Movies

సహజీవనానికి నేను వ్యతిరేకం

Digangana Says She Is Against Living In Relationship

‘‘చేసిన పాత్రల పేర్లతో పిలిచినప్పుడు కలిగే ఆనందమే వేరు’’ అంటోంది కథా నాయిక దిగంగన. గురువారం విడుదలైన ‘హిప్పీ’తో తెలుగు తెరకు పరిచయమైన కథానాయిక ఈమె. చిత్రంలో ఆముక్త మాల్యద అనే అమ్మాయిగా కనిపించింది. అందంతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. హిందీలో పలు ధారావాహికల్లో మెరిసిందీమె. ‘హిప్పీ’ చిత్రానికీ, అందులో తన నటనకీ వస్తున్న స్పందన పట్ల ఆనందం వ్యక్తం చేస్తోంది దిగంగన. శుక్రవారం ఆమె హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది. ఆ విషయాలివీ…‘‘తెలుగులో నటించడం మంచి అనుభూతినిచ్చింది. తెలుగులో తొలి సినిమా ‘హిప్పీ’ ఎప్పటికీ గుర్తుంటుంది. దర్శకుడు నాతో సంభాషణలు పలికించాకే ఆముక్త మాల్యద పాత్ర కోసం ఎంపిక చేశారు. తెలుగు సంభాషణల్ని హిందీలో రాసుకొని పలికా. కథానాయకుడు కార్తికేయని అడిగి అర్థాలు తెలుసుకొనేదాన్ని. అందంగా కనిపించడంతో పాటు.. పతాక సన్నివేశాల్లో అభినయం కూడా ప్రదర్శించే అవకాశం దక్కింది’’. ‘‘నిజ జీవితంలో నేను స్వతంత్ర భావాలు కలిగిన అమ్మాయిని. తెరపై ఆముక్త పాత్రకీ, నాకూ చాలా వ్యత్యాసం ఉంది. నిజ జీవితంలో ఎప్పుడూ ప్రేమలో పడలేదు. సహజీవనానికి కూడా నేను వ్యతిరేకం. చేసే ప్రతి పాత్ర కూడా నేను మా అమ్మానాన్నలతో కలిసి చూసేలా ఉండాలనుకొంటా. హిందీలో ‘బిగ్‌ బాస్‌ 9’ షోలో పాల్గొని పదిహేడేళ్ల వయసులోనే గుర్తింపు తెచ్చుకొన్నా. పలు ధారావాహికలతో కూడా మంచి పేరు సంపాదించా. నటనతో పాటు… కథలు రాయడం, పాటలు పాడటం నాకిష్టం. ‘పవర్‌ ఆఫ్‌ లవ్‌’ అనే ఓ పుస్తకం రాశా. అది మంచి ఆదరణ పొందింది. హిందీలో మూడు చిత్రాలు చేశా. తెలుగు సినిమాలు తరచుగా చూస్తుంటా. మహేష్‌బాబు, అల్లు అర్జున్‌ సినిమాలు తప్పకుండా చూస్తుంటా. ‘బాహుబలి’ చిత్రాల్ని చాలా సార్లు చూశాను. తెలుగు తొందరగానే నేర్చుకుంటా. తెలుగు నుంచే కాకుండా, దక్షిణాదిలోని ఇతర భాషల నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి’’.