Fashion

ఫెయిర్‌నెస్ క్రీములతో కిడ్నీలకు దెబ్బ

ఫెయిర్‌నెస్ క్రీములతో కిడ్నీలకు దెబ్బ

ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌లంటే మహిళలకు, ముఖ్యంగా యువతకు ఎంత మక్కువ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మార్కెట్లో ఈ బ్యూటీ ప్రొడక్ట్స్‌కి ఉన్నంత డిమాండ్‌ మరే వ్యాపారానికి ఉండదంటే అతిశయోక్తి కాదేమో..!. అలాంటి ఈ ఫెయిర్‌నెస్‌ క్రీముల్లో మెర్క్యురీ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుందట. దీని వల్ల మూత్రపిండాలకు సంబంధించిన మెంబ్రానస్ నెఫ్రోపతీ (ఎంఎన్‌) కేసులు భారత్‌లో ఎక్కువగా పెరుగుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. అందుకు సంబంధించిన విషయం కిడ్నీ ఇంటర్నేషనల్ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యింది. ఈ పరిస్థితి కారణంగా మూత్రపిండాల్లో ఫిల్టరింగ్‌ వ్యవస్థ దెబ్బతిని ప్రోటీన్‌ లీకేజ్‌ కారణమవుతుందని చెబుతున్నారు. మూత్ర పిండాల వ్యాధి అనేది ముఖ్యంగా శరీరంలోని అంతర్గత రక్షణ వ్యవస్థను దెబ్బతీస్తుంది. దీని ఫలితంగా నెఫ్రోటిక్‌ సిండ్రోమ్‌ ఏర్పడి మూత్రపిండాల రుగ్మతకు కారణమవుతుంది. దీని కారణంగా మూత్రంలో పోటీన్‌లు వెళ్లిపోవడం జరుగుతుంది.

మనం ముఖానికి రాసుకునే ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ మూత్ర పిండాలపై ఎలా ఎఫెక్ట్‌ చూపుతుందంటే..?. ఆ ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌లో వాడే పాదరసం చర్మం ద్వారా లోపలికి వెళ్తుంది. అది నేరుగా మూత్రపిండాల ఫిల్టర్‌ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీంతో నెఫ్రోటిక్ సిండ్రోమ్ కేసులు పెరుగుదలకు దారితీస్తుందని పరిశోధకులు డాక్టర్‌ సజీష్‌ శివదాస్‌ అన్నారు. అందులోనూ మార్కెట్లో వచ్చే ప్రతి ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ తక్షణమై ముఖం ఫెయిర్‌గా ఉండేలా చేసే ఫలితాల కారణంగానే ఈ పరిస్థితి ఎదురయ్యిందని అన్నారు. అంతేగాదు జులై 2021 నుంచి 2023 మధ్య కాలంలో ఇలాంటి మూత్ర పిండాల రుగ్మతకు సంబంధించిన 22 కేసులపై అధ్యయనం నిర్వహించారు. ఆయా వ్యక్తులు తేలికపాటి ఎడెమా(వాపు), నురుగతో కూడిన మూత్రం తదితర లక్షణాలు కనిపించాయని అన్నారు. అంతేగాదు వారిలో చాలామందికి మూత్రంలో ప్రోటీన్‌ స్థాయిలు పెరిగాయన్నారు.

అలాగే ఒక రోగి మాత్ర మెదడులో రక్తం గడ్డకట్టే సెరిబ్రల్ వెయిన్ థ్రాంబోసిస్‌ కూడా వచ్చినట్లు తెలిపారు. అలాగే వైద్యపరీక్షల్లో 22 కేసుల్లో 68% మంది అంటే 15 మందికి న్యూరల్ ఎపిడెర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ 1 ప్రోటీన్(NELL-1) పాజిటివ్‌గా తేలింది. అంటే వారంతా మాత్రపిండాలకు సంబంధించిన ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్నారని పరిశోధనలో తేలిందన్నారు. అంతేగాదు ఆ 15 మందిలో దాదాపు 13 మంది ఈ లక్షణాలు కనిపించక మునుపే తాము ఫెయిర్‌నెస్ క్రీమ్‌లు వాడినట్లు అంగీకరించారు. మిగతా ఇద్దిరిలో ఒకరు సాంప్రదాయ స్వదేశీ క్రీములను వాడినట్లు తెలిపారు. మరోకరికి ఆ చరిత్ర కూడా లేదు. అయితే ఆయా రోగులు ఈ ఫెయిర్‌నస్‌ క్రీమ్‌లు వాడటం మానేసిన తర్వాత మూత్రిపిండాల వ్యాధి అదుపులో ఉన్నట్లు తేలింది. అంతేగాదు ఆయా ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ల ఉత్పత్తులు ప్రజారోగ్యాన్ని ఎలా ప్రమాదంలో పడేస్తున్నాయి అనేందుకు ఈ తాజా పరిశోధనే ఉదహరణ అని తెలిపారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు ఈ ఉత్పత్తులను సమర్థించడం, పైగా ఇది బహుళ బిలియన్ డాలర్ల పరిశ్రమ కావడం వల్ల అధికారులెవరూ ఈ ఉత్పత్తులకు అడ్డకట్టవేసే సాహసం చేయడం లేదని ఆరోపించారు. ఇక్కడ కేవలం చర్మ సంరక్షణ, మూత్ర పిండాల సమస్య కాదు. ఇందులో ఉపయోగించే పాదరసం ప్రజల ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమైనదనేది గుర్తించడంతో పాటు ఈ హానికరమైన ఉత్పత్తులకు అడ్డుకట్టవేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు ఆరోగ్య నిపుణులు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z