* శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓటర్లను కలుసుకొని బాలకృష్ణను మూడోసారి గెలిపించాలని కోరారు. వెంకటాపురం గ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యంలో రాగి చేను కోస్తున్న కూలీలను చూసి వసుంధర అక్కడికి వెళ్లారు. కూలీలతో కలిసి రాగి చేను కోశారు.
* ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. సలహాదారుల పేరుతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు. వారికి ఇచ్చే డబ్బుతో ప్రాజెక్టులు పూర్తి చేయవచ్చన్నారు. విజయనగరం జిల్లా రాజాంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. తారకరామతీర్థ సాగర్‌కు రూ.280 కోట్లు, తోటపల్లి ప్రాజెక్టుకు రూ.237 కోట్లు, వంశధార ఫేజ్-2కు రూ.420 కోట్లు, నాగావళి-వంశధార లింక్‌కు రూ.145 కోట్లు ఖర్చు పెట్టామని గుర్తు చేశారు. సీఎం జగన్ చెప్పేవన్నీ అబద్ధాలనీ, చేసేవన్నీ మోసాలని ధ్వజమెత్తారు.
* సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై ఇటీవల జరిగిన గగనతల దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ (Israel)పై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్(Iran) విరుచుకుపడిన సంగతి తెలిసిందే. వీటి గురించి తాము ముందే అమెరికా (USA)కు సమాచారం అందించామని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి హొయీన్ అమిరాబ్డోల్లాహియాన్ మీడియాతో అన్నారు. ‘‘పౌర లక్ష్యాలను మేం గురిపెట్టలేదు. వాణిజ్య, జనసమూహ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోలేదు. ఈ దాడి ఇజ్రాయెల్‌ను శిక్షించేందుకే. మమ్మల్ని రక్షించుకునేందుకు మేం తీసుకున్న చర్య ఇది. దీని గురించి మేం ముందుగానే అమెరికాకు సమాచారం ఇచ్చాం. మా దాడులు పరిమితంగా ఉంటాయని చెప్పాం’’ అని వెల్లడించారు. సైనిక స్థావరాలే లక్ష్యంగా తాము ప్రతిస్పందించినట్లు చెప్పారు. అయితే తమకు ఎలాంటి ముందస్తు సమాచారం అందలేదని అమెరికా స్పందించడం గమనార్హం.
* ముఖ్యమంత్రి జగన్‌పై రాయితో దాడి ఘటనపై దర్యాప్తు వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా ఆదేశించారు. విజయవాడ సీపీ కాంతిరాణా, ఐజీ రవిప్రకాశ్‌ను పిలిపించి ఘటనపై సోమవారం సమీక్షించారు. జగన్ చేపట్టిన బస్సు యాత్రలో బందోబస్తు ఉన్నప్పటికీ.. ఎలా దాడి చేయగలిగారని సీఈవో ప్రశ్నించారు. ఈ ఘటనలో ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దర్యాప్తు వేగవంతం చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఈవో ఆదేశించారు. వీఐపీల పర్యటనలో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలన్నారు.
* సీఎం జగన్‌పై గులకరాయి దాడి వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్స్(ట్విటర్) వేదికగా స్పందించారు. దాడి విషయంలో బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయిస్తే ఎలా? అని ప్రశ్నించారు. ఈ ఘటనపై డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ పోలీస్ కమిషనర్, ముఖ్యమంత్రి సెక్యూరిటీ అధికారులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
* కేంద్రంలో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు మరోసారి అధికారంలోకి వస్తే కచ్చితంగా రాజ్యాంగాన్ని (Constitution) మార్చేస్తారంటూ గత కొంతకాలంగా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వీటిని భాజపా నేతలు ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతున్నారు. అయితే, తాజాగా ఈ అంశంపై టీవీ రాముడిగా పేరొందిన మేఠర్ భాజపా (BJP) అభ్యర్థి అరుణ్ గోవిల్ (Arun Govil) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రాజ్యాంగంలో మార్పులు జరగొచ్చంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి.
* అధికారగణంలో అవినీతి శక్తులకు అడ్డుకట్ట పడుతోందని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhar) అన్నారు. అవకాశాలు, ఉద్యోగాలకు ఇక అవినీతి అనేది ఓ పాస్‌వర్డ్‌లా ఉండదన్నారు. నాగ్‌పూర్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్‌లో ఐఆర్‌ఎస్ (IRS) 76వ బ్యాచ్ వీడ్కోలు సభలో ధన్‌ఖడ్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన ప్రసంగించారు. ‘‘నేడు మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నా. పరిపాలనను అవినీతి ఎప్పటికీ శాసించలేదు. ఇకపై అవినీతి అనేది అవకాశం, ఉద్యోగం లేదా కాంట్రాక్టుకు ‘పాస్‌వర్డ్’ కాదు. అది జైలుకెళ్లే మార్గం. అధికారగణంలో అవినీతి శక్తులకు అడ్డుకట్ట పడుతోంది. నిద్రాణస్థితి నుంచి మేలుకున్న భారత్.. ప్రపంచశక్తిగా ఎదిగే దిశగా వేగంగా దూసుకుపోతోంది. జీ-20 సదస్సుకు ప్రాతినిధ్యం వహించే సమయంలో భారత్.. దక్షిణ దేశాల గొంతుకగా మారింది. ప్రస్తుతం మన దేశం ప్రముఖ వేదికగా మారింది. భారత్ దూరదృష్టి, నాయకత్వాన్ని చూస్తుంటే గర్వంగా ఉంది’’ అని అన్నారు.
