WorldWonders

మరాఠీ వైద్యుడికి చైనాలో విగ్రహం

మరాఠీ వైద్యుడికి చైనాలో విగ్రహం

ఈ చిత్రంలో కనిపిస్తున్న కంచు విగ్రహం మహారాష్ట్రలోని సోలాపూర్‌లో పుట్టిన డాక్టర్‌ ద్వారకానాథ్‌ కొత్నిస్‌ది. ఈమధ్యే చైనాలోని షిజియాజ్‌హువాంగ్‌లో స్థానిక ప్రభుత్వం ఏర్పాటుచేసింది. అవును, మీరు చదివింది నిజమే. ఇప్పుడంటే రెండు దేశాల మధ్యా ఉద్రిక్తతలు ఉన్నాయి కానీ ఒకప్పుడు భారత్‌, చైనాల మధ్య స్నేహ వాతావరణమే ఉండేది. దాంతో చైనా-జపాన్‌ మధ్య యుద్ధం సమయంలో 1938లో చైనా సైనికులకు సేవ చేసేందుకు భారత జాతీయ కాంగ్రెస్‌ అయిదుగురు డాక్టర్లను పంపింది. వారిలో ఒకరే ద్వారకానాథ్‌ కొత్నిస్‌. చైనీయులు ఈయన్ని ‘కీ డిహువా’గా పిలుచుకుంటారు. యుద్ధం సమయంలో ద్వారకానాథ్‌ చైనాలో అయిదేళ్లపాటు సంచార ఆసుపత్రిలో తిరుగుతూ వందలమంది సైనికులకు చికిత్స అందించారు. ఆ క్రమంలో ఒక్కోసారి 72 గంటలపాటు విరామం కూడా లేకుండా ఆపరేషన్లు చేస్తూనే ఉండేవారట. దాంతో ఆరోగ్యం దెబ్బతిని 32 ఏళ్ల వయసులో భార్యనీ, మూడు నెలల బాబునీ ఒంటరిని చేసి విధుల్లో ఉండగానే మరణించారు. అయితే, ఆ దేశం ద్వారకానాథ్‌ని మర్చిపోలేదు. ఆయన పేరుమీద ‘కీ డిహువా మెడికల్‌ సైన్సెస్‌ సెకండరీ స్కూల్‌’ని 1992లో ప్రారంభించింది. ఇక్కడ చదివే ప్రతి డాక్టరూ కొత్నిస్‌లా సేవలందించాలని బోధిస్తుంటారట. ఇప్పుడు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసింది కూడా ఈ స్కూల్‌ ఎదురుగానే. చైనాలోని ఇతర ప్రాంతాల్లోనూ కొత్నిస్‌ స్మారక చిహ్నాలుంటాయి. కొత్నిస్‌ పెళ్లి చేసుకున్నది కూడా చైనా అమ్మాయినే. ఆయన జీవితం ఆధారంగా అక్కడ సినిమాని కూడా తీశారు.