DailyDose

పురుషులకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం!

పురుషులకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం!

స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం.. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం’.. ఆర్టీసీ బస్సుల్లో మనం తరచూ చూసే ఈ నినాదం ఇక మారనున్నది. ‘పురుషులకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం’ అని ఇకపై కనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన మహిళల ఉచిత బస్సు ప్రయాణంతో పురుషులకు సీట్లు దొరకని పరిస్థితి నెలకొన్నది. చాలాచోట్ల మహిళలు భారీ ఎత్తున బస్సు ప్రయాణాలకు మొగ్గుచూపుతుండటంతో పురుషులకు సీట్లు దొరకడం లేదు. ఆర్టీసీ బస్సుల్లో పెరుగుతున్న రద్దీతో పురుషులు బస్కెక్కే పరిస్థితులు లేకుండా పోతున్నాయి. టికెట్‌ కొన్న తమకు సీట్లు లేకపోతే ఎలా అంటూ పురుషులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు స్త్రీ, పురుషుల మధ్య ప్రతి బస్సులో వాగ్యుద్ధాలు చోటుచేసుకుంటున్నాయి. మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని అమలు చేసిన ప్రభుత్వం దానికి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచకపోవడంతో కూడా రద్దీ పెరుగుదలకు మరో ముఖ్యమైన కారణం. ఇలాంటి పరిస్థితుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం భావిస్తున్నది. ఈ మేరకు పురుషులకు ప్రత్యేక సీట్ల ఆలోచనకు తెరలేపింది.

డిపోల వారీగా అభిప్రాయాల సేకరణ
ప్రతీ బస్సులోనూ మొత్తం 55 సీట్లలో 20 సీట్లు పురుషులకు రిజర్వ్‌ చేసే అంశాన్ని ఆర్టీసీ ఉన్నతాధికారులు తీవ్రంగా పరిశీలిస్తున్నారు. ఈ మేరకు అన్ని డిపోల నుంచి వివరాలు పంపాలని కోరుతూ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా డిపో మేనేజర్ల అభిప్రాయాలనూ తప్పనిసరిగా తెలుసుకోనున్నారు. డిపోల వారీగా నివేదికలు వచ్చాక పురుషులకు రిజర్వ్‌డ్‌ సీట్ల అంశంపై టీఎస్‌ఆర్టీసీ సంస్థ నిర్ణయం తీసుకోనున్నది. దీంతో ఒకప్పుడు మహిళలకు కేటాయించినట్టుగానే ఇప్పుడు పురుషులకు బస్సుల్లో రిజర్వ్‌ సీట్లు కేటాయించే అంశంపై చర్చనీయాంశంగా మారింది.

దేశ చరిత్రలోనే వినూత్నం
రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు ప్రత్యేక సీట్లు కేటాయిస్తే ఇది దేశంలో వినూత్న అంశంగా నిలువనున్నది. అయితే ఈ విషయంపై ఏమైనా వ్యతిరేకత వస్తుందా.. లేదా.. అన్ని మీమాంస అధికారుల్లో నెలకొన్నది. ఎందుకంటే దేశంలో ఇప్పటివరకూ మహిళలకే తప్ప పురుషులకు ఇలా సీట్లు రిజర్వ్‌ చేసిన దాఖలాలు ఎక్కడా లేవు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం తొలి గ్యారెంటీగా అమలు
కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణ పథకం ఒకటి. ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక తొలుత అమలు చేసిన రెండింటిలో ఇది ఒకటి. రాష్ట్రంలో మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించింది. స్థానికత కోసం గుర్తింపు కార్డు చూపితే కండక్టర్లు జీరో టికెట్‌ జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో విపరీతమైన రద్దీ పెరిగింది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు సైతం నిల్చొని ప్రయాణించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున వినతలు వస్తుండటంతో పురుషుల సీట్ల రిజర్వ్‌పై ఆర్టీసీ యోచిస్తున్నది.

పలుచోట్ల పురుషుల నిరసనలు
ఆర్టీసీ బస్సుల్లో సీట్లు దొరకకపోవడంతో పలుచోట్ల పురుషులు నిరసనలు తెలిపిన ఘటనలు చోటుచేసుకొన్నాయి. బస్సుల్లో మహిళలతోనే సీట్లు నిండిపోవడంతో పలువురు పురుషులు ఇటీవల హైదరాబాద్‌లోని మెహిదీపట్నం బస్టాండ్‌లో నిరసన వ్యక్తం చేశారు. కనీసం 15 శాతం సీట్లు పురుషులకు కేటాయించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. తనకు సీటు లేదని నిజామాబాద్‌ జిల్లా ఆర్మూరులో ఏకంగా ఓ యువకుడు ఆర్టీసీ బస్సుకు అడ్డంగా కూర్చొని చాలాసేపు నిరసన తెలిపాడు. తోటి ప్రయాణికులు సర్దిచెప్పాక ఆ యువకుడు శాంతించాడు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z