Movies

సినిమాకు భావోద్వేగాలే ముఖ్యం!

సినిమాకు భావోద్వేగాలే ముఖ్యం!

కొన్నేళ్లుగా బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద దక్షిణాది చిత్రాలు మంచి విజయాలు సాధిస్తున్నాయి. బాహుబలి రెండు భాగాల చిత్రాలు, పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్‌, కేజీఎఫ్‌ 1, 2 ఇవన్నీ ఉత్తరాది బాక్సాఫీస్‌ వద్ద రికార్డ్స్‌ క్రియేట్‌ చేశాయి. ఈ విజయాలతో సౌత్‌ సినిమాలు అక్కడి తారల ప్రశంసలు పొందుతున్నాయి. తాజాగా రవీనా టాండన్‌ కూడా దక్షిణాది చిత్రాలను మెచ్చుకుంది. ‘కేజీఎఫ్‌ 2’ చిత్రంలో ప్రధాని రమీకా సేన్‌ పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఆమె దక్షిణాది చిత్రాల్లో నటించడం ఇది కొత్త కాదు. దశాబ్దాల కిందటే తెలుగు, కన్నడ చిత్రాల్లో నాయికగా నటించింది రవీనా. ఈ అనుభవంతో ఆమె దక్షిణాది చిత్రాలకు, హిందీ సినిమాలకు తేడాను విశ్లేషించింది. స్థానికతను మర్చిపోకపోవడమే సౌత్‌ సినిమా విజయాలకు కారణమందీ హీరోయిన్‌.నేల విడిచి సాము చేయడం వల్లే బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ పోరులో వెనకబడిందని చెప్పింది. ఈ ఏడాది మొదట్లో ‘అరణ్యక్‌’ అనే వెబ్‌ సిరీస్‌ లో నటించి విజయాన్ని అందుకున్న రవీనా. ఇప్పుడు ‘కేజీఎఫ్‌ 2’ లో భాగమైంది. హిందీ సినిమా విషయంలో ఇలాంటి ఘన విజయాలను ఎందుకు చూడలేకపోతున్నామని అడిగితే రవీనా స్పందిస్తూ…‘సౌత్‌ సినిమాతో నాకు సుదీర్ఘ అనుభవం ఉంది. వాళ్లు తమ స్థానికతను మర్చిపోరు. అలాగే వాళ్ల సంసృతీ సంప్రదాయాలు, మూలాలను విడిచిపెట్టరు. వీటితో పాటు సినిమా కథల్లో భావోద్వేగాలు ఉండేలా చూసుకుంటారు. అందుకే ఆ ఎమోషన్స్‌ను దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు ఆస్వాదిస్తున్నారు. భావోద్వేగాలే సినిమాకు ముఖ్యమనే విషయం బాలీవుడ్‌ మర్చిపోతున్నది. హిందీ సినిమా ఎప్పుడూ హాలీవుడ్‌ ను అనుకరించేందుకు ప్రయత్నిస్తూ విఫలమవుతున్నది’ అని చెప్పింది.