Health

అమరావతిలో లాక్‌డౌన్-తాజావార్తలు

అమరావతిలో లాక్‌డౌన్-తాజావార్తలు

* మహారాష్ట్రలో కరోనా వైరస్‌ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం తీవ్రత ఉన్నచోట్ల ఇప్పటికే కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధిస్తోంది. ఈ నేపథ్యంలో అమరావతి జిల్లాతో పాటు పలు జిల్లాల్లో వారంపాటు పూర్తి లాక్‌డౌన్ విధిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఫిబ్రవరి 22 రాత్రి నుంచి మార్చి 1వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని వెల్లడించింది. ఇప్పటికే అమరావతి ప్రాంతంలో వారాంతం లాక్‌డౌన్‌ అమలులో ఉండగా, వైరస్‌ వ్యాప్తి అదుపులోకి రాకపోవడంతో పూర్తి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

* మరోసారి వివాహబంధంలోకి అడుగుపెట్టే ఆలోచన తనకు లేదని నటి సురేఖ వాణి స్పష్టం చేశారు. యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన సురేఖ తెలుగులో తెరకెక్కిన ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా, సురేఖ త్వరలోనే రెండో వివాహం చేసుకోనున్నారంటూ గత కొన్నిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆమె కుమార్తె సుప్రీత నిర్ణయం ప్రకారమే సురేఖ మరోసారి ఏడడుగుల వైపు మొగ్గు చూపుతున్నారని నెట్టింట్లో పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా తన పెళ్లి వార్తల గురించి నటి సురేఖ స్పందించారు. అవన్నీ అవాస్తవాలేనని.. తాను రెండో వివాహం చేసుకోవడం లేదని చెప్పారు. దాదాపు రెండేళ్ల క్రితం అనారోగ్యంతో సురేఖ భర్త కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇక, సినిమాల విషయానికి వస్తే ‘భద్ర’, ‘దుబాయ్‌ శీను’, ‘బృందావనం’, ‘శ్రీమంతుడు’, ‘బొమ్మరిల్లు’ చిత్రాలు సురేఖకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.

* గుంటూరు నుంచి నల్గొండ మీదుగా వెళ్లాల్సిన రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో ఇవాళ మధ్యాహ్నం 3గంటల నుంచి పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నిలిచిపోయాయి. నల్గొండ రైల్వే స్టేషన్‌ సమీపంలోని నార్కట్‌పల్లి వద్ద అండర్ పాస్‌ వంతెన పనులు జరుగుతుండడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఇవాళ సాయంత్రం నాలుగు గంటల్లోగా అండర్‌ పాస్‌ పనులు పూర్తి చేస్తామని చెప్పిన రైల్వే అధికారులు.. ఆ మార్గంలో రోజువారీగా రాకపోకలు సాగించే రైళ్లకు అనుమతిచ్చారు. అనుకున్న సమయానికి అండర్‌పాస్‌ పనులు పూర్తి కాకపోవడంతో గుంటూరు నుంచి నల్గొండ మీదుగా వెళ్లాల్సిన రైళ్లు నల్గొండ, జిల్లాలోని ఇతర స్టేషన్లో నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

* పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు తెరాస మరో అభ్యర్థిని ప్రకటించింది. హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ స్థానానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవిని తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. వాణీదేవి రేపు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే నల్గొండ-వరంగల్‌-ఖమ్మం స్థానానికి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ఖరారు చేసిన తెరాస.. తాజాగా హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌కు వాణీదేవిని ఎంపిక చేసింది. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానానికి చిన్నారెడ్డి, నల్గొండ-వరంగల్‌-ఖమ్మం స్థానానికి రాములు నాయక్‌ను ఖరారు చేసింది. ఇప్పటికే వారిద్దరూ నామినేషన్లు దాఖలు చేశారు.

* కుత్బుల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నేత కూన శ్రీశైలం గౌడ్‌ భాజపాలో చేరారు. దిల్లీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయనకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మేడ్చల్‌ డీసీసీ అధ్యక్ష పదవితో పాటు కాంగ్రెస్‌ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించిన కొద్దిసేపట్లోనే శ్రీశైలంగౌడ్‌ కమలతీర్థం పుచ్చుకున్నారు.

* బలపరీక్షకు ఒక రోజు ముందు పుదుచ్చేరి రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ కూటమికి షాకిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన లక్ష్మీనారాయణన్‌తో పాటు, డీఎంకేకు చెందిన ఎమ్మెల్యే వెంకటేశన్‌ తమ పదవులకు ఆదివారం రాజీనామాలు సమర్పించారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేల రాజీనామాతో మైనారిటీలో పడిన నారాయణస్వామి సర్కారును అసెంబ్లీలో సోమవారం బలపరీక్ష ఎదుర్కోవాల్సి ఉండగా.. ఈ పరిణామం చోటుచేసుకోవడంతో కాంగ్రెస్‌ మరింత ఇరకాటంలో పడింది.

* రాజకీయాలకు అతీతంగా పోరాడితేనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుని కాపాడుకోగలమని తెదేపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌ అన్నారు. విశాఖ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులంతా ఉమ్మడిగా రాజీనామా చేస్తే పోరాటతీవ్రత కేంద్ర ప్రభుత్వానికి అర్థం అవుతుందన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణకు సీఎం జగన్‌ ఏ తరహా ఉద్యమం చేయాలని సంకల్పించినా.. సహకరించేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు సిద్ధంగా ఉన్నారన్నారు. విశాఖ ఉక్కుపై రాష్ట్ర భాజపా నేతలు ద్వంద్వ వైఖరి విడిచిపెట్టి పరిశ్రమ పరిరక్షణ కోసం ప్రయత్నించాలని గంటా సూచించారు.

* తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల జరిగిన గ్రేటర్‌ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో మరికొందరు నాయకులు పార్టీని వీడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో మాజీ ఎమ్మెల్యే, మేడ్చల్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు కూన శ్రీశైలంగౌడ్‌ టచ్‌లో ఉన్నట్టు ప్రచారం జరిగింది. పార్టీని వీడవద్దని బుజ్జగించేందుకు కాంగ్రెస్‌ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం కూన శ్రీశైలంగౌడ్‌ భాజపాకు చెందిన నాయకులతో కలిసి దిల్లీ వెళ్లారు. శ్రీశైలం గౌడ్‌ ఇవాళ భాజపాలో చేరుతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

* చెదురుమదురు ఘటనల మినహా ఏపీలో తుది దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం 3.30గంటల వరకు కొనసాగింది. పోలింగ్‌ గడువు ముగిసే సమయానికి క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. తుది దశలో 3,299 పంచాయతీలకు నోటిఫికేషన్‌ ఇవ్వగా 554 సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. రెండు చోట్ల సర్పంచ్‌ స్థానాలకు, 91 వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో మిగిలిన 2,743 సర్పంచ్‌, 22,423 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. లెక్కింపు అనంతరం సర్పంచ్‌, వార్డు మెంబర్ల ఎన్నికను అధికారులు ప్రకటించనున్నారు. అనంతరం ఉప సర్పంచ్‌ ఎన్నిక చేపట్టనున్నారు.

* హైకోర్టు న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్యకేసులో సీబీఐ విచారణ జరిపించాలని భాజపా ఎమ్మెల్సీ రాంచంద్రరావు డిమాండ్‌ చేశారు. వామన్‌రావు దంపతుల కుటుంబాలను పరామర్శించేందుకు రాంచంద్రరావు ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌ సివిల్‌ కోర్టు న్యాయవాదులు దాదాపు 100 మంది బస్సులలో పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగ గ్రామానికి ఆదివారం ఉదయం బయల్దేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రాంచంద్రరావు మాట్లాడుతూ…న్యాయవాది దంపతుల హత్యకేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. నిందితులను పట్టుకోవడంలో తెలంగాణ పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. తెరాస నేతల అరాచకాలు శ్రుతి మించాయని ఆరోపించారు. న్యాయవాదుల కుటుంబానికి అండగా ఉంటూ, వారి హక్కులు కాపాడేందుకు భాజపా లీగల్‌ సెల్‌ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

* తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం సమ్మక్క-సారలమ్మ చిన్నజాతర నేపథ్యంలో ములుగు జిల్లాలోని మేడారానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. వారాంతం కావడంతో కుటుంబసమేతంగా అమ్మల చెంతకు వచ్చారు. తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా ఛత్తీస్‌గఢ్‌‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాలకు చెందిన భక్తులు ఆదివారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు. తొలుత జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు తలనీలాలు సమర్పించారు.

* డిసెంబరులో ఈపీఎఫ్‌ఓ పేరోల్‌లో కొత్తగా 12.54 లక్షల మంది నికర చందాదారులు చేరారు. వీరిలో 8.04 లక్షల మంది కొత్తవారు కాగా.. 4.5 లక్షల మంది ఈపీఎఫ్‌ఓ నుంచి వైదొలిగి తిరిగి చేరినవారు. 2019, డిసెంబరుతో పోలిస్తే సంఘటిత రంగంలో 24 శాతం వృద్ధి నమోదైంది. ఇక నవంబరుతో పోలిస్తే 44 శాతం చేరికలు పెరిగాయి. కొవిడ్-19 మహమ్మారి ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ నుంచి డిసెంబరు, 2020) 53.70 లక్షల మంది నికర చందాదారులు ఈపీఎఫ్‌ఓలో చేరారు.

* మహారాష్ట్రలో కరోనా వైరస్‌ మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. గత కొన్ని వారాలుగా రోజువారీ కేసుల సంఖ్య మరింత పెరుగుతోంది. ముంబయి, పుణె నగరాల్లో వైరస్‌ తీవ్రత ఎక్కువైంది. దీంతో పుణెలో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు జిల్లా అధికారులు ప్రకటించారు. పుణెలో నిన్న ఒక్కరోజు ఏకంగా 849 కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో అప్రమత్తమైన జిల్లా అధికారులు రాత్రిపూట 11గంటల నుంచి ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు.

* ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 31,680 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 88 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,89,298కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 7,167 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 72 మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,81,511కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 620 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,37,28,728 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.

* అమెరికాలో యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానానికి పెను ముప్పు తప్పింది. విమానం కుడి ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో డెన్వర్‌ విమానాశ్రయంలో అత్యవసరంగా దిగింది. విమానం ఎగురుతున్న సమయంలో కొన్ని శకలాలు కిందపడటం కలకలం రేపింది. లోహవిహంగం నుంచి పడిన శకలాలు కింద ఉన్న కొన్ని నివాసాల ముందు పడ్డాయి. ఇళ్లు, మనుషుల పైన శకలాలు పడకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విమానాశ్రయంలో విమానం సురక్షితంగానే దిగిందని, ప్రయాణికులకు ముప్పు తప్పిందని అధికారులు వెల్లడించారు. విమానం డెన్వర్‌ నుంచి హోనోలులుకు వెళుతుండగా ఇంజిన్‌ కాలిపోయినట్లు అధికారులు తెలిపారు. విమానం బయలుదేరిన కొద్దిసేపటికే భారీ కుదుపులకు గురి కాగా కేబిన్‌లో భారీ పేలుడు జరిగినట్లు పైలెట్‌ మైకులో ప్రకటించాడు. పొగలు కక్కుతూ తక్కువ ఎత్తులో ఎగిరిన ఈ విమానం తిరిగి డెన్వర్‌ విమానాశ్రయంలో దిగింది. ఇది కుదుపులకు గురైనప్పుడు ప్రాణాలతో బయటపడతామని తాము అనుకోలేదని ప్రయాణికులు పేర్కొన్నారు. ఈ విమానం ప్రమాదానికి గురైన సమయంలో దానిలో 231 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది ఉన్నారు.