DailyDose

ప్రగతినగర్…హత్య చేసి ఇన్‌స్టాలో అప్‌లోడ్-CrimeNews-Apr 07 2024

ప్రగతినగర్…హత్య చేసి ఇన్‌స్టాలో అప్‌లోడ్-CrimeNews-Apr 07 2024

* పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్‌లోని బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధి ప్రగతినగర్‌లో జరిగింది. ఎస్‌ఆర్‌ నగర్‌లోని దాసారం బస్తీకి చెందిన తేజస్‌ (21) అలియాస్‌ సిద్ధూ.. గత ఏడాది స్థానికంగా జరిగిన ఓ హత్య కేసులో ఏ3 నిందితుడిగా ఉన్నాడు. ఆ కేసులో జైలుకు వెళ్లి రెండు నెలల క్రితం విడుదలయ్యాడు. ప్రస్తుతం ప్రగతినగర్‌లోని అద్దె ఇంట్లో తన తల్లితో కలిసి నివాసముంటున్నాడు. ఆదివారం రాత్రి సిద్ధూ తల్లి ఊరు వెళ్లింది. దీంతో ఒంటరిగా ఉన్న తేజస్‌.. తన మిత్రులైన మహేశ్‌, శివప్ప, సమీర్‌తో కలిసి మద్యం తాగాడు. సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ప్రగతినగర్‌లోని బతుకమ్మ ఘాట్‌ ఎదురుగా నిలబడి ఉండగా.. గతంలో హత్యకు గురైన తరుణ్‌ స్నేహితులు సుమారు 20 మంది ద్విచక్రవాహనాలపై వచ్చి తేజస్‌ను కత్తులతో పొడిచి చంపారు. హత్య తర్వాత నిందితులు సెల్ఫీ వీడియో ద్వారా చిత్రీకరించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. తరుణ్‌ హత్యకు ప్రతీకారంగా తమ పగ నెరవేర్చుకున్నామంటూ నిందితులు ఆ పోస్టులో పేర్కొనడం గమనార్హం. ఘటనాస్థలిని కూకట్‌పల్లి ఏసీపీ కె.శ్రీనివాసరావు, బాచుపల్లి సీఐ జె.ఉపేందర్‌యాదవ్‌ పరిశీలించారు. ఘటనకు బాధ్యులుగా భావిస్తున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

* తాను సిగరెట్‌ తాగుతుండగా వీడియో తీశాడనే కారణంతో ఓ యువతి, ఒక వ్యక్తిని హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. శనివారం అర్థరాత్రి మానేవాడ సిమెంట్ రోడ్‌లోని పాన్ షాప్ వద్ద జయశ్రీ పాండే అనే యువతి తన స్నేహితురాలితో కలిసి సిగరెట్‌ తాగుతూ నిల్చొంది. ఆ సమయంలో సిగరెట్ కొనడానికి రంజిత్‌ రాథోడ్‌(28) అనే వ్యక్తి దుకాణానికి వచ్చాడు. అతడు అదే పనిగా వారి వైపు చూస్తూ వీడియో తీస్తుండడంతో ఆగ్రహించిన జయశ్రీ, రాథోడ్‌తో వాగ్వాదానికి దిగింది. వారిద్దరి మధ్య జరిగిన గొడవను రాథోడ్‌ వీడియోలో రికార్డు చేశాడు. అనంతరం అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనతో కోపోద్రిక్తురాలైన జయశ్రీ తన స్నేహితులు ఆకాష్ రౌత్, జీతూ జాదవ్‌లను పిలిచింది. వీరంతా రాథోడ్‌ను వెతుకుతుండగా మహాలక్ష్మినగర్‌లో అతడు కనిపించాడు. దీంతో ఒక్కసారిగా అతడిపై దాడి చేయగా, జయశ్రీ తన వద్ద ఉన్న కత్తితో రాథోడ్‌ను పలుమార్లు పొడవడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితులు దత్తవాడికి పారిపోయారు. నిందితుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ కైలాష్‌ దేశ్‌మానే తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీ, హతుడి ఫోన్‌లో రికార్డైన వీడియో ఆధారంగా విచారణ జరుగుతోందన్నారు. కాగా రాథోడ్‌కి భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు.

* ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. గత ప్రభుత్వంలో స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచి (ఎస్‌ఐబీ) డీఎస్పీగా ఉన్న ప్రణీత్‌రావు చేసిన పనితో పోలీసు ఉన్నతాధికారులకు కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఎస్‌ఐబీ ఎంతో శ్రమించి సేకరించిన పాత డేటా కూడా పోయినట్లు పోలీసులు తాజాగా గుర్తించారు. ఇందులో మావోయిస్టులకు సంబంధించిన వివరాలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితుడు ప్రణీత్‌రావు డిసెంబర్‌ 4న మొత్తం 17 కంప్యూటర్లకు చెందిన 42 హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేశాడు. వీటి నుంచి డేటాను తిరిగి పొందే అవకాశం కూడా లేదని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. మూసీలో కలిపిన హార్డ్‌ డిస్క్‌ శకలాల నుంచి కూడా వీటిని పొందే అవకాశం లేదని అధికారులు అంటున్నారు.

* భారాసకు చెందిన బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సాహిల్‌ అలియాస్‌ రాహిల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రజాభవన్‌ ముందు జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో ఆయన నిందితుడిగా ఉన్నాడు. ఆ ఘటన తర్వాత రాహిల్‌ దుబాయ్‌ వెళ్లాడు. అక్కడి నుంచి హైదరాబాద్‌ రాగానే పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై ఇప్పటికే లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రాహిల్‌ను పంజాగుట్ట పోలీసులు నాంపల్లి కోర్టు న్యాయమూర్తి నివాసంలో హాజపరిచారు. న్యాయమూర్తి అతడికి ఈనెల 22 వరకు (14 రోజులు) జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు. అనంతరం నిందితుడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z