Food

ఆహారం ఎంత పులిస్తే అంత మంచిదా?

ఆహారం ఎంత పులిస్తే అంత మంచిదా?

పులియబెట్టిన ఆహారంలో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయని మరోమారు స్పష్టమైంది. రాగులు, సజ్జలు, జొన్నలతో చేసిన ఆహార పదార్థాలపై జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) జరిపిన తాజా పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ఆహారానికి పెరుగు కలిపి, కలపకుండా రెండు వేర్వేరు అధ్యయనాలు చేయగా పోషకాల్లో వచ్చిన మార్పులను అధ్యనకారులు గుర్తించారు. నిజానికి మన పూర్వీకులు పులియబెట్టిన ఆహారపదార్థాలనే తరచూ తీసుకునేవారు. అందులో చద్దన్నం ఒకటి. రాత్రి మిగిలిన అన్నంలో పెరుగు, పాలు, సరిపడా నీళ్లు పోసి ఉదయం దానిని అల్పాహారంగా తీసుకునేవారు. అలా తీసుకున్న వారికి ప్రొబయోటిక్స్‌తోపాటు శరీరానికి సరిపడా క్యాల్షియం, ఐరన్‌, జింక్‌ వంటి పోషకాలు అందేవి. జీవనశైలితోపాటు క్రమంగా ఈ అలవాట్లు కూడా మారిపోయాయి. చద్దన్నం స్థానంలో టిఫిన్లు వచ్చి చేరాయి. ప్రస్తుతం మిల్లెట్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో మిల్లెట్లతో చేసిన ఆహారాన్ని పులియబెట్టడం వలన కలిగే రసాయనిక మార్పులను పరిశీలించి ఈ విషయాన్ని వెల్లడించారు.

పెరిగిన మైక్రో న్యూట్రిషన్ల పరిమాణం
సజ్జలు, రాగులు, జొన్నపిండితో చేసిన ఆహారాన్ని శాస్త్రవేత్తలు పలు రకాలుగా పరిశీలించారు. వండిన, పెరుగుతో పులియబెట్టిన, పెరుగు లేకుండా పులియబెట్టిన, ఎక్కువ పెరుగు కలిపి పులియబెట్టిన ఆహార పదార్థాల్లోని పోషకాల మార్పులను పరిశీలించారు. వండిన ఆహారం కంటే పులియబెట్టిన ఆహారంలో ప్రొటీన్లతోపాటు మైక్రోన్యూట్రిషన్ల పరిమాణం పెరిగినట్టు గుర్తించారు. రాత్రంతా నిల్వ ఉంచిన ఆహారంలో ఐరన్‌, జింక్‌, సూక్ష్మ పోషకాలు కూడా గణనీయంగా పెరిగాయని, సులభంగా కరిగిపోయే పోషకాలు సాధారణంగా వండిన పదార్థాల కంటే పులిసిన దాంట్లోనే ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. తృణధాన్యాలను సంప్రదాయక పద్ధతుల్లో వండుకోవడం మంచిదని, దీనివల్ల పోషకాలు పెరుగుతాయని శాస్త్రవేత్తలు వివరించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z