DailyDose

అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ ‘గ్యారంటీలే’ అధికం

అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ ‘గ్యారంటీలే’ అధికం

గ్యారంటీ అప్పుల్లో దేశంలోకెల్లా తెలంగాణే టాప్‌లో ఉందని 15వ ఆర్థిక సంఘం వెల్లడించింది. జీఎ్‌సడీపీలో 9.4 శాతం మేర గ్యారంటీ అప్పులు చేసి, అన్ని రాష్ట్రాల కంటే మొదటి స్థానంలో ఉందని వివరించింది. ఇలాంటి గ్యారంటీ అప్పులు చాలా రిస్కుతో కూడుకున్న వ్యవహారం అని, అప్పులు తీసుకున్న కార్పొరేషన్లకూ నష్టదాయకమేనని హెచ్చరించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం, రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై 15వ ఆర్థిక సంఘం ఓ నివేదికను రూపొందించింది. రాష్ట్రాల్లో ఏర్పాటైన వివిధ రకాల కార్పొరేషన్లకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గ్యారంటీ రుణాలను ఇప్పిస్తున్నాయని తెలిపింది. ఇలాంటి గ్యారంటీ రుణాలను బడ్జెట్‌ రుణాల్లో ప్రత్యేకంగా చూపడం లేదని వెల్లడించింది. పైగా రుణాలు తీసుకున్న కార్పొరేషన్లకు అప్పులను తిరిగి చెల్లించే సామర్థ్యం ఉండడం లేదని పేర్కొంది. ప్రభుత్వ గ్యారంటీలతో అప్పులు తీసుకోవడం కార్పొరేషన్లకు సులభతర ప్రక్రియగా మారిందని తెలిపింది. ఇలాంటి రుణాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు భారంగా పరిణమిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. అదేపనిగా గ్యారంటీలు ఇస్తూ పోవడం వల్ల జీఎ్‌సడీపీలో గ్యారంటీ రుణాల శాతాలు పెరుగుతున్నాయని తెలిపింది. ఈమేరకు 22 రాష్ట్రాల గ్యారంటీ రుణాలను పరిశీలించగా తెలంగాణ టాప్‌లో ఉందని వివరించింది. గ్యారంటీ రుణాలు తీసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ తర్వాత రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, ఛత్తీ్‌సగఢ్‌, పంజాబ్‌ వరుసగా ఐదు స్థానాల్లో ఉన్నాయని తెలిపింది. జీఎ్‌సడీపీలో తెలంగాణ తీసుకున్న గ్యారంటీ రుణాలు 9.4 శాతానికి చేరాయని వివరించింది.
*2019-20లో బడ్జెట్‌ రుణాలు 21.32%
తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌ రుణాలతో పాటు గ్యారంటీ రుణాలను కూడా తీసుకుంటోంది. ఏటా ప్రభుత్వం తీసుకుంటూ వస్తున్న బడ్జెట్‌ రుణాలు 2019-20 సంవత్సరం నాటికి రూ.2,05,858 కోట్లకు చేరినట్లు వాస్తవ గణాంకాలు చెబుతున్నాయి. అంటే 2019-20 ఆర్థిక సంవత్సరంలో నమోదైన జీఎ్‌సడీపీలో ఈ అప్పులు 21.32 శాతంగా ఉన్నాయి. వాస్తవానికి ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం అప్పుల మొత్తం జీఎ్‌సడీపీలో 25 శాతానికి మించరాదు. నిబంధనల ప్రకారం బడ్జెట్‌ అప్పులు 25 శాతంలోపే ఉన్నప్పటికీ బడ్జెట్‌ ఆవల తీసుకున్న(ఆఫ్‌ బడ్జెట్‌ బారోయింగ్స్‌) గ్యారంటీ అప్పులు మరో 9.4 శాతానికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. దీనిని కూడా కలుపుకొంటే 2019-20లో అప్పుల శాతం జీఎ్‌సడీపీలో 30.72 శాతానికి చేరినట్లయింది. అంటే ఎఫ్‌ఆర్‌బీఎం చట్ట నిబంధనలను కాదని రుణాలు తీసుకున్నట్లయింది.