Fashion

నగలు ఒక దగ్గర కుప్పగా పడేయకండి

Do Not Dump All Your Jewelry At One Place

ఎంతో ఖరీదు పెట్టి నగలని ఇష్టంగా కొంటాం. వాటిల్లో ముత్యాలు, విలువైన రాళ్లు, వజ్రాలు ఉంటాయి. ఇలా ఎన్నో రకాల విలువైన నగలు ఉంటాయి. చిన్న నిర్లక్ష్యం జరిగినా మరమ్మతులకి వేలల్లో ఖర్చవుతుంది. అలా కాకుండా వాటిని జాగ్రత్తగా కాపాడుకునేందుకు కొన్ని చిన్న చిట్కాలను పాటిస్తే సరి.
* ఏవైనా నగలే అన్నట్టుగా అన్నిరకాల నగలనీ ఒకేచోట కుప్పగా పెట్టకూడదు. రాళ్లనగలు, ముత్యాల నగలూ ఒకేచోట ఉండకూడదు. ఉంటే ఒకదానితో ఒకటి రాపిడికి గురై గీతలు పడి ఆభరణం అందమంతా పోతుంది.
* పెద్ద పెద్ద హారాలని విలువైన చెవి పోగులనీ ఒకేచోట కాకుండా వేర్వేరు వెల్వెట్ సంచులు కొని విడివిడిగా పెట్టాలి. అప్పుడు అన్నింటినీ కలిపి ఓ పెద్ద పెట్టెలో భద్రపరచుకోవచ్చు.
* పచ్చలు, కెంపులు, ముత్యాలతో చేసిన నగలని చాలా జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ఇవి రసాయనాల ప్రభావానికి గురయ్యే ఆస్కారం చాలా ఎక్కువ. ముఖ్యంగా తలకి వాడే స్ప్రేలు వీటి అందాన్ని తొందరగా దెబ్బతీస్తాయి. అందుకని శిరోజాలంకరణ, దుస్తుల అలంకరణ పూర్తయి స్ప్రేలు, పరిమళాలు చల్లుకున్న తర్వాతే నగలు ధరించడం మంచిది.
* పగడాలు, దంతాల నగలని బ్రష్ పెట్టి శుభ్రం చేస్తే గీతలు పడతాయి. అందుకని మెత్తని వస్త్రంతో కానీ, దూదితో కానీ అద్దినట్టుగా శుభ్రం చేయాలి.
* కుళాయి నీటిలో క్లోరిన్ శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ నీటితో శుభ్రం చేస్తే వాటి అందం దెబ్బతింటుంది.
* నీలాల నగలని గోరువెచ్చని సబ్బునీటితో శుభ్రం చేసి ఏమాత్రం ఆలస్యం చేయకుండా పొడిబట్టతో అద్ది తడిలేకుండా చేయాలి. పచ్చలు, జేడ్స్, కనకపుష్యరాగంతో చేసిన నగలని ఈ విధంగానే శుభ్రం చేసుకోవచ్చు.
* ముత్యాలని దారాలతో గుచ్చితే కనుక ఆ దారాన్ని రెండేళ్లకోసారి మార్చడం తప్పనిసరి. ముత్యాల నగలను కచ్చితంగా మెత్తని పాతవస్త్రంలో మాత్రమే చుట్టి భద్రపరచుకోవాలి. లేదంటే మెత్తని మఖ్మల్ వస్తమ్రైనా ఉపయోగించాలి.