Business

స్టాక్స్‌ మార్కెట్లలో తెలుగువారి హవా.. – TNI వాణిజ్య వార్తలు

స్టాక్స్‌ మార్కెట్లలో తెలుగువారి హవా..  – TNI వాణిజ్య వార్తలు

* మదుపు కోసం స్టాక్‌ మార్కెట్ల తలుపుతట్టడంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో ఉంది. దేశ సగటు కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా స్టాక్‌ మార్కెట్‌లో ఖాతాలు ఉన్నట్లు స్టాట్స్‌ ఆఫ్‌ ఇండియా తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జనాభాలో 8.8 శాతం మంది బొంబే స్టాక్‌ ఎక్సే్ఛంజీ(బీఎస్‌ఈ)లో మదుపుదారుగా నమోదయి ఉన్నట్లు నివేదిక పేర్కొంది.అంటే ప్రతీ 100 మందిలో 8.8 శాతం మంది బీఎస్‌ఈ ద్వారా స్టాక్‌ మార్కెట్లో మదుపు చేస్తున్నారు. ఇదే సమయంలో తెలంగాణాలో 8.2 శాతం, కర్నాటకలో 8.7 శాతం, తమిళనాడులో 7.0 శాతం, పుదిచ్చేరిలో 6 శాతం ఉండగా కేరళలో 7 శాతంగా ఉంది. అంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రా నుంచే అత్యధికంగా స్టాక్‌ మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. దేశం మొత్తం మీద చూస్తే 7.4 శాతం మంది మాత్రమే స్టాక్‌ మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేస్తుండగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి మాత్రం 8.8 శాతం మంది ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. అయితే ఢిల్లీ 23.6 శాతంతో దేశంలో మొదటి స్థానంలో ఉండగా, మహారాష్ట్ర 16.6 శాతం, గుజరాత్‌ 15.5 శాతంతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
దేశవ్యాప్తంగా బీఎస్‌ఈలో ఇన్వెస్టర్ల సంఖ్య ఈ మార్చి నాటికి 10 కోట్ల మార్కును అధిగమించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ నుంచి 47 లక్షల మంది స్టాక్‌ మార్కెట్లో ఖాతాలను కలిగి ఉన్నట్లు స్టాట్స్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది. దేశం మొత్తం మీద 10 కోట్ల మంది ఖాతాలు కలిగి ఉన్నా అందులో 50 శాతం మంది అయిదు రాష్ట్రాల నుంచే ఉండటం గమనార్హం. ఇందులో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 2.07 కోట్ల ఖాతాలు ఉండగా, ఆ తర్వాత గుజరాత్‌ 1.09 కోట్లు, ఉత్తరప్రదేశ్‌ 86 లక్షలు, కర్నాటక 58 లక్షలు, రాజస్థాన్‌ 56 లక్షలుగా ఉన్నాయి. ఖాతాల సంఖ్య పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తొమ్మిదో స్థానంలో ఉంటే, 31 లక్షల ఖాతాలతో తెలంగాణ 12వ స్థానంలో ఉన్నట్లు ఆ నివేదిక పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు స్టాక్‌ మార్కెట్లో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సాధారణంగా స్టాక్‌ మార్కెట్లు వేగంగా పెరుగుతున్న తరుణంలో ఇన్వెస్టర్లు పెట్టుబడి చేసి చేతులు కాల్చుకుంటూ ఉంటారు. ప్రస్తుతం దేశీయ స్టాక్‌ మార్కెట్లు పరుగులు పెడుతున్న తరుణంలో గత 12 నెలల కాలంలో స్టాక్‌ మార్కెట్లో ఖాతాల సంఖ్య భారీగా పెరుగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో ఈ సంఖ్య ఏకంగా రెట్టింపు నమోదవ్వగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కొత్త ఖాతాల పెరుగుదల్లో ఆంధ్రప్రదేశ్‌ ఆచూతూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. 10 కోట్ల ఖాతాల సంఖ్యలో గత 12న నెలల్లోనే 3.6 కోట్ల ఖాతాలు కొత్తగా వచ్చిచేరాయి. ఈ పెరుగుదల అస్సాంలో 283 శాతంగా ఉంటే బీహార్‌ 116 శాతం, మధ్యప్రదేశ్‌109 శాతం, ఒరిస్సా 106 శాతం, తెలంగాణ 79 శాతంగా ఉంది. కానీ ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో ఖాతాల పెరుగుదల 40 శాతానికే పరిమితమయ్యింది.
