Business

నాలుగు శాతం మేర తగ్గిన మారుతీ లాభాలు

maruti india loses revenue

దేశీయ ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా(ఎంఎస్‌ఐ) 2018-19 ఆర్థిక సంవత్సరంలోని నాలుగో త్రైమాసికంలో(జనవరి-మార్చి) నికర లాభాలు 4.6 శాతం మేర తగ్గి రూ. 1,795.6 కోట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం(2017-18) ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ. 1,882.1 కోట్లుగా ఉందని మారుతీ సుజుకీ ఇండియా ఒక ప్రకటనలో వెల్లడించింది. 2018-19 నాలుగో త్రైమాసికంలో నికర అమ్మకాలు మాత్రం గత ఏడాదితో పోలిస్తే స్వల్పంగా పెరిగి రూ. 20,737.5 కోట్లుగా నమోదైనట్లు ఎంఎస్‌ఐ ప్రకటించింది. ఇదే త్రైమాసికంలో కార్ల అమ్మకాలు కూడా కొంతమేరకు తగ్గి 4,58,479 యూనిట్లను విక్రయించామని సంస్థ పేర్కొంది. అదే సమయంలో నికర అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 6.3 శాతం వృద్ధిని నమోదు చేసి రూ. 83,026.5 కోట్లకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరం(2018-19)లో 4.7 శాతం వృద్ధి నమోదు చేసి 18,62,449 యూనిట్లను విక్రయించగా, 1,08,749 యూనిట్లను ఎగుమతి చేసినట్లు సంస్థ ప్రకటించింది. అధికంగా ఉన్న ఫారిన్‌ ఎక్స్ఛేంజ్‌ రేట్లు, కమోడిటీ ధరలు, సేల్స్‌ ప్రమోషన్‌ ఖర్చులు.. తదితర కారణాలతో నికర లాభాలు స్వల్పంగా తగ్గినట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. మరోవైపు నికర లాభాలు తగ్గినప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరానికిగాను మారుతీ సుజుకీ ఇండియా ఒక్కో షేర్‌కు రూ. 80 చొప్పున డివిడెండ్‌ ప్రకటించడం గమనార్హం.