Agriculture

తెలంగాణాలో వంకాయ పంట సాగు జాగ్రత్తలు

Egg Plant Farming In Telangana-Daily Telugu Agricultural News

రాష్ట్రంలో సాగు చేయబడుతున్న ముఖ్యమైన పంట వంకాయ. ఈ పంటలోనూ సూటి రకాలలో రైతులు సొంతంగా తమస్థాయిలో విత్తనోత్పత్తి చేపట్టవచ్చు. ప్రస్తుతం రంగును, ఆకారాన్ని బట్టి పలురకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో పూసా పర్పుల్ లాంగ్, పూసా క్రాంతి, పూసా పర్పుల్ క్లస్టర్, హిస్సార్ ప్రగతి, హిస్సార్ జముని అలాగే మన స్థానిక రకాలైన శ్యామల, గులాబీ, భాగ్యమతి అందుబాటులో ఉన్నాయి. మన రాష్ట్రంలో సాగు చేయడానికి ఇవి అనుకూలం. కాబట్టి వీటిలో విత్తనోత్పత్తి చేపట్టవచ్చు. అయితే మేలైన విత్తనోత్పత్తికి కొన్ని అంశాల్లో జాగ్రత్తలు పాటించాలి.

వాతావరణం: వంకాయ ఉష్ణమండలంలో పండే పంట. తీవ్ర చలికి తట్టుకోలేదు. దీర్ఘకాల వేడి వాతావరణం వంకాయ విత్తనోత్పత్తికి అత్యంత అనుకూలం. తక్కువ వేడి, ఎక్కువ చలి వాతావరణం పనికిరాదు. మేలైన మొక్క వృద్ధికి, కాయ దిగుబడికి 13 నుంచి 21 డిగ్రీల సెల్సియస్ సరాసరి ఉష్ణోగ్రత అనుకూలంగా ఉంటుంది. 25 డిగ్రీల ఉష్ణోగ్రతలో విత్తన మొలక శాతం బాగుంటుంది.

పూత సంబంధిత అంశాలు: వంకాయలో నాలుగు రకాల పూలు వస్తాయి. అందులో కేవలం దీర్ఘ అండకోశంతో ఉండి సాధారణ అండాశయం ఉండేవి, మధ్యస్థ అండకోశంతో ఉండే రెండు రకాల పూలలో మాత్రమే విత్తనం కట్టుతుంది. స్వతహాగా వంకాయ స్వపరాగ సంపర్క పంట. అయితే పరపరాగ సంపర్కం 5 శాతంపైనే ఉంటుంది. కాబట్టి దీన్ని తరుచుగా పరపరాగ సంపర్కం చెందే పంట. ఉష్ణోగ్రతను బట్టి పొద్దుగాల 7 గంటల నుంచి 8 గంటల మధ్య పూలు విచ్చుకుంటా యి. తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటే ఆలస్యంగా విచ్చుకుంటాయి. రెండు గంటల వరకు ఇది కొనసాగుతుంది. ఆ తర్వాత పూలు సాయంత్రం వరకు ముడుచుకుంటా యి. ఈ ప్రక్రియ మూడు, 4 రోజులు కొనసాగుతుంది.

వేర్పాటు దూరం: వంకాయలో విత్తన నాణ్యత కోసం వేర్పాటు దూరం చాలా కీలకం. ఫౌండేషన్ విత్తనం ఉత్పత్తికి 300 మీటర్లు, ధృవీకరణ విత్తనం ఉత్పత్తికి 150 మీటర్ల వేర్పాటు దూరం పాటించాలి.

నేలలు: మురుగు నీరుపోయే సౌకర్యం ఉన్న ఎర్రనేలలు ఈ పంట సాగుకు అనుకూలం. సారవంతమైన, మురుగునీటి సౌకర్యం ఉండి, ఉదజని సూచిక 6.5 కంటే తక్కువ ఉన్న నేలలు ఎంపిక చేసుకోవాలి.

ఎరువులు: ఆధునిక రకాలలో విత్తనోత్పత్తికి భారీగానే ఎరువులు అవసరం. హెక్టారుకు 25 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువు లేదా కంపోస్టు వేయాలి. వీటిని నేల దుక్కిలో కలిపి దున్నాలి. ప్రధాన పొలంలో వాడేందుకు 100 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరం, 25 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులు ఎకరానికి పడేటట్లు చూసుకోవాలి.

విత్తనమోతాదు: హెక్టారుకు 400-500 గ్రాములు అవసరం.

విత్తే సమయం: ఏడాదంతా విత్తుకోవచ్చు. అయితే వర్షాలు వచ్చే సమయంలో ఈ విత్తన పూత రాకుండా చూసుకోవాలి. అప్పుడే మంచి దిగుబడి వస్తుంది. సాధారణ పంటల్లోలాగే విత్తన సమయాన్ని పాటించాలి.

నారుమడి: భూమట్టం నుంచి 15 నుంచి 20 సెం.మీ. ఎత్తులో తయారుచేసిన ఎత్తైన నారుమడులలో వరుసలలో 8-10 సెం.మీ దూరంలో నారు పోయాలి. బాగా చివికిన పశువుల ఎరువుతో పలుచగా విత్తనాన్ని కప్పాలి. పొద్దుగాల, సాయంత్రం నారుమడులు తడుపాలి. మొక్కలు 4-5 సెం.మీ పొడవు ఉన్నప్పుడు పలుచన చేయాలి.

కోత, విత్తన సేకరణ: కల్తీల ఏరివేత తర్వాత ముదిరిన, పసుపు రంగులోకి మారిన పండ్లను సేకరించి ముక్కలుగా చేయాలి. తగిన నీటిని చేర్చి పిసకాలి. ఉష్ణోగ్రతను బట్టి 48-96 గంటల పాటు పులియబెట్టాలి. ఆ తర్వాత విత్తనాలను సేకరించాలి. నీడలో ఆరబెట్టి నిల్వ చేసుకోవాలి.

విత్తన దిగుబడి: రకాన్నిబట్టి, పంట పరిస్థితిని బట్టి హెక్టారుకు 4-6 క్వింటాళ్ల విత్తన దిగుబడి వస్తుంది. ధృవీకరణ విత్తనాలు లేదా ట్రూత్‌ఫుల్లీ లెబెల్డ్ విత్తనాలు గా అమ్మేందుకు కావాల్సిన ప్రమాణాలు పాటించాలి.

కనీస భౌతిక స్వచ్ఛత: 97 శాతం
గరిష్ఠ వ్యర్థ పదార్థం: 2 శాతం
కలుపు విత్తనాలు, ఇతర పంట విత్తనాలు
(గరిష్ఠంగా): ఉండకూడదు
మొలకశాతం: 70 శాతం
విత్తన తేమ శాతం: 8 శాతం (సాధారణ విత్తన సంచి లో); 6 శాతం (తేమ చొచ్చుకుపోని విత్తన సంచిలో)

కల్తీల ఏరివేత:
విత్తనోత్పత్తి అత్యంత కీలకాంశం కల్తీల ఏరివేత. నాణ్యమైన విత్తనోత్పత్తి మొత్తం ఈ అంశంపైనే ఆధారపడి ఉంటుంది. మొక్క భౌతిక లక్షణాల ఆధారంగా కల్తీలను ఏరివేయాలి. కాయలు ఏర్పడే లక్షణాలు, స్వభావం, తెగుళ్లు సోకిన మొక్క భాగాల ఆధారంగా కల్తీలను గుర్తించి ఏరివేయాలి. విత్తనాలను నష్టపరిచే తెగుళ్లు ఆశిస్తే, వాటి నుంచి విత్తనాలు సేకరించరాదు. వెర్రితెగులు ఆశించిన మొక్కలు కాయలు పట్టవు. కాబట్టి వాటిని గుర్తించిన వెంటనే తొలిగించాలి. శాఖీయ దశ, తొలి కాయ దశ, కాయలు పూర్తిగా ఏర్పడిన తర్వాత ఇలా మూడు దశలలో తప్పకుండా కల్తీలను ఏరివేయాలి. ఈ దశలో విత్తన పొలాలలో క్షేత్ర తనిఖీలు తప్పనిసరి.

ప్రధాన పొలంలో నాటడం
12-15 సెం.మీ ఎత్తు పెరిగిన నారును, 4-5 వారాల వయసున్న నారును బాగా దున్ని తయారుచేసిన ప్రధాన పొలంలో నాటాలి. పొడవు కాయలను ఇచ్చే రకాలను 60X60 సెం.మీ. దూరం పాటించి వరుసలు, వరుసలలో మొక్కల మధ్య నాటాలి. గుండ్రటి కాయలను ఇచ్చే రకాలను 75X75 సెం.మీ దూరంలో నాటాలి. సాయంత్రం పూట నాటి, వెంటనే తేలికపాటి నీటి తడులివ్వాలి. వంకాయలో వేరు వ్యవస్థ నేలపైనే ఉంటుంది. కాబట్టి ఎక్కువసార్లు తడులివ్వాలి. మొదటి దశలో వంకాయ మొక్కల పెరుగుదల మెల్లగా ఉంటుంది. కాబట్టి కలుపు మొక్కలతో పోటీ పడలేవు. అందువల్ల మొదటి 25-30 రోజులలోపే కలుపు నివారణ చేపట్టాలి.