*అవాంఛనీయ వ్యాపార విధానాలు అనుసరిస్తున్నాయన్న ఆరోపణలపై జొమాటో, స్విగ్గీలపై సవివరమైన విచారణకు సీసీఐ ఆదేశించింది. నేషనల్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) దాఖలు చేసిన ఫిర్యాదును స్వీకరించిన సీసీఐ ఈ చర్య తీసుకుంది. ఆ కంపెనీల వ్యాపార ధోరణుల్లో ప్రయోజన వైరుధ్యం ఉన్నట్టు ప్రాథమిక ఆధారాలున్నాయని సీసీఐ తెలిపింది.
*వాక్సిన్లు కొనుగోలు చేసి సరఫరా చేస్తున్న ఐక్యరాజ్యసమితికి చెందిన ఏ ఏజెన్సీకి ‘కొవాక్సిన్‌’ను సరఫరా చేయడం లేదని, అందువల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నిర్ణయ ప్రభావం కంపెనీపై ఏ మాత్రం ఉండదని భారత్‌ బయోటెక్‌ వర్గాలు తెలిపాయి. యూఎన్‌ ఏజెన్సీలు కొనుగోలు చేసి సరఫరా చేస్తున్న కొవాక్సిన్‌పై రెండు రోజుల క్రితం డబ్ల్యూహెచ్‌ఓ నిషేధం విధించింది.ఈ నేపథ్యంలో భారత్‌ బయోటెక్‌ స్పందించింది. కొవాక్సిన్‌ను తయారు చేస్తున్న యూనిట్లను నవీకరించేందుకు, యూనిట్ల తనిఖీల్లో బయటపడిన లోపాలను కంపెనీ సవరించుకునేందుకు వీలుగా ఈ నిషేధం విధిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది.
*ఇన్‌సెక్టిసైడ్స్‌ ఇండియా రెండు కొత్త పురుగు మందులను అందుబాటులోకి తీసుకువచ్చింది. వివిధ పంటల్లో వచ్చే తామర పురుగు నివారణకు జపాన్‌ కంపెనీ నిస్సాన్‌ కెమికల్స్‌కు చెందిన సరికొత్త క్రిమి సంహారిణి షిన్వా ను దేశీయ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. నిస్సాన్‌తో కలిసి అభివృద్ధి చేసిన ఫంగిసైడ్‌ ‘ఇజుకీ’ని కూడా విడుదల చేసినట్లు ఇన్‌సెక్టిసైడ్స్‌ ఎండీ రాజేశ్‌ అగర్వాల్‌ తెలిపారు. అగ్గి తెగులు, పాము పొడ తెగులు వంటి వాటిపై ఇది పని చేస్తుంది.
*టెస్లా సీఈఓ ఇలాన్‌ మస్క్‌, ట్విట్టర్‌లో 9.2 శాతం ఈక్విటీ వాటా తీసుకున్నారు. ఇందుకోసం ఆయన ఓపెన్‌ మార్కెట్‌ నుంచి 7.35 కోట్ల ట్విట్టర్‌ షేర్లు కొనుగోలు చేశారు. దీర్ఘకాలిక పెట్టుబడి లాభాల కోసం మస్క్‌ ఈ షేర్లు కొన్నట్టు సమాచారం. దీంతో ట్విట్టర్‌ షేర్లకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. సోమవారం మార్కెట్‌ ప్రారంభానికి ముందే ట్విట్టర్‌ షేర్లు 26 శాతం లాభాలతో ట్రేడయ్యాయి. భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు సమస్యలు ఏర్పడుతున్నాయని మస్క్‌ కొద్ది రోజుల క్రితమే ట్వీట్‌ చేశా రు. ఇది జరిగిన కొద్ది రోజులకే టెస్లా సీఈఓ మస్క్‌ సోషల్‌ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ ఈక్విటీలో 9.2 శాతం వాటా కొనుగోలు చేయడం విశేషం
*ఇన్‌సెక్టిసైడ్స్‌ ఇండియా రెండు కొత్త పురుగు మందులను అందుబాటులోకి తీసుకువచ్చింది. వివిధ పంటల్లో వచ్చే తామర పురుగు నివారణకు జపాన్‌ కంపెనీ నిస్సాన్‌ కెమికల్స్‌కు చెందిన సరికొత్త క్రిమి సంహారిణి షిన్వా ను దేశీయ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. నిస్సాన్‌తో కలిసి అభివృద్ధి చేసిన ఫంగిసైడ్‌ ‘ఇజుకీ’ని కూడా విడుదల చేసినట్లు ఇన్‌సెక్టిసైడ్స్‌ ఎండీ రాజేశ్‌ అగర్వాల్‌ తెలిపారు. అగ్గి తెగులు, పాము పొడ తెగులు వంటి వాటిపై ఇది పని చేస్తుంది.
