WorldWonders

తప్పని గురి… సురభి

తప్పని గురి… సురభి

తల్లితండ్రుల ప్రోత్సాహానికీ, అక్క త్యాగానికీ తన అకుంఠిత దీక్ష తోడై… పతకాలను వేటాడుతోంది… రాపోలు సురభి భరద్వాజ్‌. జర్మనీలో జూనియర్‌ షూటింగ్‌ వరల్డ్‌ కప్‌లో రజతాన్ని సాధించిన ఆమె సీనియర్‌ షూటింగ్‌ వరల్డ్‌క్‌పకు సిద్ధమవుతోంది. 2024 ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యమంటున్న ఆమె పంచుకున్న విశేషాలివి.

‘మా స్వస్థలం కరీంనగర్‌. అమ్మనాన్నల ఉద్యోగరీత్యా మా కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. నేను ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఈ మూడో సంవత్సరం చదువుతున్నా. నాన్న విష్ణు న్యాయవాది. అమ్మ లావణ్య ‘జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా’లో పని చేస్తోంది. నేను ఉప్పల్‌ కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్నప్పుడు ఎన్‌సీసీలో చేరా. అక్క వైష్ణవితో కలిసి అక్కడ సరదాగా షూటింగ్‌ ప్రాక్టీస్‌ చేయడం ప్రారంభించా. అలా రైఫిల్‌తో ప్రేమలో పడిన నేను అనతి కాలంలోనే రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధిస్తూ వచ్చాను. 2015లో ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి ఎన్‌సీసీ షూటింగ్‌ పోటీల్లో 50 మీటర్ల రైఫిల్‌ విభాగంలో గెలుచుకున్న రజత పతకం నాలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపింది. షూటింగ్‌ను కెరీర్‌గా మలుచుకోవాలని ఆ రోజే సంకల్పించుకున్నాను. ఆ తర్వాత మెరుగైన శిక్షణ కోసం సెంట్రల్‌ యూనివర్సిటీలోని శాట్స్‌ షూటింగ్‌ రేంజ్‌లో ప్రాక్టీస్‌ ప్రారంభించాను. అక్కడ కోచ్‌ శ్యామ్‌ దగ్గర నైపుణ్యం పెంచుకున్నాను. ఆ ఏడాది (2017)లో వరుసగా పతకాలు సాధించాను. రాష్ట్ర స్థాయిలో స్వర్ణం, సౌతిండియా, జాతీయ చాంపియన్‌షి్‌పలలో రజత పతకాలు సంపాదించాను. అప్పటినుంచి వెనుతిరిగి చూసింది లేదు.

