WorldWonders

కార్మిక దినోత్సవ అభినందనలతో…. నేడు కార్మిక దినోత్సవం.. ప్రత్యేక కథనం..

కార్మిక దినోత్సవ అభినందనలతో…. నేడు కార్మిక దినోత్సవం.. ప్రత్యేక కథనం..

🩸🩸🩸🩸🩸🩸🩸

నువ్వే శ్రమ..
నువ్వే పరిశ్రమ..
అయినా నీ పురోగతి భ్రమ!

నువ్వే కార్ఖానా..
నువ్వే బందిఖానా..
అయినా ఉండదే నీకు
మూడు పూటలా ఖానా!

నువ్వే భవనం..
నువ్వే భువనం..
అయినా నీ పేరు
అలగా జనం..!

నువ్వే కష్టం..
నువ్వే ఇష్టం..
అయినా నీ బ్రతుకు నికృష్టం!

నీ రక్తమేమో ఎరుపా..
నా రక్తమైతే అది బలుపా..
నా సంపద నీకు అందని ద్రాక్ష
అందుకే అది పులుపా..
నీకేమో..ఒరేయ్ అనే పిలుపా
నాకేమో నీ శ్రమ తెలియని
కింది నలుపా..!

నా ఇల్లు నువ్వే కట్టి..
నా గచ్చు నువ్వే అద్ది..
నా బట్టలు నువ్వే కుట్టి..
నా కారు నువ్వే నడిపి..
నా కోసం పడిగాపులు కాసి..
చివరకి నా పాడె కూడా నువ్వే మోసి..
నన్ను కడదాకా నడిపిస్తే
నువ్వేమో లేబర్..
నేనేమో ఓనర్..!

నీ కోరిక..
నాకు ఉండదే తీరిక..
నీ జీతం..నీ జీవితం..
నాకు పట్టని సంగతి..
నీ హక్కు..
నా కాలి కింద
నలిగే తొక్కు..
నా బీరువాలో మూలిగే
నలగని చెక్కు బుక్కు..
నీది చెమట కంపు..
నాదేమో సెంటు వాసన..
నాది విల్లా..
కాలువ పక్కన..
దోమల కిసుక్కున
నీదీ ఒక ఇల్లా..
నేను ఏసి..
నువ్వు రాత్రంతా
ఆకాశం కిందే పడకేసి..!

ఎలా చూసినా
నీ కంటే నేనెక్కువ..
నువ్వు చాలా తక్కువ..
మరి నీకెందుకు
అంత గౌరవం..
నేనెందుకు లోకువ..
నీకో రోజు..మే డే..
అది ప్రపంచ పండగ..
మరి నాకు..
ప్రతి రోజూ దండగ..
నువ్వు నా గులామువే
కానీ..నీకు లాల్ సలాం..
నేనేమో నీ శ్రమ దోచేసే
జాదమలాం..,!

చివరాఖరికి..
నువ్వేమో కార్మికుడివి..
నేను కార్ మికుడుని..

నీది కష్టనష్టాల రాపిడి..
నాది ఒకటే దోపిడీ..

నా పరిశ్రమకు ఖరీదు కట్టే
ఇన్కమ్ టాక్స్ రుబాబులు..
రాజకీయ నవాబులు ఉంటే..
నీ శ్రమకు ఖరీదు కట్టే
షరాబు లేడోయ్!

ఎంతయినా నువ్వు నువ్వే..
నేను నేనే..
ఒకనాటికి నువ్వు నేనైనా
ఏనాటికీ నేను నువ్వు కాలేను!!
అందుకే..అందుకే..
అందుకో నా సలాము కూడా..
నేనూ ఈరోజున నడుస్తా
నీ తోడ..!
________
కార్మిక దినోత్సవ అభినందనలతో..