Fashion

పాదరక్షల ఫ్యాషన్‌కు ఒక లెక్క ఉంది

పాదరక్షల ఫ్యాషన్‌కు ఒక లెక్క ఉంది

దుస్తులకు తగ్గ యాక్సెసరీల్లో ఇప్పుడు చెప్పులు కూడా ఓ భాగమే. అవి కూడా ఏదో వేసుకున్నాం అంటే వేసుకున్నాం అనుకునే రోజులు కావివి. ట్రెండీగా ఉండాలి. వావ్‌లుక్‌ తెచ్చిపెట్టాలి.అలాగని అన్నివేళలా ఎత్తుచెప్పులే ఉండాలని లేదు.వాటికీ కొన్ని పరిష్కారాలు ఉన్నాయి. చాలామంది ఎన్నిరకాల చెప్పుల జతలు తమ దగ్గర ఉన్నా…ఎత్తు చెప్పులే ఫ్యాషన్‌ అనే భ్రమలో ఉంటారు. అసలు సమస్య ఇక్కడే ఉంది. ఇలా ఎత్తు చెప్పులను దీర్ఘకాలం వాడటం వల్ల, అలానే చెప్పుల్ని కొనేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇబ్బందులు తప్పవంటారు నిపుణులు. ఇంతకీ అవి ఎలాంటివి… అసలు చెప్పుల్లో ఫ్యాషన్‌ ఏంటి? ఎలాంటివి ఎంచుకోవాలనే స్పష్టత ఉన్నప్పుడు ఆ ఇబ్బందుల్ని తగ్గించుకోవచ్చు. చాలామంది పాయింటెడ్‌ హీల్స్‌, స్టిలెట్టోలు, హైహీల్స్‌ వేసుకుంటేనే ఫ్యాషన్‌ అనుకుంటారు. కానీ దుస్తుల్ని బట్టి ఎంచుకుంటే ట్రెండీగా కనిపించొచ్చు.

* మిడీలు, మినీలు, అనార్కరీలు వంటివి వేసుకున్నప్పుడు వెడ్జెస్‌ రకాలు బాగుంటాయి. ఇవి ఎత్తుగా ఉన్నప్పటికీ శరీర బరువు పాదంపై సమానంగా పడటం వల్ల కొంత వరకూ మేలు.
* ఎత్తు లేకపోయినా ఫరవాలేదు కానీ వేసుకుంటే స్టైలిష్‌గా కనిపించాలి అని కోరుకునేవారికి కిటెన్‌హీల్స్‌ సరైన ఎంపిక. ఇవి జీన్స్‌, క్రాప్‌టాప్‌ వంటివాటి మీదకు బాగుంటాయి.
* టీ స్ట్రాప్‌ శాండిల్స్‌ కూడా స్టైలిష్‌ లుక్‌తో ఆకట్టుకుంటాయి. వీటిని ఏ దుస్తులమీదకైనా ఎంచుకోవచ్చు. హీల్స్‌ లుక్‌ని తెచ్చిపెడతాయి.
* ఈ మధ్యకాలంలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి బూట్లు. వీటిల్లో స్నీకర్స్‌, మెకాసిన్స్‌ రకాల్ని వెస్ట్రన్‌, ఇండో వెస్ట్రన్‌ దుస్తులకు జతగా వేసుకోవచ్చు. అయితే ఇవి సంప్రదాయ దుస్తుల మీదకు అంతగా నప్పవు.
* సంప్రదాయ దుస్తుల మీదకే కాకుండా పాశ్చాత్య శైలి దుస్తులమీదకు నప్పే మరో రకం బెల్లీస్‌. దీన్నే బ్యాలే ఫ్లాట్‌ అని కూడా అంటారు. వీటిని ఆఫీసుకి కూడా వేసుకెళ్లొచ్చు. హుందాగా కనిపిస్తాయి. ఎక్కువ సేపు వేసుకున్నా సౌకర్యంగానే ఉంటాయి.
* ఎక్కువ సేపు నిలబడి ఉండాలన్నా, నడవాలన్నా కూడా చెప్పుల ఎత్తు రెండు అంగుళాలు దాటకుండా చూసుకోండి. అలానే మొదటిసారి ఎత్తు చెప్పుల్ని ఎంచుకునేవారు మూడు అంగుళాల ఎత్తులో ఉన్నవి వేసుకోవద్దు. కాళ్లవేళ్లు, పాదాలు, కండరాలు నొప్పి పుడతాయి.
* ఎప్పటికప్పుడు పాదం పరిమాణం మారుతుంది. మరీ బిగుతుగా, వదులుగా ఉన్న ఎత్తు చెప్పుల్ని తీసుకోవడం వల్ల ప్రమాదాలు కొని తెచ్చుకున్నవారవుతారు. ఎప్పటికప్పుడు మారే సైజుల్ని బట్టే వాటిని ఎంచుకోవడం మంచిది.
* ఒకవేళ రోజంతా ఎత్తు చెప్పులు వేసుకోవాల్సి వచ్చినా సరే… మధ్య మధ్యలో వాటిని వదిలేయాలి. పాదాల్ని గుండ్రంగా తిప్పడం, ముందుకు వంచడం వంటివి చేయడం వల్ల పాదాలు ఆరోగ్యంగా ఉంటాయి.
* మన శరీర భారాన్ని మోసేది పాదాలే. ఎత్తు మడమ చెప్పులు వేసుకుంటే చూడ్డానికి స్టైలిష్‌గా కనిపించొచ్చు కానీ ఎత్తుపెరిగే కొద్దీ భారం మడమలపై పడుతుంది. ఉదాహరణకు హీల్‌ ఒక అంగుళం ఎత్తు ఉంటే మడమలపై భారం మామూలుకన్నా 22 శాతం అధికంగా ఉంటుందని చెబుతోంది ఓ వైద్య అధ్యయనం. అలా ఎత్తు పెరిగే కొద్దీ సమస్య తీవ్రం అవుతుంది. కాబట్టి అలాంటి చెప్పుల్ని సందర్భాన్ని బట్టి ఎంచుకోవాలి.
* గర్భిణులు హైహీల్స్‌ వేసుకోకపోవడమే మంచిది. పద్దెనిమిదేళ్ల కంటే తక్కువ ఉన్న వారు వీటికి దూరంగా ఉండాలి. అలాగని అసలు వేసుకోవద్దని కాదు. సందర్భాన్ని బట్టి ఎంచుకోవాలి. వీలైనంతవరకూ తక్కువ గంటలు వాటితో ఉండేలా చూసుకుంటే మంచిది.