Politics

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సన్నాహాలు

andhra pradesh may get new districts

పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చెయ్యాలనే ప్రతిపాదనలు ఏడాది నుంచీ ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 14న తెలంగాణలో మరో రెండు కొత్త జిల్లాలు (నారాయణ పేట, ములుగు) ఏర్పడటంతో… ఆ రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 33కు పెరిగింది. ఏపీలో మాత్రం ఎప్పట్లాగే 13 జిల్లాలే ఉన్నాయి. నవ్యాంధ్రకు తొలి సీఎం అయిన చంద్రబాబు… అధికారంలోకి వచ్చాక… జిల్లాల విభజన కంటే… పరిపాలన పైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఐతే… వైసీపీ అధికారంలోకి వస్తే… కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతుందని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించడంతో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అదే రూట్‌లో వెళ్లారు. తిరిగి అధికారంలోకి రాగానే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో హామీలు ఇచ్చారు. ఇప్పుడు కొత్త విషయమేంటంటే… ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా… ముందు జిల్లాల విభజన జరిగిపోవాలనే అంశంపై తెరవెనక మంతనాలు జోరందుకున్నాయి. ఎన్నికల ఫలితాలు రావడానికి ఇంకా 22 రోజుల టైం ఉంది. ఈ లోపే… జిల్లాల విభజనపై ఓ ప్రముఖ రాజకీయ పార్టీ పావులు కదుపుతున్నట్లు తెలిసింది. ఆ పార్టీకి అండగా నిలుస్తున్న ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఈ పనిలో నిమగ్నమైనట్లు సమాచారం అందుతోంది.ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఎన్ని జిల్లాలు పెంచవచ్చు, వాటికి జిల్లా కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చెయ్యాలి అనే విషయంపై ఆ ఇద్దరు అధికారులూ… సీక్రెట్ సర్వే చేస్తున్నట్లు తెలిసింది. ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీ అధికారంలోకి వస్తే… కన్‌ఫ్యూజన్ లేకుండా ఉండేందుకు ముందుగా జిల్లాల విభజన సంగతి చూడాలని భావిస్తున్నట్లు తెలిసింది. జిల్లాల విభజన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల్ని జరిపించాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. అలాకాకుండా ముందే స్థానిక సంస్థల ఎన్నికల్ని జరిపితే… జిల్లాల్ని పెంచేందుకు మళ్లీ ఐదేళ్లపాటూ వెయిట్ చెయ్యాల్సి ఉంటుందని రాజకీయ నిపుణులు చెప్పడంతో… ఈ గందరగోళం ఎందుకనుకుంటున్న ఆ పార్టీ ముందే విభజన ప్రక్రియను పూర్తి చేయాలనుకుంటున్నట్లు తెలిసింది. తెలంగాణ భూభాగం 33 జిల్లాలైనప్పుడు… ఆంధ్రప్రదేశ్ మాత్రం అన్ని జిల్లాలు ఎందుకు కాకూడదన్న ఉద్దేశంతో ఉన్న ఆ IAS అధికారులు… కొత్తగా 17 జిల్లాల్ని ఏర్పాటు చేసి… మొత్తం జిల్లాల సంఖ్యను 30గా రౌండప్ చెయ్యాలనుకుంటున్నట్లు తెలిసింది. ఐతే ఇందుకు కేంద్రం నుంచీ సానుకూల సంకేతాలు లేవు. తిరిగి బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం గనక కేంద్రంలో అధికారంలోకి వస్తే, కొత్త జిల్లాల ఏర్పాటుకు అంగీకరించకపోవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే… 2026లో నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సి ఉన్నందున ఆ టైంలో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని మోడీ భావిస్తున్నారు.ఒకవేళ కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తే… కొత్త జిల్లాల ఏర్పాటు జరిగే అవకాశాలున్నాయి. అలా కాకుండా… కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తే… కొత్త జిల్లాల ఏర్పాటు వాయిదా పడే అవకాశాలున్నాయి. అలాకాకుండా కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం, ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తే కూడా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం, ఏపీలో టీడీపీ ప్రభుత్వం వస్తే, కొత్త జిల్లాల ఏర్పాటు జరిగే అవకాశాలుంటాయి. ఇలా రాజకీయ అంశాల ప్రభావం కొత్త జిల్లాల ఏర్పాటుపై కనిపించబోతోంది.