Agriculture

భూముల రీ-సర్వేపైనా చాలాచోట్ల రైతుల నుంచి అభ్యంతరాలు

భూముల రీ-సర్వేపైనా చాలాచోట్ల రైతుల నుంచి అభ్యంతరాలు

ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం(ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌)పై వస్తున్న అభ్యంతరాలు, ఆందోళనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి కాస్త దిగొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ చట్టం అమలుకు సంబంధించి నియమ నిబంధనలు జారీ విషయంలో వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. చట్టం అమల్లో భాగంగా ‘ఆంధ్రప్రదేశ్‌ ల్యాండ్‌ అథారిటీని’ ఏర్పాటుచేస్తూ గత వారం ప్రభుత్వం గెజిట్‌ జారీచేసింది. దీనిని అనుసరించి జిల్లా స్థాయి నియామకాలు, అమలుకు సంబంధించి నియమ నిబంధనలు (రూల్స్‌) ఇవ్వాలి. ప్రస్తుతం రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లోనే ఈ చట్టాన్ని అమలుచేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ మేరకు ఎన్ని గ్రామాల్లో ఈ చట్టాన్ని అమలుచేయాలంటే.. అన్ని గ్రామాల్లోనూ నోటిఫికేషన్లు జారీచేయాలి. వీటికి తగ్గట్లు ఉమ్మడి రూల్స్‌ జారీ జరగాలి.

అప్పుడే ఈ చట్టాన్ని అనుసరించి అవసరమైన చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. అయితే చట్టంలోని కొన్ని సెక్షన్లు ప్రజల ఆస్తుల రక్షణకు శరాఘాతంగా ఉన్నాయని న్యాయవాదులు, మేధావులు ఆందోళన వ్యక్తంచేసున్న విషయం తెలిసిందే. మరోవైపు ప్రభుత్వం చేపట్టిన భూముల రీ-సర్వేపైనా చాలాచోట్ల రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పాస్‌పుస్తకాల్లో తప్పుల సవరణ ప్రక్రియకు కూడా సమయం పట్టే అవకాశం ఉంది. వీటన్నింటి దృష్ట్యా నియమ నిబంధనల జారీపై వైకాపా సర్కారు సందిగ్ధంలో పడింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నిబంధనల జారీతో పరిస్థితులు సంక్లిష్టంగా మారవచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల తర్వాత దీనిపై ముందుకెళ్లాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.

చట్టంలో పేర్కొన్న విధంగా రెవెన్యూ శాఖకు అధికారాలను కల్పిస్తే ప్రజల ఆస్తులకు రక్షణ ఏముంటుందని న్యాయవాదులు, మేధావులు ప్రశ్నిస్తున్నారు. గత వారం వెలువడిన ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రకారం…ఏపీ ల్యాండ్‌ అథార్టీ(ఏపీఎల్‌ఏ) ‘ఏ వ్యక్తినైనా’ టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి(టీఆర్వో)గా నియమించవచ్చు. టీఆర్‌వో ఉత్తర్వులపై అభ్యంతరం ఉన్నా ల్యాండ్‌ టైటిలింగ్‌ అప్పీలేట్‌ ఆఫీసర్‌(ఎల్‌టీఏవో) ముందు రెండేళ్లలోపు క్లైమ్‌ దాఖలు చేసుకోవాలి. జాయింట్‌ కలెక్టర్‌ స్థాయికి తగ్గని ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మందిని అప్పీలేట్‌ ఆఫీసర్‌గా జిల్లాకొకరిని నియమిస్తారు. అప్పీలేట్‌ అధికారికి సుమోటోగా కేసులు విచారించే అధికారం కల్పించారు.

సెక్షన్‌ 16(1) ప్రకారం ఏపీ ల్యాండ్‌ అథారిటీ జారీచేసిన ఉత్తర్వులపై లేదా అప్పీలేట్‌ అధికారి ఇచ్చిన ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే కేవలం హైకోర్టులోనే రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేసుకోవాలి. టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌, ల్యాండ్‌ టైటిలింగ్‌ అప్పీలేట్‌ అధికారులకు కల్పించిన భూ వివాదాల పరిష్కారం, రికార్డుల్లో వివరాల నమోదు తదితర వ్యవహారాల్లో సివిల్‌ కోర్టులో విచారణలకు స్వీకరించకుండా ఉండేలా సెక్షన్‌ 38ని తెచ్చారు. దీనివల్ల భూ వివాదాలలో జోక్యం చేసుకోకుండా సివిల్‌ కోర్డులను కట్టడి చేసినట్లయింది. ఈ చర్యలనే న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొన్ని రోజులుగా కోర్టు విధులను బహిష్కరిస్తున్నారు. ఈ అంశంపై హైకోర్టులో వ్యాజ్యాలు కూడా దాఖలయ్యాయి. వీటిపై త్వరలో విచారణ జరగనుంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z