Movies

200 మంది ఇళయ రాజాలు పుడతారు!

200 మంది ఇళయ రాజాలు పుడతారు!

సంగీత దిగ్గజం ఇళయరాజా ఔన్నత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సంగీతంలో ఆయనో లెజెండ్. ఎన్నో సినిమాలకు సంగీతం అందించి భారతీయ చిత్ర పరిశ్రమలోనే చెరగని ముద్ర వేసారు. ఆయనకంటూ కోట్లాది మంది అభిమానులున్నారు. ఫాలోవర్స్ ఉన్నారు. ఇళయ రాజా ట్యూన్ అంటే ఆ సినిమాకే అందం వచ్చేస్తుంది. అయితే ఇటీవల కాలంలో సినిమాలు తగ్గించి ఎక్కువగా విదేశాల్లో కచేరీలు నిర్వహిస్తున్నారు.

దీంతో సినిమాల కన్నా ఎక్కువ ఆదాయం వాటి ద్వారానే వస్తుంది. అలాగని సినిమాల కు దూరం కాలేదు. అప్పుడప్పుడు మనసుకు నచ్చిన కథలొస్తే బాణీలు కడుతున్నారు. తాజాగా అలాంటి లక్కీ ఛాన్స్ ‘మ్యూజిక్ స్కూల్’ అనే సినిమా దక్కించుకుంది. శ్రియా శరన్..శర్మాన్ జోషి షాక్ కీలక పాత్రల్లో తెరకెక్కిన చిత్రమిది. యామిని ఫిలింస్ పతాకం పై పాపారావు బియ్యాల స్వీయా దర్శకత్వంలో నిర్మిస్తున్నారు.

దిల్ రాజు చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈనెల 12న రిలీజ్ అవుతున్న సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ..ఇళయరాజా సహా తదితరులు హాజరయ్యారు. పాటల్ని కేటీఆర్ ఆవిష్కరించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ‘పాపారావు 17 ఏళ్లగా తెలుసు. ఆయనతో మంచి అనుబంధ ఉంది. ఇక ఇళయరాజాతో ఈ గౌరవాన్ని పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. సర్ ఒప్పుకుంటే తెలంగాణ లో ఆయన ఆధ్వర్యంలోనే సంగీత విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తాం.

మనదేశం ప్రపంచంలోనే అత్యున్నత శ్రేణుల్లోనే కొనసాగాలంటే శృజనాత్మకత ఎంతో కీలకంఅని అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలకు ఇళయరాజా స్పాట్లో నే స్పందించారు. ‘నా పేరుతో సంగీతానికి సంబంధించి కార్యక్రమం చేస్తానంటే ఒద్దు అని ఎలా అనగలను. యూనివర్శిటీ ఇక్కడ ఏర్పాటైతే నాలాంటి వాళ్లు మరో 200 మంది వస్తారు. ఎంతో మంతి ప్రతిభావంతులు ఉన్నా సరైన ప్రోత్సాహం లేక రాలేకపోతారు.

అలాంటి ప్రతిభావంతులు పైకి రావాలి’ అని అన్నారు. మరి మంత్రి వ్యాఖ్యలు ఎప్పుడు నిజం చేస్తారో చూడాలి. ఇప్పటికే టాలీవుడ్ ని ఫిల్మ్ ఇండస్ట్రీ హబ్ గా మారుస్తామని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో ప్రకటించారు. ఆ తర్వాత ప్రత్యేకంగా స్టూడియోలు నిర్మించడానికి స్థలాలు కేటాయించినట్లు వార్తలొచ్చాయి. కానీ వాటి నిర్మాణం గురించి మళ్లీ ఎలాంటి వార్త రాలేదు.