DailyDose

ఓటింగ్‌ పూర్తయ్యేవరకు వాళ్లందర్నీ చూసుకోవాల్సిన బాధ్యత నీదే!

ఓటింగ్‌ పూర్తయ్యేవరకు వాళ్లందర్నీ చూసుకోవాల్సిన బాధ్యత నీదే!

వేటు.. ఇప్పటి వరకూ వైకాపా ఎమ్మెల్యేలను టెన్షన్‌ పెట్టిన మాట. ఓటు.. ఇప్పుడు ఆ పార్టీ అధినాయకత్వాన్ని కంగారు పెడుతున్న మాట ఇప్పటి వరకూ సర్వేలు, వ్యతిరేకత, పనితీరు, సామాజికవర్గాల ఓట్ల లెక్కలతో సిటింగ్‌ ఎమ్మెల్యేల సీట్లకు ఎసరు పెడుతూ.. వారి స్థానంలో కొత్త సమన్వయకర్తల నియామకం చేపట్టిన ముఖ్యమంత్రి జగన్‌ ఇప్పుడు విధిలేని పరిస్థితుల్లో నెమ్మదించారు. టికెట్లు ఎవరికి ఎగ్గొట్టబోతున్నారో వారిని పిలిచి సముదాయించి, ఒప్పించాకే ఆయా స్థానాల్లో మార్పుచేర్పులు చేసేందుకు సిద్ధమవుతున్నారు. సీఎం ఇలా ఆచితూచి అడుగులేయడానికి కారణం మార్చిలో మూడు రాజ్యసభ స్థానాలకు జరగనున్న ఎన్నికలు! తమకు టికెట్లివ్వకుండా వేటేస్తే.. రాజ్యసభ ఎన్నికల్లో తాము పార్టీ అభ్యర్థికి ఓటేయబోమని ఎమ్మెల్యేలు సంకేతాలిస్తున్నారన్న అంశం వైకాపా అధిష్ఠానాన్ని కలవరపెడుతోంది.

వేటు.. చేటు తేనుందా?
రాష్ట్రం నుంచి ఎన్నికైన ముగ్గురు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (వైకాపా), కనకమేడల రవీంద్రకుమార్‌ (తెదేపా), సీఎం రమేశ్‌ (భాజపా)ల పదవీకాలం వచ్చే ఏప్రిల్‌లో ముగియనుంది. ఆలోగానే ఈ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం పరంగా చూస్తే వైకాపా ఈ మూడింటినీ కైవసం చేసుకునేందుకు అవకాశం ఉంది. దీంతో అధికార పార్టీ ఈ మూడు స్థానాలకు అభ్యర్థులను సిద్ధం చేసుకుంటోంది. ఈ క్రమంలో ఎమ్మెల్యేలపై వేటు చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఎమ్మెల్యేలపై ఎడాపెడా వేటు వేస్తున్నారు.. కొంతమందికి పూర్తిగా మొండిచెయ్యి చూపిస్తే.. మరికొందర్ని సిటింగ్‌ స్థానాల నుంచి మార్చేస్తున్నారు.

ఇలా సీట్లు కోల్పోయినవారు ఇప్పటికే పార్టీ అధిష్ఠానంపై తిరుగుబావుటా ఎగరవేశారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అయితే ఎమ్మెల్యే పదవికి, పార్టీకి కూడా గుడ్‌బై చెప్పేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు (జగ్గంపేట), పెండెం దొరబాబు (పిఠాపురం), కొండేటి చిట్టిబాబు (పి.గన్నవరం) ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. వీరిలో ఇద్దరు ఇప్పటికే తెదేపాతో టచ్‌లోకి వెళ్లారనే చర్చ జరుగుతోంది. మరో ఎమ్మెల్యే వర్గం మాత్రం తమ నాయకుడికే టికెట్‌ ఇవ్వాలంటూ భీష్మించుకుంది.

