Politics

కేసీఆర్‌కు ఉత్తమ ప్రశ్నలు

Uttham Kumar Reddy Questions KCR On His Promises-Telangana Politics Dec 2019

తెరాస రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు, అప్పులు, ఆందోళనలతోనే ఈ ఏడాది మొత్తం గడిచిపోయిందని ఆయన ఆక్షేపించారు. గాంధీభవన్‌లో ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం తప్పిదాల వల్ల 26 మంది ఇంటర్‌ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఆర్టీసీ విషయంలో ప్రభుత్వ ఉదాసీన వైఖరితో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. దిశ ఘటనతో పాటు హజీపూర్‌, వరంగల్‌, ఆసిఫాబాద్‌, జడ్చర్ల హత్యలు దేశవ్యాప్తంగా తెలంగాణ పరువు తీశాయని ఆయన దుయ్యబట్టారు. అవినీతి పెచ్చుమీరిందని.. కేసీఆర్‌ అసమర్థ ఆర్థిక విధానాలతో రాష్ట్రం దివాలా తీసిందని ఆరోపించారు. రూ.3లక్షల కోట్లు అప్పు చేసినా ఏ ఒక్క ఉత్పాదక రంగాన్నీ అభివృద్ధి చేయలేదన్నారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాలకు రూ.లక్షల కోట్లు ఖర్చు చేశారని ఉత్తమ్‌ ధ్వజమెత్తారు. కొత్త అసెంబ్లీ, సచివాలయం కట్టాలనుకున్నప్పుడు ఆర్థిక క్రమశిక్షణ ఎందుకు గుర్తురాలేదని ఆయన ప్రశ్నించారు. మద్యం ఆదాయాన్ని రూ.22వేలకోట్లకు పెంచుకోవడంలో మాత్రమే ప్రభుత్వం ప్రగతి సాధించిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మద్యంతోనే నేరాలు పెరిగిపోతున్నాయని.. దాన్ని నియంత్రించాలని సూచించారు. ఎన్నికల ముందు రుణమాఫీ, నిరుద్యోగభృతిపై ఇచ్చిన హామీలు ఏమయ్యాయని కేసీఆర్‌ను ఉత్తమ్‌ ప్రశ్నించారు.