DailyDose

ఏపీ. పదవీ విరమణ వయసు మరో ఏడాది పొడిగిస్తారట?

ఏపీ. పదవీ విరమణ వయసు మరో ఏడాది పొడిగిస్తారట?

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును మరో ఏడాది పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62ఏళ్లుగా ఉంది.దీనిని మరో ఏడాదికి పెంచే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల వయసును 60ఏళ్ల అనుచి 62ఏళ్లకు పెంచుతూ రెండేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును మరో ఏడాది పెంచాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది.

ఉద్యోగుల పదవీ విరమణ వయసును ఏడాది పాటు పొడిగించాలనే నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తీవ్రంగా మంతనాలు జరుపుతున్నారు. విస్తృత స్థాయిలో అభిప్రాయ సేకరణ జరిపిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. తుది నిర్ణయం తీసుకోకపోయినా న్యాయపరమైన అంశాలతో పాటు ఉద్యోగుల నుంచి వచ్చే స్పందన ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నారు.

ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపుదలపై ఉద్యోగ సంఘాలు ఎలా స్పందిస్తాయనే సందేహం కూడా ప్రభుత్వానికి ఉంది. అన్ని అంశాలను లోతుగా అధ్యయనం చేసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇప్పటి వరకు రెండుసార్లు ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును పెంచారు. 2014 జూన్‌లో అప్పటి టీడీపీ ప్రభుత్వం 58ఏళ్ల నుంచి రిటైర్మెంట్ వయసును 60ఏళ్లకు పెంచింది. 2019లో అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పిఆర్సీ, డిఏ పెంపులపై ఉద్యోగ సంఘాలు ఆందోళనకు దిగాయి. ఉద్యోగ సంఘాల నుంచి ఒత్తిడి పెరిగిన సమయంలో అనూహ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 62ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

తాజాగా ఉద్యోగుల వయో పరిమితిని మరో ఏడాది పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడం వెనుక ఆర్ధిక కారణాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రెండేళ్ల క్రితం పదవీ విరమణ చేయాల్సిన వారికి అదనంగా రెండేళ్లు పొడిగింపు లభించింది. వాస్తవానికి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన నగదు ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల జిపిఎఫ్ ఖాతాల్లో నగదును సైతం ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించినట్లు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసును మరో ఏడాది పెంచడం వెనుక చెల్లింపుల భారాన్ని వాయిదా వేయడానికే అని ఉద్యోగులు అనుమానిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు ఆర్ధిక ప్రయోజనాలను చెల్లించాల్సి ఉండటం, ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ఖజానాలో అందుకు సరిపడా నగదు లభ్యత లేకపోవడంతో మరో ఏడాది పాటు పదవీ విరమణ వయసును వాయిదా వేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఉద్యోగులతో పాటు సంఘాల నుంచి తీవ్ర నిరసన వస్తుందనే ఆలోచనతోనే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోకుండా తర్జనభర్జన పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఏపీలో ఎన్నికలు వచ్చే ఏడాది జరుగనుండటంతో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు ప్రభావం ఎన్నికలపై ఏ మేరకు చూపుతుందనే అంచనా ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నారు