్లీ నుంచి అయోధ్య విమానాశ్రయానికి డిసెంబర్‌ 30న తొలిసారి విమానం నడపనున్నట్లు ఇప్పటికే ఇండిగో ప్రకటించింది. ఆ తర్వాత జనవరి 6 నుంచి రోజువారీ సర్వీసులు ప్రారంభిస్తామని తెలిపింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI) దాదాపు రూ.350 కోట్లతో అభివృద్ధి చేసిన అయోధ్య విమానాశ్రయం కోసం ఏవియేషన్ రెగ్యులేటర్ DGCA ఏరోడ్రోమ్ లైసెన్స్‌ను డిసెంబర్ 14న జారీ చేసింది. ఈ నెలాఖరుకు విమానాశ్రయం సిద్ధమవుతుందని.. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా దాన్ని ప్రారంభించనున్నట్లు ఇటీవల విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపిన విషయం తెలిసిందే.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z