NRI-NRT

జో బైడెన్ కొలువులో మరో భారతీయ అమెరికన్‌కు కీలక బాధ్యతలు

జో బైడెన్ కొలువులో మరో భారతీయ అమెరికన్‌కు కీలక బాధ్యతలు

ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వంలో పలువురు భారతీయ అమెరికన్ల పలు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో ఇండో-అమెరికన్‌కు కీలక పదవి దక్కింది. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా భారత సంతతికి చెందిన విన్ గుప్తా నియమితులయ్యారు. ఎఫ్‌డీఏ ప్రిన్సిపల్ డిప్యూటీ కమీషనర్ జానెట్ వుడ్ కాక్ త్వరలోనే పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే విన్ గుప్తా నియామకం జరిగింది. ఎఫ్‌డీఏ కమీషనర్‌ రాబర్ట్ కాలిఫ్‌కు ఆయన సలహాదారుగా వ్యవహరిస్తారు. కాగా, విన్ గుప్తా ప్రస్తుతం అమెజాన్ చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా ఉన్నారు. 2022 ఫిబ్రవరి నుంచి ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నారు. ఇక ఎఫ్‌డీఏ చాలా కాలంగా కొత్త సలహాదారు కోసం అన్వేషిస్తోంది. ఈ క్రమంలో పల్మోనాలజిస్ట్‌గా మంచి గుర్తింపు, ప్రముఖ న్యూస్ ఏజెన్సీలలో తరచూ కనిపించే విన్ గుప్తా ఈ పదవికి సరైన వ్యక్తిగా యూఎస్ ఎఫ్‌డీఏ భావించింది. అంతేగాక అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో అధ్యక్షుడు బైడెన్‌కు కీలక సలహాలు ఇచ్చి ఆయన విజయంలో విన్ గుప్తా కీలకపాత్ర పోషించారు. దీంతో ఎఫ్‌డీఏ ఆయనకే ఈ పదవిని కట్టబెట్టిందని సమాచారం. సలహాదారు హోదాలో తమ హెల్త్ రికమండేషన్‌లపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచేందుకు ఆయన కృషి చేస్తారని ఈ సందర్భంగా ఎఫ్‌డీఏ ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే, ప్రస్తుతం అగ్రరాజ్యంలో బేబీ ఫార్ములా, అబార్షన్ హక్కులపై ఉద్యమాలు జరుగుతున్న నేపథ్యంలో సలహాదారు పదవి విన్ గుప్తాకు కత్తి మీద సాము అనే చెప్పాలి.