Devotional

సుప్రీంలో…మరోసారి వాయిదా పడిన అయోధ్య కేసు

Ayodhya Case Adjourned In Supreme Court Of India

అయోధ్యలో రామమందిరం–బాబ్రీ మసీదు భూవివాదానికి సంబంధించిన కేసు విచారణలో మరో వాయిదా పడింది. అదనపు సమయం కావాలంటూ మధ్యవర్తుల కమిటీ చైర్మెన్ సుప్రీంకోర్టును అడిగారు. దీంతో మధ్యవర్తిత్వపు ప్రక్రియ పూర్తి చేయడానికి ఆగస్టు 15 వరకు ధర్మాసనం సమయమిచ్చింది. అలాగే మధ్యవర్తుల కమిటీ సేకరించిన అభిప్రాయాలు, ప్రక్రియలో పురోగతి, ఇతర అంశాలు ఈ సందర్భంలో వెల్లడించడం సరికాదని చీఫ్ జస్టిస్ గొగొయ్ తెలిపారు. అయోధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు.. సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్‌ను నియమించిన సంగతి తెలిసిందే. ఆధ్యాత్మిక గురువు రవిశంకర్‌, లాయర్ శ్రీరామ్‌ పంచు, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్‌ ఖలీపుల్లాలను మధ్యవర్తులుగా నియమించింది. ఈ మధ్యవర్తిత్వ కమిటీ సీల్డ్ కవర్‌లో తమ తాత్కాలిక నివేదికను సుప్రీంకోర్టుకు ఇచ్చింది. రాజకీయంగా అత్యంత సున్నితమైన అంశం కావడంతో…నివేదికలో అంశాలు బహిర్గతం కాలేదు. ఈ నెల 6న సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో ఈ తాత్కాలిక నివేదిక నమోదైంది. నాలుగు రోజుల కిందటే రిపోర్టు వచ్చినా…ఇతర కేసుల వల్ల సుప్రీంకోర్టు ఇవాళ సమీక్ష జరపాలని నిర్ణయించింది.