DailyDose

₹35కోట్ల హెరాయిన్ సీజ్-CrimeNews-Apr 10 2024

₹35కోట్ల హెరాయిన్ సీజ్-CrimeNews-Apr 10 2024

* తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మనీలాండరింగ్‌ కోణాన్ని విచారించాలని హైకోర్టు న్యాయవాది సురేష్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)ని కోరారు. ఈ మేరకు బుధవారం(ఏప్రిల్‌ 10) ఆయన ఈడీకి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పీఎంఎల్‌ఏ చట్టం కింద కేసు నమోదు చేయాలన్నారు. ప్రముఖ వ్యాపారుల ఫోన్‌లు ట్యాప్‌ చేసి వారిని బ్లాక్‌ మెయిల్‌ చేయడం ద్వారా కోట్లు వసూలు చేశారని, ఈ డబ్బును పోలీసు వాహనాల్లో ఎన్నికల కోసం తరలించారని నిందితులే ఒప్పుకున్న విషయాన్ని ఆయన ఫిర్యాదులో ప్రస్తావించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అసలు నిందితులను ఇప్పటివరకు విచారించలేదని, ఈడీ కేసు నమోదు చేసి విచారిస్తే అసలు నిందితులు బయటికి వస్తారని ఫిర్యాదులో తెలిపారు.

* దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎన్నికల ఫీవర్‌ను క్యాష్‌ చేసుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూనే ఉన్నారు. తమిళనాడులోని కడలూరు నియోజకవర్గంలో చిలుక జోస్యం చెప్పే సెల్వరాజ్‌ కూడా ఎన్నికల పేరు చెప్పుకుని ఎంతో కొంత వ్యాపారం పెంచుకుందామని చూశాడు. అయితే అతడ ప్లాన్‌ బెడిసి కొట్టింది. కడలూరు నియోజకవర్గం​లో పీఎంకే పార్టీ అభ్యర్థి తంగర్‌ బచ్చన్‌ గెలవబోతున్నాడని తన వద్ద ఉండే చిలుకతో జోస్యం చెప్పించాడు. సెల్వరాజ్‌ పంజరం తలుపు తెరవగానే చిలుక వచ్చి అక్కడున్న దేవుడి ఫొటోల్లో నుంచి ఒక ఫొటో తీసింది. అది పీఎంకే అభ్యర్థికి ఇష్టమైన దేవుడి ఫొటో కావడంతో ఈ ఎన్నికల్లో కడలూరు నుంచి ఆయనే గెలువబోతున్నాడని సెల్వరాజ్‌ ప్రకటించాడు. దీంతో ఎగిరి గంతేసిన అభ్యర్థి తంగర్‌ బచ్చన్‌ చిలుకకు సంతోషంతో అరటిపండు తినిపించాడు. ఈ వీడియో సోషల్‌ మీడియలో వైరల్‌గా మారింది. ఇంకేముంది పోలీసులు రంగ ప్రవేశం చేసి చిలుక జోస్యం చెబుతున్న సెల్వరాజ్‌, అతడి తమ్ముడిని అరెస్టు చేశారు. వైల్డ్‌లైఫ్‌ ప్రొటెక్షన్‌ చట్టం సెక్షన్‌ 4 కింద ఇద్దరిని అరెస్టు చేసి కొద్దిసేపు జైలులో ఉంచి తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు.

* ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్‌ పట్టుబడింది. సుమారు రూ. 35 కోట్ల విలువైన 5 కిలోల హెరాయిన్‌ను కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. ఎవరి కంట పడకుండా హెరాయిన్‌ను లగేజ్‌ బ్యాగ్‌లో దాచి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు నిందితులు. స్కానింగ్‌ మిషన్‌లో లగేజ్‌ బ్యాగ్‌ పెట్టకుండా తప్పించుకునేందుకు యత్నించారు. అయితే కస్టమ్స్‌ అధికారులు చాకచక్యంగా స్మగర్లను పట్టుకోవడంతో డ్రగ్స్‌ సీజ్‌ చేశారు.

* తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుకు సంబంధించి రోజుకో ట్విస్ట్‌ చోటుచేసుకుంటోంది. తాజాగా ఈ కేసు వ్యవహారంలో టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు రిమాండ్‌ను కోర్టు పొడిగించింది. ఈ క్రమంలో ఏప్రిల్‌ 12 వరకు రిమాండ్‌ విధించిన అనంతరం ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. కాగా, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో రాధాకిషన్‌రావుకు సంబంధించి వారం రోజుల కస్టడీ నేటితో ముగియడంతో పోలీసులు ఆయన్ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఇక, విచారణ సందర్భంగా తనను జైలులో లైబ్రరీకి వెళ్లేందుకు అనుమతించడం లేదని రాధాకిషన్‌రావు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జైలు సూపరింటెండెంట్‌ను సైతం కలవనీయడం లేదని తెలిపారు. దీంతో, పోలీసులను న్యాయమూర్తి పిలిపించి ప్రశ్నించారు. లైబ్రరీలోకి అనుమతించడంతో పాటు సూపరింటెండెంట్‌ను కలిసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం, న్యాయస్థానం ఈ నెల 12 వరకు రిమాండ్‌ను పొడిగిస్తున్నట్లు పేర్కొంది.

* లిక్కర్‌ స్కాం కేసులో అరెస్టైన తనను సీబీఐ ఇంటరాగేషన్‌ చేయడాన్ని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోర్టులో సవాల్‌ చేశారు. ఈ పిటిషన్‌పై ఇవాళ ఢిల్లీ రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌కు సంబంధించి సీబీఐ నుంచి తమకు కౌంటర్‌ రిప్లై అందలేదని కవిత తరఫు న్యాయవాది జడ్జి కావేరీ బవేజా దృష్టికి తీసుకెళ్లగా..ఆ అవసరం లేదంటూ సీబీఐ బదులిచ్చింది. పిటిషన్‌పై విచారణ మొదలుకాగానే సీబీఐ రిప్లై తమకు అందలేదని కోర్టుకు తెలిపారు కవిత తరపు లాయర్. అయితే శనివారమే(ఏప్రిల్‌ 6వ తేదీన) తాము కవితను ప్రశ్నించామని, కాబట్టే కౌంటర్‌ దాఖలు చేయాల్సిన అవసరం లేదని సీబీఐ కోర్టుకు తెలిపింది. అయితే.. భవిష్యత్తులో జరిగే విచారణకు తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని జడ్జి కావేరీ ఈ సందర్భంగా సీబీఐని ఆదేశించారు. మరోవైపు సీబీఐ రిప్లై ఇవ్వలేదన్న అంశంపై వాదనలు వినిపిస్తామంటూ కవిత తరపు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో.. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ ఈనెల 26కు వాయిదా వేసింది కోర్టు.

* సోషల్‌ మీడియాలో పోస్ట్‌ కోసం రీల్‌ చేసేందుకు ప్రయత్నించిన నలుగురు విద్యార్థులు చిక్కుల్లోపడ్డారు. ఫ్రాంక్‌ కిడ్నాప్ వీడియో తీయబోయి భంగపడ్డారు. (Shooting Prank For Reel) ఫిర్యాదు అందుకున్న పోలీసులు నలుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఈ సంఘటన జరిగింది. చంద్రాపూర్ జిల్లాకు చెందిన 17 ఏళ్ల ఆదేశ్, స్నేహితుడితో కలిసి నాగపూర్‌ ప్రతాప్‌ నగర్‌లోని అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఇంటర్‌ మొదటి ఏడాది చదువుతున్న అతడు జేఈఈ కోసం ప్రిపేర్‌ అవుతున్నాడు. కాగా, సోమవారం ఉదయం 6.45 గంటలకు ఆదేశ్‌ తన స్నేహితులతో కలిసి నడుస్తూ క్లాస్‌ రూమ్‌కు వెళ్తున్నాడు. ఇంతలో ఒక కారు అతడి ముందు ఆగింది. ముగ్గురు యువకులు అందులోంచి కిందకు దిగారు. కారులోకి ఎక్కాలని ఆదేశ్‌ను బలవంతం చేశారు. ఆదేశ్‌ స్నేహితులు కేకలు వేయడంతో కారులో అక్కడి నుంచి పారిపోయారు. మరోవైపు తనను కిడ్నాప్ చేయబోవడం పట్ల భయాందోళన చెందిన ఆదేశ్‌ ఈ విషయాన్ని టీచర్‌కు చెప్పాడు. ఆ వెంటనే ఉపాధ్యాయుడితో కలిసి స్థానిక పోలీస్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీంతో కిడ్నాప్ వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. 18 ఏళ్ల సుశాంత్‌ను గుర్తించి అరెస్ట్‌ చేశారు. అతడు ఇచ్చిన సమాచారంతో 18 ఏళ్ల వయసున్న శ్రేయాష్, యష్, అర్నవ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z