అక్క అండతో..
మా అక్క వైష్ణవి కూడా షూటరే. జాతీయ స్థాయిలో పలు పతకాలు సాధించింది. అయితే, షూటింగ్‌ ఖరీదైన క్రీడ కావడంతో… కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా… రైఫిల్‌ను పక్కనపెట్టి, చదువు మీద శ్రద్ధ పెట్టమని మా అమ్మా, నాన్నా మా ఇద్దరికీ చెప్పారు. అప్పుడు అక్క షూటింగ్‌కు స్వస్తి పలికి నాకు అండగా నిలబడింది. షూటింగ్‌కు సంబంధించిన ప్రతి అంశంలో నాకు తోడునీడగా ఉంటూ నా ఎదుగుదలకు తోడ్పడింది. నా గెలుపును తన గెలుపుగా భావిస్తూ, ఒక మెంటార్‌గా దిశానిర్దేశం చేస్తూ నన్ను ముందుకు నడిపిస్తోంది.
మెడల్‌ సాధిస్తే ఏమొస్తుంది? ‘‘జాతీయ స్థాయిలో మెడల్స్‌ వచ్చాయా? అయితే, ఏమొస్తుంది? బుద్ధిగా చదువుకుని ఏ ఇంజనీరో, డాక్టరో కాకుండా… ఎందుకు ఈ తుపాకులు పట్టుకుని తిరుగుతున్నావ్‌?’’ అంటూ బంధువులు, సన్నిహితులు కలిసిన ప్రతి చోటా నిరుత్సాహ పరిచేలా మాట్లాడేవారు. అయినా ఏ రోజూ నా సంకల్పం చెక్కు చెదరలేదు. చెప్పాలంటే… వారి మాటలతో నాలో ఇంకా కసి, పట్టుదల పెరిగాయి. నన్ను నేను నిరూపించుకోవాలని తాపత్రయం కలిగింది. షూటర్‌ కావాలనే నా లక్ష్యానికి సహకరించమని నా తల్లితండ్రులను కోరాను. వారు కూడా నా అభిప్రాయాన్ని గౌరవించి, నా ప్రయాణంలో భాగమయ్యారు. నాన్న తన వృత్తిని మానేసి పూర్తి సమయం నాకోసమే వెచ్చించడం మొదలుపెట్టారు. తప్పని గురి… సురభినాలుగు గంటలు మెట్రోలోనే.. కొవిడ్‌ సమయంలో రద్దయిన పోటీలన్నీ గత ఏడాది వరుసగా నిర్వహించారు. వాటిలో సత్తా చాటాలంటే తగినంత ప్రాక్టీస్‌ అవసరం. మేము నాగోల్‌లో ఉంటాం. 50 మీటర్ల షూటింగ్‌ రేంజ్‌ మా చుట్టు పక్కల ఎక్కడా లేదు. సికింద్రాబాద్‌ ఆర్మీ సెంటర్‌లో ఉన్నా… బయటి వారికి ప్రవేశం లేదు. దీంతో నాగోలు నుంచి రాయదుర్గం వరకు మెట్రోలో వెళ్లి, అక్కడి నుంచి ఆటోలో సెంట్రల్‌ యూనివర్సిటీ షూటింగ్‌ రేంజ్‌కు చేరుకునేదాన్న్ణి. ఉదయం ఐదు గంటలకు లేచి ఫిట్‌నెస్‌ కోసం వ్యాయామం, యోగా, బ్రేక్‌ఫాస్ట్‌ పూర్తి చేసుకొని, తొమ్మిది గంటల కల్లా ఇంట్లో నుంచి బయలుదేరితే… ప్రాక్టీస్‌ అనంతరం తిరిగి ఇల్లు చేరేసరికి రాత్రి ఏడు గంటలవుతుంది. వెళ్లడానికి, రావడానికే దాదాపు నాలుగు గంటల సమయం పట్టేది.
07142022004203n21-1
మలుపు తిప్పిన వరల్డ్‌కప్‌
గగన్‌ నారంగ్‌, అభినవ్‌ బింద్రా నా ఆరాధ్య షూటర్లు. గచ్చిబౌలిలోని గగన్‌ సార్‌ అకాడమీ ‘గన్‌ ఫర్‌ గ్లోరీ’లో చేరాక నా నైపుణ్యాలు మరింత పెరిగాయి. షూటింగ్‌ టెక్నిక్స్‌తో పాటు మానసికంగా కూడా దృఢంగా తయారయ్యాను. పరిస్థితులకు తగ్గట్టుగా వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, సమయానుసారం గేమ్‌ను మార్చుకోవడంలో గగన్‌ సార్‌ చాలా తోడ్పాటు అందించారు. ఇక్కడి రేంజ్‌ను అంతర్జాతీయ స్టాండర్డ్స్‌కు తగ్గట్టుగా మార్చడంతో నా గేమ్‌ కూడా వేగంగా మారింది. ఫలితంగా 50 మీటర్ల రైఫిల్‌ ప్రోన్‌ ఈవెంట్‌లో ప్రస్తుతం జాతీయ స్థాయిలో నెంబర్‌ 1 ర్యాంక్‌లో, 3పీ కేటగిరీలో టాప్‌-10లో కొనసాగుతున్నా. దీంతో ఈ ఏడాది మేలో జర్మనీలో జరిగిన జూనియర్‌ షూటింగ్‌ వరల్డ్‌కప్‌ 50 మీటర్ల ప్రోన్‌ కేటగిరీలో పాల్గొనే అవకాశం లభించింది. నా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలనే దృక్పథంతో అక్కడికి వెళ్లాను. కానీ, పతకం సాధిస్తానని అనుకోలేదు. అయితే, సెమీఫైనల్‌ చేరాక… ఇంతవరకు వచ్చి ఉత్త చేతులతో వెళ్లడమేమిటనే పట్టుదలతో ఆడాను. త్రుటిలో పసిడి చేజారినా రజతం దక్కడంతో కష్టానికి ప్రతిఫలం లభించిందని సంతోషపడ్డాను. ఈ పతకం సాధించాక రాష్ట్ర స్థాయిలో పెద్దగా గుర్తింపు రాకపోయినా, జాతీయ స్థాయిలో అభినందనలు వెల్లువెత్తాయి.

మిషన్‌ ఒలింపిక్స్‌…
ఈ అక్టోబరులో కైరో వేదికగా సీనియర్‌ షూటింగ్‌ వరల్డ్‌కప్‌ జరగనుంది. దీనికోసం వచ్చే నెలలో ట్రయల్స్‌ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా దేశంలోని ఎలైట్‌ షూటర్స్‌కు ఢిల్లీలో క్యాంప్‌ ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో పాల్గొనాల్సిందిగా జాతీయ రైఫిల్‌ అసోసియేషన్‌ నుంచి నాకు ఆహ్వానం వచ్చింది. రెండ్రోజుల్లో ఢిల్లీ వెళ్లి శిబిరంలో చేరుతా. ఒలింపిక్స్‌కు అర్హత సాధించడానికి సరిగ్గా ఏడాది సమయం మాత్రమే ఉంది. ఈలోపు 3పీ కేటగిరీలో జాతీయ స్థాయిలో టాప్‌-10 నుంచి టాప్‌-3లోకి రావాల్సి ఉంది. గేమ్‌ పరంగా ఇప్పడు పూర్తి పట్టు సాధించాను. చేయాల్సిందల్లా… ఇకమీదట ఆడే ప్రతి టోర్నీలో మెరుగైన ప్రదర్శన కనబర్చడమే.

సహకారం కావాలి నేను వాడే పాయింట్‌ 22 వాల్టర్‌ రైఫిల్‌, అందులోని బుల్లెట్లు, ట్రౌజర్‌, సూట్‌, కిట్‌…. మొత్తానికి ఏడాదికి రూ.25 లక్షలు వరకు ఖర్చు అవుతోంది. పోటీల్లో పాల్గొనడానికి వెళ్లే ఖర్చులు అదనం. ఇప్పటివరకూ ఎవరిపైనా ఆధారపడకుండా నా తల్లిదండ్రులే ఇవన్నీ సమకూర్చారు. ఇప్పుడు ఇదంతా భారమవుతోంది. ప్రభుత్వం, కార్పొరేట్‌ సంస్థలు ముందుకొచ్చి నాకు సాయం చేస్తే… మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది.