Business

OTPని మించిన మరో భద్రత-వాణిజ్య వార్తలు

OTPని మించిన మరో భద్రత-వాణిజ్య వార్తలు

* హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ హాల్‌మార్క్‌ ఇన్‌ఫ్రా-కాన్‌ (ఇండియా) ప్రైవేటు లిమిటెడ్‌కు అవార్డు లభించింది. నేషనల్ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (NAREDCO) నిర్వహించిన నెక్ట్స్‌జెన్‌ కాన్‌క్లేవ్‌, ఐకాన్స్‌-2024 కార్యక్రమంలో ‘బెస్ట్‌ లగ్జరీ ప్రాజెక్ట్స్‌’ విభాగంలో ఈ అవార్డు వరించింది. దిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో క్రికెట్‌ లెజెండ్‌ కపిల్‌ దేవ్‌ చేతులు మీదుగా సంస్థ డైరెక్టర్‌ కొరిపల్లి సత్య రేవంత్‌ అవార్డును అందుకున్నారు. కార్యక్రమానికి దేశంలోని ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు.

* ఏదైనా ఆన్‌లైన్‌ లావాదేవీ (Digital payments) చేసినప్పుడు.. ఆ పేమెంట్‌ను ధ్రువీకరించడానికి ఓటీపీని (OTP) వినియోగిస్తుంటాం. దాదాపు అన్ని బ్యాంకులూ ఈ విధానాన్నే అనుసరిస్తున్నాయి. అయితే, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) త్వరలో డిజిటల్‌ చెల్లింపుల ధ్రువీకరణకు మరో కొత్త మెకానిజాన్ని అందుబాటులోకి తేనుంది. డిజిటల్‌ చెల్లింపుల విధానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా, ఈతరహా చెల్లింపులకు మరింత భద్రత కల్పించే ఉద్దేశంతో ఈ విధానాన్ని తీసుకురానున్నారు. ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాల వెల్లడి సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్‌ ఈ విషయాన్ని తెలియజేశారు.

* ఈ ఏడాది చివరికి భారత్‌లో 75వేల మంది మహిళా డెవలపర్లకు నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు మైక్రోసాఫ్ట్‌ (Microsoft) అధినేత సత్య నాదెళ్ల (Satya Nadella) ప్రకటించారు. భారత పర్యటనలో ఉన్న ఆయన గురువారం బెంగళూరులోని ‘మైక్రోసాఫ్ట్‌ ఏఐ టూర్‌’ నిర్వహించిన డెవలపర్ల సమావేశంలో పాల్గొన్నారు. కృత్రిమ మేధ (AI) ఆవిష్కరణను మరింత వేగవంతం చేయడంలో భారత డెవలపర్ల పాత్ర కీలకమని ఆయన తెలిపారు. ఈసందర్భంగా మైక్రోసాఫ్ట్‌ నిర్వహిస్తున్న ‘కోడ్‌ విత్‌అవుట్‌ బ్యారియర్స్‌ (Code Without Barriers)’ ప్రోగ్రామ్‌ గురించి నాదెళ్ల కీలక ప్రకటన చేశారు. ‘‘ఈ ప్రోగ్రామ్‌ను భారత్‌లోనూ చేపట్టాలని నిర్ణయించాం. దీనిద్వారా 2024 చివరికి 75వేల మంది మహిళా డెవలపర్లకు నైపుణ్యాల శిక్షణ ఇవ్వనున్నాం. ఈనెల నుంచే దీన్ని ఆరంభించనున్నాం. దీంతో మహిళా డెవలపర్లు (women developers), కోడర్లు, టెక్నికల్‌ రోల్స్‌లో పనిచేసే యువతులకు మరిన్ని నెట్‌వర్కింగ్‌ అవకాశాలు లభిస్తాయి’’ అని ఆయన వెల్లడించారు.రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) పరపతి విధాన నిర్ణయాల ప్రభావంతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఊహించనట్లుగానే మరోసారి వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచినప్పటికీ.. ద్రవ్యోల్బణం విషయంలో గవర్నర్‌ శక్తికాంత దాస్‌ చేసిన వ్యాఖ్యలు మదుపరులను మెప్పించలేదు. ఆర్‌బీఐ నిర్దేశించుకున్న లక్ష్యమైన 4 శాతం పైన ద్రవ్యోల్బణం ఉందని చెబుతూనే.. వడ్డీ రేట్ల తగ్గింపు ఇప్పట్లో ఉండబోదన్న సంకేతాలిచ్చారు. దీంతో బ్యాంక్‌, ఆటో షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్‌ 700 పాయింట్లకు పైగా నష్టపోగా.. నిఫ్టీ 21,700 స్థాయికి చేరింది.

* అదానీ గ్రూప్ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ (Gautam Adani) మళ్లీ 100 బిలియన్‌ డాలర్ల సంపద కలిగిన ధనవంతుల జాబితాలో చేరారు. గతేడాది హిండెన్‌బర్గ్‌ నివేదిక తర్వాత ఆయన సంపద భారీగా కుంగిన విషయం తెలిసిందే. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ జాబితాలో 101 బిలియన్‌ డాలర్లతో ప్రస్తుతం 12వ స్థానంలో కొనసాగుతున్నారు. గతకొన్ని రోజుల్లో అదానీ గ్రూప్‌ (Adani Group) కంపెనీల షేర్లు భారీగా లాభపడ్డాయి. 2022లో 150 బిలియన్‌ డాలర్ల వద్ద గౌతమ్‌ అదానీ (Gautam Adani) సంపద గరిష్ఠ స్థాయికి చేరుకుంది. అమెరికా షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ నివేదిక తర్వాత అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. ఆయన సంపద దాదాపు 37.7 బిలియన్ డాలర్లకు పడిపోయింది. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్ల జాబితాలో తొలి 25 మందిలో స్థానం కోల్పోయారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z