* ఎన్నికల సంగ్రామంలో తనపై దాడి చేస్తున్నారని ధ్వజమెత్తారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. అర్జునుడిపై ఒక బాణం వేసినంత మాత్రాన.. కురుక్షేత్రంలో కౌరవులు నెగ్గినట్లు కాదని అన్నారు. వైఎస్ జగన్‌పై ఒకరాయి వేసినంత మాత్రన.. మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. ఈ స్థాయికి వారు దిగజారారు అంటే మనం(వైఎస్సార్‌సీపీ) విజయానికి అంత చేరువగా ఉన్నామని అర్థమన్నారు. వీళ్ల కుట్రలకు మీ బిడ్డ అదరడు, బెదరడని..ఇలాంటి దాడులతో తన సంకల్పం చెదరదని తెలిపారు. వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర మంగళవారం కృష్ణా జిల్లాలో సాగుతోంది. గుడివాడ సమీపంలో నాగవరప్పాడు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. గుడివాడలో మహా సముద్రం కనిపిస్తుందన్నారు. మే 13న జరగబోతున్న ఎన్నికల మహా సంగ్రామంలో మంచి వైపు నిలబడిన ప్రజల సముద్రం ఇదని తెలిపారు. సభకు వచ్చిన ప్రతి ఒక్క అక్కచెల్లెమ్మలకు. అన్నదమ్ములకు, అవ్వాతాతలకు అందరికీ నిండు మనసుతో హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు .
* ప్రజలకు భాజపా ఏం చేసిందో ప్రశ్నించాలని భారాస కార్యకర్తలకు ఆ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వికారాబాద్ జిల్లా పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘ నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆకలి, నిరుద్యోగం, పేదరికం అన్నీ పెరుగుతున్నాయి. భాజపా ప్రభుత్వం జీఎస్టీ వేసి ధరలు పెంచింది. పెరిగిన ధరలతో పేదవాళ్లు బతికే పరిస్థితి లేదు. ఉద్యోగాలిస్తామని నిరుద్యోగ యువతను భాజపా మోసం చేసింది. చెప్పుకోవడానికి ఆ పార్టీకి పథకాలే లేవు’’అని భాజపాపై హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
* కేంద్ర ప్రభుత్వం దేశంలో ఒకే నాయకుడు ఉండాలని కోరుకుంటుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సోమవారం ఆరోపించారు. ఇలాంటి ఆలోచన దేశ ప్రజలను అవమానించడమే అవుతుందని మండిపడ్డారు. రాహుల్ వయనాడ్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ రోడ్ షో నిర్వహించారు. అనంతరం నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
* సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ (Modi) సోమవారం కేరళ (Kerala)లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై విమర్శలు చేశారు. ఆయన తన కుటుంబానికి కంచుకోటను రక్షించుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీ లోక్‌సభ స్థానం నుంచి రాహుల్ వరుసగా 15 ఏళ్లపాటు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా నాయకురాలు స్మృతిఇరానీ చేతిలో ఓటమి పాలయ్యారు. 2019లో వయనాడ్ బరిలో నిలిచి విజయం సాధించారు.
* భారాస హయాంలో రైతులకు అన్నివిధాలుగా అన్యాయం జరిగిందని కేంద్ర మంత్రి, తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన రైతు దీక్షలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీలతోపాటు మేనిఫెస్టో పేరుతో కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చినట్లు గుర్తు చేసిన ఆయన.. వెన్నుపోటు పొడవడమే ఇందిరమ్మ రాజ్యమా అని ప్రశ్నించారు.
* సీఎం జగన్‌పై రాయి దాడి నేపథ్యంలో ఆయన కుటుంబసభ్యులు జాగ్రత్తగా ఉండాలని తెదేపా (TDP) మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ (Chintamaneni) అన్నారు. అమరావతిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దర్శకత్వంలో జగన్ నటిస్తున్నారని విమర్శించారు. ‘‘గత ఎన్నికల్లో బాబాయ్ గొడ్డలిపోటుతో సానుభూతి పెంచుకున్నారు. ఇప్పుడు గులకరాయి డ్రామా విఫలమవడంతో ఎవరైనా బలికావొచ్చు. విజయమ్మ ముందు జాగ్రత్తగా అమెరికా వెళ్లారని ప్రజలు అనుకుంటున్నారు. వైఎస్ భాస్కర్‌రెడ్డి కూడా జైలులోనే ఉంటా.. బయటకు రానంటున్నారు’’అని చింతమనేని వ్యాఖ్యానించారు.
* రామేశ్వరం కెఫే దాడికి మాస్టర్ మైండ్‌గా భావిస్తున్న అబ్దుల్ మథీన్ అహ్మద్ తాహా భారత్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థకు చెందిన కీలకమైన వ్యక్తి (హైవేల్యూ అసెట్)గా ఎన్‌ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు. దక్షిణ, మధ్య భారత్‌లో జరిగిన అనేక ఉగ్రవాద కేసులతో సంబంధం ఉన్న ‘కర్నల్’ అనే వ్యక్తితో తాహా టచ్‌లో ఉన్నట్లు తేలింది.
* సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టులకు చెందిన 21 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి ఓ లేఖ రాశారు. న్యాయవ్యవస్థను కాపాడుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయని అభిప్రాయపడ్డారు. కొన్ని వర్గాలు తప్పుడు సమాచారం అందిస్తూ న్యాయ వ్యవస్థను బహిరంగంగా అవమానిస్తున్నారని, అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.
* ఆర్థిక సుసంపన్న దేశమైన సింగపుర్ ప్రధానమంత్రి లీ సీన్ లూంగ్ ఆ బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న ఆయన.. మే 15న పదవి నుంచి దిగిపోనున్నట్లు ప్రకటించారు. నాయకత్వ మార్పు అనేది ఏ దేశానికైనా అత్యంత ముఖ్యమైన క్షణమని పేర్కొన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z