Politics

ఎన్ని వేలకోట్లు ఖర్చు చేసినా అమరావతిని అభివృద్ధి చేయలేము

YS Jagan Shares His Opinion On Amaravati And Capital

ఇవాళ జరిగిన కేబినెట్‌ భేటీలో రాజధాని తరలింపుపై మంత్రులకు సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి అరగంట పాటు వివరించినట్లు సమాచారం. ఎన్నివేల కోట్లు ఖర్చు చేసినా అమరావతిని అభివృద్ధి చేయలేమని సీఎం అన్నట్లు సమాచారం. రాజధాని కోసం వెచ్చించే నిధుల్లో.. పదిశాతం విశాఖకు ఖర్చు పెడితే హైదరాబాద్‌ స్థాయి నగరం అవుతుందని సీఎం అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. రాజధాని మార్పు ఎందుకోసమో ప్రజలకు చెప్పి చేద్దామని కొందరు మంత్రులు, వచ్చే నెల 4న ప్రకటన చేద్దామని మరి కొందరు మంత్రులు చెప్పినట్లు తెలిసింది. హైపవర్‌ కమిటీ రిపోర్టు ఆధారంగా ప్రకటన చేద్దామని కొందరు మంత్రులు అభిప్రాయపడ్డారు. మంత్రులు చెప్పిన విషయాలపై స్పందించిన సీఎం.. రాజధాని తరలింపుపై తొందరేమీ లేదని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. జీఎన్‌ రావు కమిటీ నివేదిక సారాంశాన్ని పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు కేబినెట్లో చదివి వినిపించారు. జీఎన్‌రావు కమిటీ నివేదికపై మంత్రులందరి అభిప్రాయాన్ని జగన్‌ తీసుకున్నారు. జీఎన్‌రావు కమిటీ నివేదిక త్వరితగతిన అమలుకు మంత్రులు అంగీకారం తెలిపారు. వీలైనంత త్వరగా రాజధాని అంశాన్ని తేల్చేయాలని కొందరు మంత్రులు అభిప్రాయం వ్యక్తం చేశారు. బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ నివేదిక వచ్చిన వెంటనే రాజధానిపై తేల్చేద్దామని మరికొందరు మంత్రులు సీఎంకు వివరించారు. తొందరపాటు లేకుండా విధి విధానాలను అనుసరించి నిర్ణయాలు ఉండాలని మంత్రులు బొత్స, పేర్ని, బుగ్గన, పుష్ప శ్రీవాణి… సీఎంతో అన్నారు. రైతుల ఆందోళనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందనే విషయాన్ని అర్ధమయ్యేలా ప్రజలకు చెప్పాలని సీఎం జగన్‌ మంత్రులను సూచించారు. మంత్రివర్గ ఉప సంఘం నివేదికలోని సారాంశాన్ని కేబినెట్‌కు మంత్రి బుగ్గన వివరించారు. నివేదికలోని అంశాలను సీబీఐ లేదా సీఐడీతో విచారణ జరిపించాలని పలువురు మంత్రులు కోరారు. గత ప్రభుత్వంలో అక్రమాలపై పక్కాగా విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని సీఎం తేల్చి చెప్పారు. రాజధాని అంశంపై మంత్రివర్గ ఉప సంఘాన్ని వేయాలనే ప్రతిపాదన ఉన్నా.. మంత్రులు, అధికారులతో కూడిన హైపవర్‌ కమిటీ వేస్తే రాజకీయాలకు తావుండదని కేబినెట్‌లో అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలిసింది.