Fashion

మీ ఇంట్లోనే కేశాలకు సీరం తయారు చేసుకోవచ్చు

Here is how you can make your own hair serum at home-మీ ఇంట్లోనే కేశాలకు సీరం తయారు చేసుకోవచ్చు

జుట్టు ఆరోగ్యంగా, చిక్కుల్లేకుండా ఉండాలంటే… నిపుణులు సీరమ్‌ సూచిస్తారు. కానీ అలాంటి సీరమ్‌ను ఇంట్లో సహజ పదార్థాలతో తయారు చేసుకోవచ్చు. ఎలాగంటే…

కాఫీ తేనెతో: నాలుగు పెద్ద చెంచాల కాఫీపొడిని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అందులో రెండు పెద్ద చెంచాల తేనె, నాలుగు పెద్ద చెంచాల వేడినీరు పోసి బాగా కలపాలి. జుట్టును తడిచేసుకుని ఈ మిశ్రమాన్ని పట్టించాలి. ఇరవై నిమిషాల తరువాత షాంపూతో కడిగేయాలి. కాఫీ జుట్టును దృఢంగా మారుస్తుంది. రంగు కూడా ఇస్తుంది. తేనె మెరిసేలా చేసి, జుట్టును తేమగా ఉంచుతుంది.

కలబంద, కొబ్బరినూనెతో: అరకప్పు కొబ్బరినూనెలో గుప్పెడు గోరింటాకు వేసి పొయ్యిమీద పెట్టాలి. నూనె మరిగి, రంగు మారాక తీసేయాలి. తరువాత వడకట్టి, చల్లారనివ్వాలి. అందులో నాలుగు పెద్ద చెంచాల కలబంద గుజ్జు, మూడు పెద్ద చెంచాల జోజోబా నూనె, నాలుగైదు చుక్కల చొప్పున విటమిన్‌ ఈ నూనె, లావెండర్‌ నూనె కలపాలి. సీరమ్‌ సిద్ధమైనట్లే. దీన్ని సీసాలోకి తీసుకుని భద్రపరచుకోవాలి. తలస్నానం చేశాక దీన్ని చాలా కొద్దిగా రాసుకుంటే చాలు.

సోయానూనెతో: రెండు పెద్ద చెంచాల చొప్పున సోయా నూనె, కొబ్బరినూనె, ఆలివ్‌నూనె, జోజోబానూనె తీసుకోవాలి. అన్నింటినీ కలిపి సీసాలోకి తీసుకోవాలి. గోరువెచ్చగా చేసుకుని తలకు రాసి, మర్దన చేయాలి. ఇరవైనిమిషాలయ్యాక కడిగేయాలి. జుట్టు పట్టులా మెరుస్తుంది.