NRI-NRT

వైభవంగా 143వ నెలనెలా తెలుగు వెన్నెల

TANTEX Conducts 143rd Nela Nela Telugu Vennela In Irving Texas-వైభవంగా 143వ నెలనెలా తెలుగు వెన్నెల

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెన్నెల” 143వ సాహిత్య సదస్సు ఆదివారం నాడు సమన్వయకర్త కృష్ణారెడ్డి కోడూరు అధ్యక్షతన వైభవంగా నిర్వహించారు. రేణుశ్రీ బుస, ఉదయ్ వోమరవల్లి, వేముల సాహితి, వేముల సింధూర ప్రార్థనా గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభమయింది. డా. ఊరిమిండి నరసింహారెడ్డి మన తెలుగు సిరి సంపదలు శీర్షికన, నానుడి, జాతీయాలు, పొడువు కథలు గురించి ప్రశ్నలు అడిగి సభికుల్లో ఆసక్తి రేకెత్తించారు. డా.RVSS ప్రసాద్ వేమన పద్యాలు-సామాజిక స్పృహ అనే అంశం మీద మాట్లాడారు. మానవత అమరనాథ్ రెడ్డి తరిమెల సమాజంలో రక్తదానం ప్రాధాన్యత గురించి వివరించి దేశ విదేశాల నుండి పుట్టపర్తి ఆసుపత్రికి వచ్చే రోగులకి తమ సంస్థ మానవత ద్వారా రక్తదానం చేసి ఆదుకుంటామని చెప్పారు. డా.పూదూర్ జగదీశ్వరన్ ఆముక్తమాల్యదలోని కొన్ని పద్యాలను రాగయుక్తంగా చదివి వాటి అర్థాన్ని వివరించారు. వేముల లెనిన్ వాగ్భూషణ భూషణుడు ఏనుగు లక్ష్మణకవి అనే అంశంపై మాట్లాడారు. ముఖ్య అతిథి గీతాంజలి సమకాలీన కథ ఎలా ఉండాలి, మంచి కథకి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి, కథకి నవలకి గల వ్యత్యాసాలు, కథలోని పాత్రలు, శిల్పం, కథకి సంబంధించి విమర్శకుని పాత్ర, కథకుడు విమర్శలని ఎలా తీసుకోవాలి ఇత్యాది విషయాలని వివరించారు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షులు వీర్నపు చినసత్యం, ఉత్తరాధ్యక్షులు, సాహిత్య వేదిక సమన్వయకర్త కృష్ణారెడ్డి కోడూరు, కోశాధికారి శరత్ యర్రం, సాహిత్య కమిటీ సభ్యులు సతీష్ బండారు, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, డా.తోటకూర ప్రసాద్, భాను ఇవటూరి, కిరణ్మయి వేముల, సింధూర వేముల, సాహితీ వేముల, రేణుశ్రీ బుస, ఉదయ్ వోమరవల్లి, సురేష్ కాజ, చంద్రహాస మద్దుకూరి, సి.ఆర్.రావ్, తరుణ్, స్వాతి కృష్ణమూర్తి, సాజి గోపాల్ తదితరులు పాల్గొన్నారు. గీతాంజలిని టాంటెక్స్ సాహిత్య వేదిక సభ్యులు, కార్యవర్గ సభ్యులు, పాలకమండలి సభ్యులు జ్ఞాపికని ఇచ్చి ఘనంగా సత్కరించారు.