Business

పెరిగిన డాలరు రూపాయి మారకం-BusinessNews-Apr 04 2024

పెరిగిన డాలరు రూపాయి మారకం-BusinessNews-Apr 04 2024

* దేశీయ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో మన సూచీలు సరికొత్త రికార్డులను తిరగరాశాయి. కొత్త జీవనకాల గరిష్ఠ స్థాయిని అందుకున్నాయి. గరిష్ఠాల వద్ద మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీలు ఓ మోస్తరు లాభాలకు పరిమితమయ్యాయి. సెన్సెక్స్‌ 351 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 22,500 ఎగువన ముగిసింది. సెన్సెక్స్‌ 74,413.82 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. కాసేపు ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. మధ్యాహ్నం తర్వాత మళ్లీ లాభాల్లోకి వెళ్లింది. ఈ క్రమంలో 74,501.73 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాలను అందుకుంది. చివరికి 350.81 పాయింట్ల లాభంతో 74,227.63 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 80 పాయింట్లు లాభపడి 22,514.65 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.44గా ఉంది.

* దేశీయ మొబైల్‌ తయారీ సంస్థ లావాకు (LAVA) ఎదురుదెబ్బ తగిలింది. పేటెంట్‌ ఉల్లంఘన కేసులో స్వీడన్‌ టెలీ కమ్యూనికేషన్స్‌ సంస్థ ఎరిక్సన్‌కు (Ericsson) అనుకూలంగా తీర్పు వెలువడింది. 2జీ, 3జీకి సంబంధించిన పేటెంట్లను ఉల్లంఘించినందుకు గానూ రూ.244 కోట్లు ఎరిక్సన్‌కు చెల్లించాలని లావాను కోర్టు ఆదేశించింది. ఈమేరకు దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అమిత్‌ బన్సల్‌ ఇటీవల తీర్పును వెలువరించారు. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పేటెంట్ల ఉల్లంఘనకు సంబంధించి ఎరిక్సన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన దిల్లీ హైకోర్టు.. 8 పేటెంట్లలో ఏడింటి చెల్లుబాటును సమర్థించింది. అడాప్టివ్‌ మల్టీరేట్‌ స్పీచ్‌ కోడెక్‌, ఎన్‌హ్యాన్స్‌డ్‌ డేటా రేట్స్‌ ఫర్‌ జీఎస్‌ఎం ఎవల్యూషన్‌, 3జీ టెక్నాలజీ ఫీచర్లకు సంబంధించిన పేటెంట్లు ఇందులో ఉన్నాయి. ఎరిక్సన్‌కు జరిగిన నష్టానికి గానూ రూ.244 కోట్లు పరిహారంగా చెల్లించాలని కోర్టు లావాను ఆదేశించింది. తీర్పు వెలువరించిన నాటినుంచి పూర్తి చెల్లింపులు జరిపేంతవరకు 5 శాతం వార్షిక వడ్డీ చెల్లించాలంది. ఎరిక్సన్‌కు అయిన కోర్టు ఖర్చులనూ లావానే భరించాలని ఆదేశించింది.

* కొంతమంది పైలట్లు సమ్మెబాట పట్టడంతో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు విస్తారా (Vistara) చర్యలు చేపట్టింది. బుధవారం ఈ మేరకు వారితో చర్చించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. సీఈఓ వినోద్‌ కన్నన్‌ సహా ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం నిర్వహించారని వెల్లడించాయి. ఈ సందర్భంగా పైలట్లు తమ ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎయిరిండియాలో విలీనం నేపథ్యంలో ఏప్రిల్‌ నుంచి విస్తారా (Vistara) పైలట్లకు కొత్త కాంట్రాక్టు అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందంపై అసంతృప్తిగా ఉన్నందునే పైలట్లు విధులకు మూకుమ్మడిగా డుమ్మా కొట్టినట్లు వార్తలు వచ్చాయి. అయితే, పైలట్లు మాత్రం తాజా సమావేశంలో ఓ కీలక సమస్యను తెరపైకి తెచ్చినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. తమ పనిగంటలు అనుమతించిన గరిష్ఠ పరిమితికి చేరుతున్నాయని వారు చెప్పినట్లు పేర్కొన్నాయి. ‘‘అధిక పనిగంటల వల్ల తరచూ అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఫలితంగా పరిమితికి మించి సిక్‌ లీవ్‌లు తీసుకోవాల్సి వస్తోంది. చాలా మంది వేతనాన్ని వదులుకొని మరీ సెలవు పెడుతున్నారు. అయితే, మేమంతా కూడబలుక్కొని డుమ్మా కొడుతున్నామనేది మాత్రం నిజం కాదు’’ అని వారు చెప్పినట్లు సమాచారం. మరోవైపు యాజమాన్యం తమ కంటే సాఫ్ట్‌వేర్‌నే ఎక్కువగా విశ్వసిస్తోందని పైలట్లు వాపోయినట్లు తెలుస్తోంది. ‘‘విధుల్లో ఉన్నప్పుడు అలసిపోతే వారి దృష్టికి తీసుకెళ్తున్నాం. వారు ‘బోయింగ్‌ అలర్ట్‌నెస్‌ మోడల్‌’ సాఫ్ట్‌వేర్‌ ద్వారా విమాన స్థితిని పరిశీలిస్తున్నారు. అంతా బాగానే ఉందని, మీరు ఫిర్యాదు చేయడానికి ఏమీ లేదని చెబుతున్నారు’’ అని వివరించారు. మరోవైపు కచ్చితమైన వేతన పనిగంటలను 70 నుంచి 40కి తగ్గించడం వల్ల పైలట్లకే ప్రయోజనం ఎక్కువని యాజమాన్యం ఈ సమావేశంలో పేర్కొంది. దీని వల్ల ఎక్కువ పనిచేసుకునే వెసులుబాటు ఉంటుందని. తద్వారా అధికంగా ఆర్జించొచ్చని వివరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తగినంత సంఖ్యలో పైలట్లు అందుబాటులో లేకపోవడంతో గత రెండు రోజుల్లోనే 100కి పైగా విమానాలను విస్తారా (Vistara) రద్దు చేసింది. బుధవారం సుమారు 26 విమానాలను రద్దు చేసినట్లు ఈ పరిణామాన్ని దగ్గర నుంచి గమనిస్తున్న వర్గాలు తెలిపాయి. మరోవైపు విమానాల రద్దు, ఆలస్యంపై రోజువారీ నివేదికను సమర్పించాల్సిందిగా విస్తారాకు విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే సమస్యల పరిష్కారానికి పైలట్లతో విస్తారా చర్చలు జరుపుతోంది.

* ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ముద్దుల తనయ ఇషా అంబానీ (Isha Ambani) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. రిలయన్స్‌ రీటైల్స్‌ వ్యాపారాన్ని విజయవంతంగా నడిపిస్తూ తండ్రికి తగ్గ తనయగా పేరు సంపాదించుకుంది. ఇక ఇషాకు ప్రముఖ బిజినెస్‌ మెన్‌ ఆనంద్‌ పిరమాల్‌తో వివాహం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ జంటకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు తెగ వైరల్‌ అవుతోంది. ఈ జంటకు విదేశాల్లో అత్యంత విలువైన ప్రాపర్టీస్‌ ఉన్న విషయం తెలిసిందే. అయితే, లాస్‌ఏజెంల్స్‌లో ఉన్న ఓ మాన్షన్‌ (Los Angeles mansion)ను ఇషా – ఆనంద్‌ జంట విక్రయించినట్లు సమాచారం. అత్యంత విలాసవంతమైన ఇంద్రభవనంలాంటి ఈ మాన్షన్‌ను అమెరికన్‌ స్టార్‌ సింగర్‌ జెన్నీఫర్‌ లోపేజ్‌ (Jennifer Lopez) – బెన్‌ అఫ్లెక్‌ (Ben Affleck) జంట కొనుగోలు చేసిందంట. ఈ ఇంటిని దక్కించుకునేందుకు గతేడాది జూన్‌లో జెన్నీఫర్‌ జంట రూ.500 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు టాక్‌ వినిపిస్తోంది.

* దేశంలో పసిడి ధరల జోరు (Gold Price) కొనసాగుతోంది. రోజురోజుకూ బంగారం ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతూ ఆల్‌టైం గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్నాయి. తాజాగా పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా రూ.70 వేల మార్క్‌ను దాటింది. మార్కెట్‌ వర్గాల ప్రకారం.. గురువారం ఉదయం (ఏప్రిల్‌ 4) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సుమారుగా రూ.70,620కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,750గా ఉంది. ఇక వెండి ధరలు కూడా రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.82,000 చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్‌ అధికంగా ఉండటంతో దేశీయంగా ధరలు బలపడుతున్నట్లు మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి.

* ఒకప్పుడు ప్రపంచంలోనే మోస్ట్ వాల్యూడ్ ఎడ్‌టెక్ కంపెనీగా ఉన్న బైజూస్‌ (Byjus) ఇప్పుడు పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. తీవ్ర ద్రవ్య కొరతను ఎదుర్కొంటోంది. సంస్థలోని ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి. ఒకానొక సమయంలో ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు తాను ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇంటిని కూడా తాకట్టు పెట్టేందుకు బైజూస్‌ రవీంద్రన్‌ (Byjus Raveendran) సిద్ధపడ్డాడు. అంతేకాదు విలువైన ఆస్తులనుకూడా అమ్ముకున్నట్లు తెలిసింది. అయితే, గతేడాది ఇదే సమయానికి ఆయన వేల కోట్లకు అధిపతిగా ఉన్నారు. రూ.17వేల కోట్ల నెట్‌ వర్త్‌తో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరు గడించాడు. ప్రపంచ కుబేరుల జాబితా ఫోర్బ్స్‌లో స్థానం సంపాదించుకున్నాడు. అయితే ఒక్క ఏడాదిలో అంతా తారుమారైపోయింది. వేల కోట్లకు అధిపతి నుంచి చేతిలో రూపాయి కూడా లేని దుస్థికి చేరడం గమనార్హం. తాజా ఫోర్బ్స్‌ జాబితాలో రవీంద్రన్‌ నికర విలువ ఏకంగా సున్నాకి పడిపోయింది. 2011 లో రవీంద్రన్ ఎడ్యుకేషన్ స్టార్టప్ బైజూస్‌ను స్థాపించిన విషయం తెలిసిందే. ఆన్ లైన్‌లో పాఠాలు బోధించే ఈ స్టార్టప్‌కు తొలినాళ్లలో ఆదరణ అంతంత మాత్రంగానే ఉండేది. అయితే, కరోనా కాలంలో ఈ సంస్థకు దశ తిరిగింది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో బైజూస్ వాల్యూ ఒక్కసారిగా పెరిగింది. 2022లో ఏకంగా 22 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో రవీంద్రన్‌ ప్రపంచ కుబేరుడిగా అవతరించాడు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z