NRI-NRT

TCSS – సింగపూర్‌లో శివాలయాల సందర్శన

సింగపూర్‌లో శివాలయాల సందర్శన

Singapore | మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో శివాలయాల సందర్శన యాత్రను నిర్వహించారు. మార్చి 8వ తేదీ రాత్రి 9 గంటల నుంచి మార్చి 9వ తేదీ ఉదయం 7 గంటల వరకు సింగపూర్‌లో ఉన్న దాదాపు 10 నుంచి 12 ప్రముఖ శివాలయాలను సందర్శించారు. గత ఏడాది ఈ సందర్శన యాత్రను తొలిసారిగా నిర్వహించగా.. ఇది రెండోసారి కావడం విశేషం. సింగపూర్‌లోని జురాంగ్ ఈస్ట్-బుకిత్ పంజాంగ్, సెంగ్ కాంగ్, టాంపనీస్-బెడోక్ ప్రాంతాల నుంచి బస్సులను సమకూర్చి భక్తి యాత్రను విజయవంతంగా నిర్వహించారు. ఈ దేవాలయాల సందర్శన యాత్రలో భాగంగా వివిధ బస్సుల ద్వారా సుమారు 267 మంది భక్తులు వివిధ దేవాలయాలను సందర్శించి ఆ పరమ శివుని దీవెనలు పొందారు. యాత్రలో పాల్గొన్న భక్తులకు శివ సహస్ర నామాల ఫుస్తకం అందజేశారు. మహాశివరాత్రి సందర్భంగా సింగపూర్‌లో ఉన్న ప్రముఖ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. బస్సులో భక్తుల శివనామ స్మరణలు మార్మోగాయి. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చక్కని ప్రణాళికతో సురక్షితంగా యాత్రను నిర్వహించిన సొసైటీ వారికి ఈ యాత్రలో పాల్గొన్న భక్తులందరూ కృతజ్ఞతలు తెలియజేసి అభినందించారు. ఎలాంటి లాభాపేక్ష, ఆడంబరాలు లేకుండా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వివిధ సేవ, భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్న తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారిని ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు కొనియాడారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z