Movies

యండమూరికి లోకనాయక్ పురస్కార ప్రదానం

యండమూరికి లోకనాయక్ పురస్కార ప్రదానం

చిరంజీవి (Chiranjeevi) తన జీవిత చరిత్ర పుస్తకం రాసే బాధ్యతను ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌కు అప్పగించారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖ రుషికొండ ఏ-1 గ్రాండ్ కన్వెన్షన్ వేదికగా ఎన్టీఆర్ 28వ పుణ్యతిథి, ఏయన్నార్‌ శత జయంతి కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా యండమూరి వీరేంద్రనాథ్‌ను ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తదితరులతో కలిసి సత్కరించి సాహిత్య పురస్కారం, రూ.2 లక్షల నగదు చెక్కును అందించారు.

అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘నేను స్టార్‌గా ఎదగడానికి యండమూరి రచనలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆయన మేధా సంపత్తి నుంచి వచ్చిన పాత్రలే నా కెరీర్‌కు సోపానాలు అయ్యాయి. ఆయన సినిమాలతోనే నాకు మెగాస్టార్‌ బిరుదు వచ్చింది. ‘అభిలాష’ నవల గురించి నాకు మొదట మా అమ్మ చెప్పింది. అదే నవలను కేఎస్‌ రామారావుగారు నన్ను హీరోగా పెట్టి సినిమా తీశారు. కోదండరామిరెడ్డి దర్శకత్వం, ఇళయరాజా పాటలు మంచి పేరు తెచ్చాయి. కెరీర్‌లో నేను సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకోవడానికి ఉపయోగపడ్డాయి. ‘ఛాలెంజ్‌’ ఎంతో మంది యువతను ప్రభావితం చేసింది. నా సినిమా విజయాల్లో సింహభాగం యండమూరి వీరేంద్రనాథ్‌ రచనలదే. ఆయన నా బయోగ్రఫీ రాస్తాననడం నిజంగా సంతోషంగా ఉంది’’

‘‘యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ నాకు చిరకాల మిత్రులు. అన్ని రంగాల్లోనూ ఆయన రాణించారు. నాకు గురు సమానులైన ఎన్టీఆర్‌, ఏయన్నార్‌లను గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన చెప్పగానే మరో ఆలోచన లేకుండా వస్తానని అన్నాను. తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్లుగా భావించే వారితో కలిసి పనిచేయడం నా అదృష్టం. ప్రేక్షకులు మెచ్చేలా ఇద్దరూ పోటీపడి సినిమాలు తీశారు. ‘తిరుగులేని మనిషి’ షూటింగ్‌ సందర్భంగా నేనే స్వయంగా స్టంట్‌ చేస్తుంటే, నాకు ఒక సూచన చేశారు ‘ఆర్టిస్ట్‌లది విలువైన జీవితం, ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా జరిగితే నిర్మాత నష్టపోతాడు’ అని అన్నారు. అప్పుడు ఉడుకురక్తం కావడంతో అన్నీ రియల్‌గా చేయాలని ఆశపడుతూ ఉండేవాడిని. కానీ, ఆ తర్వాత ఏడాదే ‘సంఘర్షణ’లో గాయపడి ఆర్నెల్ల పాటు ఏ సినిమా షూటింగ్‌లోనూ పాల్గొనలేకపోయాను. పెద్దలు ఏది చెప్పినా ఆలోచించి చెబుతారని అప్పుడు అర్థమైంది. ‘సినిమా ఇండస్ట్రీలో సూపర్‌స్టార్‌ జీవితం శాశ్వతం కాద’ని ఎన్టీఆర్‌ చెప్పేవారు. విలాసవంతమైన వస్తువుల కాకుండా, ఇళ్లు, స్థలాలు కొనుక్కోమని సలహా ఇచ్చారు. అవే ఇప్పుడు నన్నూ నా కుటుంబాన్ని కాపాడుతున్నాయి. ఇక ఏయన్నార్‌ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఏదైనా సరదాగా మాట్లాడేవారు. తనలోని బలహీనతలు ఎలా బలాలుగా మార్చుకున్నారో చెప్పారు. అలా వాళ్లిద్దరి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా’’ అని చిరంజీవి అన్నారు.

బెంగళూరు తెలుగు సమాఖ్య అధ్యక్షులు రాధాకృష్ణంరాజు దంపతులు, మానసిక వైద్య నిపుణులు ఇండ్ల రామసుబ్బారెడ్డి, అంతర్జాతీయ పర్యటన శాఖ నిపుణులు, కవి పండితులు టి.విల్సన్ సుధాకర్ తదితరులను సత్కరించారు. వీరికి ఫౌండేషన్ అందించిన జీవన సౌఫల్య పురస్కారాలు, వేర్వేరుగా 50 వేల రూపాయల నగదు చెక్కులు అందించారు. కార్యక్రమంలో ఏపీ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఆకుల శేషసాయి, ఎంపీ లావు కృష్ణదేవరాయులు, గంటా రవితేజ, దసపల్లా హోటల్ అధినేత రాఘవేంద్రరావు, పైడా కృష్ణప్రసాద్ దంపతులు హాజరయ్యారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z