ఇప్పుడు దొరికింది ‘ఓటు’ అస్త్రం
నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పుచేర్పులు చేస్తున్న సీఎం ఎప్పుడు తమపై వేటు వేస్తారోననే ఆందోళనలో ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యసభ ఎన్నికలు వారికి కొంత ఉపశమనం కలిగించబోతున్నాయనే చర్చ మొదలైంది. మూడు రాజ్యసభ స్థానాల్లోనూ గెలవాలంటే పార్టీలోని ఎమ్మెల్యేలందరి ఓట్లూ కీలకమే. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నలుగురు సొంత ఎమ్మెల్యేలు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటేశారు. అప్పుడే ఆ పరిస్థితి ఉంటే.. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వం కానీ, రాజ్యసభ ఎన్నికల్లో మన అభ్యర్థులకు ఓటేయండి అంటే ఎమ్మెల్యేలు ఎంత వరకు సహకరిస్తారని అధినాయకత్వం తల పట్టుకుంటోంది. ఎమ్మెల్యేలు మాత్రం ‘ఓటు’పతాస్త్రం వినియోగించుకునే సమయం వచ్చిందని సంకేతాలిస్తున్నారు.

అటూ ఇటైతే గట్టి దెబ్బే..
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగినట్లుగా రాజ్యసభ ఎన్నికల్లో పార్టీకి కాస్త అటూ ఇటూ అయిందంటే దాని ప్రభావం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిగానే పడుతుందని వైకాపా అధినాయకత్వం అంచనా వేస్తోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఎదురుతిరిగితే జనంలోకి దారుణమైన సంకేతాలు వెళతాయనే టెన్షన్‌లో అధిష్ఠానం ఉందని వైకాపా వర్గాల్లో చర్చ జరుగుతోంది.

టికెట్‌ ఇవ్వనంటే చెప్పొచ్చుగా.. డొంకతిరుగుడేల?
తాను గతంలో గెలిచిన లోక్‌సభ స్థానం నుంచే ఈసారి పోటీ చేస్తానని సీఎం సమీప బంధువు ఒకరు ఆయన్ను అడిగారు. ఆ సీటు కాదు గానీ.. రాజ్యసభ టికెట్‌ ఇస్తానని జగన్‌ తేల్చిచెప్పారు. అయితే ‘నీకు రాజ్యసభ సీటిస్తా.. నువ్వు గెలిచేందుకు అవసరమైనంత మంది ఎమ్మెల్యేలనూ అప్పగిస్తా.. ఓటింగ్‌ పూర్తయ్యేవరకు వాళ్లందర్నీ చూసుకోవాల్సిన బాధ్యత నీదే’ అని షరతు పెట్టారు. ముఖ్యమంత్రి ఇచ్చిన ట్విస్ట్‌కు ఆ బంధువు హతాశుడయ్యారు. ‘ఇదేం చోద్యం? ఇచ్చే ఉద్దేశం లేకపోతే ఇవ్వనని చెప్పాలే గానీ, టికెట్‌ ఇస్తున్నట్లు చెప్పి ఇరకాటంలోకి నెట్టేయడం ఎందుకు? పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఆయన చెబితేనే వినని ఎమ్మెల్యేలు నేను చెబితే వింటారా? నాకు ఓటేయండి అంటే వేసేస్తారా’ అని ఆ నేత సన్నిహితుల వద్ద ఆవేదన వెళ్లబోసుకుంటున్నారు. పైగా ఆయన ఇప్పుడు పార్టీని ఒక ప్రాంతంలో సమన్వయం చేస్తున్నారు. అక్కడి ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తల స్థానాల మార్పుచేర్పుల ప్రక్రియలో ఆయనే కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరి ఆ ప్రాంతంలోని సిటింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లు ఎగిరిపోతే ఆ ప్రభావం అక్కడే కాదు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోని ఎమ్మెల్యేలపైనా పడుతుంది.. వారు కూడా తనకు సహకరించరు కదా అనేది ఆయన వాదన.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z