Business

₹14లక్షల కోట్ల సంపద

₹14లక్షల కోట్ల సంపద

జెఫ్ బెజోస్.. సంపద సృష్టించడంలో ఆరి తేరిన గొప్ప వ్యాపార వేత్త. కరోనాకు దెబ్బకు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కకావికలమైనా ఆయన సారథ్యంలోని ఆమెజాన్ సంస్థ మార్కెట్ విలువ మాత్రం పెరుగుతూనే పోయింది. ఈ క్రమంలో ఆయన ప్రపంచ కుబేరులలోనే ప్రథముడిగా నిలిచారు. అయితే ఈ అప్రతిహత ప్రయాణంలో ఆయన మరో అపూర్వమైన రికార్డు సాధించారు. ప్రపంచంలోనే 200 బిలియన్ డాలర్లకు పైగా వ్యక్తిగత సంపద కలిగిన తొలి వ్యక్తిగా అవతరించారు. మన కరెన్సీలో ఈ మొత్తం విలువ రూ.1,48,71,30,00,00,000.. అక్షరాల చెప్పుకోవాలంటే.. దాదాపు 14.8 లక్షల కోట్లు. ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక.. బెజోస్ సంపద విలువను 204.6 బిలియన్ డాలర్లుగా పేర్కొంటే బ్లూమ్‌బర్గ్ దీన్ని 202 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకున్నా కూడా ఆయన విలువ 200 బిలయన్ డాలర్లకు పైనే. బెజోస్ తరువాతి స్థానంలో ఉన్న మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ సంపద ప్రస్తుతం 116 బిలియన్ డాలర్లే. దీన్నిబట్టి.. బెజోస్ ఆస్తులు కుబేరుడినే తలదన్నేలా ఉన్నాయని అని అనిపించకమానదు! బెజోస్ సంపద విలువ అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఒక శాతంగా ఉంటుందని కూడా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలసీ స్టెడీస్ నివేదిక ప్రకారం.. కరోనా మహమ్మారి కారణంగా అత్యధికంగా లాభ పడ్డ వ్యక్తి జెఫ్ బెజోస్ అని తేలింది. అయితే కరోనా కాలంలో టెక్ రంగానికి చేందిన వారి సంపద అధికంగా వృద్ధి చెందిందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంపద ఏకంగా 220 శాతం మేర పెరిగింది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలసీ స్టెడీస్ రూపొందించిన ఈ నివేదికలో స్థానం పొందిన 12 మంది అమెరికా కుబేరుల్లో ఎనిమిది మంది టెక్ రంగానికి చెందిన వారే.