DailyDose

హైదరాబాద్ నకిలీ పాస్‌పోర్టు కేసులో సంచలనం-నేరవార్తలు

హైదరాబాద్ నకిలీ పాస్‌పోర్టు కేసులో సంచలనం-నేరవార్తలు

* రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ లో విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో ఉరివేసుకుని మహిళా సాప్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకుంది. అత్తాపూర్ లోని హ్యాపీ హోమ్ ఫార్చూన్ అపార్ట్‌మెంట్ లో నివాసం ఉంటున్న ఓ యువతి.. తన ప్లాట్ లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించి, వివరాలు సేకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సూసైడ్ చేసుకున్న యువతిని.. అతిథి భరద్వాజ్ గా పోలీసులు గుర్తింంచారు. ఓ అబ్బాయితో ప్రేమలో ఉన్న యువతి… తనను వాడుకొని మోసం చేయడంతో తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అత్తాపూర్ పోలీసులు వెల్లడించారు.

* అక్క, తమ్ముడు అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదర్​గూడలోని కేశవనగర్ కాలనీలో ఉంటున్న చామంతి (26), సోమయ్య దంపతులకు ఇద్దరు పిల్లలు. చామంతికి వరుసకు తమ్ముడయ్యే శేఖర్(25) వీరి ఇంటిపైనే రెంట్​కు ఉంటున్నాడు. మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని టైమ్​లో చామంతి, శేఖర్ ఉరేసుకున్నారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. డెడ్​బాడీలను ఉస్మానియాకు తరలించారు. చామంతి, శేఖర్ ఆత్మహత్యకు కారణాలు తెలియదని.. వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

* నకిలీ పత్రాలతో పాస్ పోర్ట్ జారీ కేసులో సీఐడీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో నిందితులైన 12మందిని అధికారులు అరెస్టు చేశారు. ఆరు జిల్లాల్లో పాస్ పోర్ట్ బ్రోకర్లను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్, హైదరాబాద్ నుంచి ఎక్కువగా పాస్ పోర్టులు పొందినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. కొందరు విదేశీయులకు నకిలీ పాస్ పోర్టులను కూడా ఇప్పించినట్లు గుర్తించారు. కెనడా, స్పెయిన్ దేశాల వీసాలు మంజూరు కావడంపై అనుమానం వచ్చి దర్యాప్తు చేపట్టారు అధికారులు. నకిలీ పాస్ పోర్టులు ఇప్పించడంలో కొంతమంది పోలీస్ అధికారుల హస్తం ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. దీంతో పోలీస్ అధికారుల ప్రమేయంపై ఆరా తీస్తున్నారు. పలువురు ఎస్బి, పాస్పోర్ట్ సిబ్బంది పాత్రపై సీఐడీ అధికారులు విచారణ జరుపుతున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z