*వాటాదారుల పర్యావరణ వ్యవస్థకు మద్దతుగా ఫ్లిప్‌కార్ట్ ‘ఫౌండేషన్’ ప్రారంభమైంది. వ్యవస్థాపకత, జీవనోపాధి, స్థిరమైన వృద్ధి అవకాశాల కోసం సమాజంలోని అట్టడుగు, స్వల్ప ప్రాతినిధ్యమున్న వర్గాలకు మార్కెట్ యాక్సెస్‌పై దృష్టి సారించడం ఈ ఫౌండేషన్ లక్ష్యం. వివరాల్లోకి వెళితే… దేశంలోని ప్రముఖ ఇ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్… విభిన్న వాటాదారుల పర్యావరణ వ్యవస్థకు మద్దతునిచ్చే లక్ష్యంతో ఫ్లిప్‌కార్ట్ ఫౌండేషన్‌ను ప్రారంభమైంది. ప్రభుత్వ సంస్థలు, ఎన్‌జీఓలు, కమ్యూనిటీ లీడర్‌లలో విభిన్న వాటాదారులతో సహకరించడం ద్వారా ఫౌండేషన్ పరివర్తన పనిని నడిపిస్తుందని బెంగళూరుకు చెందిన గ్రూప్ ఈ రోజు(సోమవారం) వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాలపై దృష్టి సారించడం, మహిళలు, ఇతరత్రా వెనుకబడిన వర్గాలకు వృద్ధి అవకాశాలకు సంబంధించి చేయూతనివ్వడం ద్వారా… ఫ్లిప్‌కార్ట్ ఫౌండేషన్… రానున్న దశాబ్ద కాలంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 మిలియన్ల జీవితాలను సానుకూలంగా ప్రభావితం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది
*మార్చితో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరం భారత ఎగుమతిదారులకు బాగా కలిసొచ్చింది. ఈ కాలంలో మన దేశం నుంచి ఎగుమతులు రికార్డు స్థాయిలో 41,800 కోట్ల డాలర్లకు (సుమారు రూ.31.55 లక్షల కోట్లు) చేరాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన 40,000 కోట్ల డాలర్ల కంటే ఇది 1,800 కోట్ల డాలర్లు ఎక్కువ. కంపెనీలు, పారిశ్రామిక సంఘాలు, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఎగుమతులను టాప్‌గేర్‌లో ఉంచాయి. పెట్రోలియం ఉత్పత్తులు, ఇంజనీరింగ్‌ వస్తువులు, జెమ్స్‌ అండ్‌ జువెలరీ, రసాయనాలు, ఫార్మా ఎగుమతులు భారీగా పెరగడం 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల జోరుకు బాగా కలిసొచ్చింది. అమెరికా, యూఏఈ, చైనా, బంగ్లాదేశ్‌, నెదర్లాండ్‌.. భారత్‌ నుంచి వస్తువుల దిగుమతి చేసుకోవడంలో టాప్‌-5 జాబితాలో ఉన్నాయి. ఆత్మనిర్భర్‌ భారత్‌ ప్రయాణంలో ఇదో కీలక మలుపని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. కాగా ఇదే కాలంలో భారత దిగుమతులు కూడా రికార్డు స్థాయిలో 61,000 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి.
*మార్చితో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాబడుల విషయంలో చిన్న కంపెనీల షేర్లు (స్మాల్‌క్యాప్‌) పెద్ద, మిడ్‌క్యాప్‌ షేర్లను మించి పోయాయి. ఈ కాలంలో బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ సూచీ షేర్లు మదుపరులకు సగటున 36.64 శాతం లాభాలు పంచాయి. ఇదే సమయంలో మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ షేర్లు 19.45 శాతం, లార్జ్‌క్యాప్‌ షేర్లకు ప్రాతినిధ్యం వహించే సెన్సెక్స్‌ షేర్లు సగటున 18.29 శాతం లాభాలు పంచాయి. కొవిడ్‌, అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలోనూ స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ షేర్లు మంచి లాభాలు పంచడం విశేషం. ఈ నెలలో కూడా మార్కెట్లో స్మాల్‌ క్యాప్‌ షేర్ల ఇండెక్స్‌ ర్యాలీ కొనసాగుతుందని మార్కెట్‌ వర్గాల అంచనా.