Fashion

దుపట్టాల్లో కూడా ఫ్యాషన్ ఉంది

Indian dupatta fashion tips and types-tnilive fashion

దుపట్టా… ఒకప్పటితో పోలిస్తే దీనికంటూ ప్రత్యేక గుర్తింపు ఉందిప్పుడు. దుస్తులతో పోటీపడుతూ… భిన్నమైన వస్త్రాల్లో వైవిధ్యమైన డిజైన్లలో మెప్పిస్తోంది. అసలు ఏ దుస్తులమీదకు ఎలాంటివి నప్పుతాయి… ఎంత భిన్నంగా వేసుకోవచ్చో చూద్దామా. కేవలం కుర్తా, లెహెంగా, షరారా మీదకే కాదు.. చీరలపైనా దుపట్టా వేసుకునే రోజులివి. అందుకే జాగ్రత్తగా ఎంచుకోవాలి. వస్త్రంతోపాటు డిజైను కూడా సందర్భానుసారంగా ఎంచుకుంటేనే అందం. ముఖ్యంగా ఎలాంటి డిజైన్లంటే…

ఫుల్కారీ: ఇది చూడ్డానికి వర్ణరంజితంగా ఉంటుంది. ప్రకాశవంతమైన రంగులు, పంజాబీ సంప్రదాయ పూల పనితనం ఉట్టిపడే ఎంబ్రాయిడరీ దీనిపై ఎక్కువగా కనిపిస్తుంది. ఈ తరహా దుపట్టా పెళ్లిళ్లు, పండగలకు బాగుంటుంది.
బెనారస్‌: సిల్కు వస్త్రంపై జరీ పనితనంతో ఆకట్టుకుంటుందీ దుపట్టా. ఒక్కమాటలో చెప్పాలంటే చీరలా కనిపిస్తుంది. ఇది లెహెంగాలు, నేలవరకూ తాకే అనార్కలీలు, పొడవాటి కుర్తాల మీదకు బాగుంటుంది. ప్రత్యేక సందర్భాలకు అనువైన ఎంపిక. సాదాగా ఉన్న డ్రెస్‌ మీదకు దీన్ని ఎంచుకుంటే చాలు.
నెట్‌: నేసిన కుర్తాలు, లెహెంగాల మీదకు ఇది సరైన ఎంపిక. అలాగే ధోతీప్యాంట్లు, నేలవరకూ తాకే అనార్కలీ మీదకు ఎంచుకోవచ్చు.
కలంకారీ: కేవలం సంప్రదాయ దుస్తుల మీదకే కాదు.. జీన్స్‌, చిన్న కుర్తాలు వేసుకున్నప్పుడు దీన్ని వాడొచ్చు.
షిఫాన్‌, జార్జెట్‌: రోజువారీ వేసుకునేందుకు అనువుగా ఉంటాయివి. ఇప్పుడు వీటిల్లోనూ కొత్త డిజైన్లు కనికట్టు చేస్తున్నాయి. సాయంత్రపు పార్టీలకు బాగుంటాయి.
చందేరీ: ఈ దుపట్టా చూడ్డానికి ఆడంబరంగా, హుందాగా ఉంటుంది. ఏ దుస్తుల మీదకు అయినా అదిరిపోతుంది.
వెల్వెట్‌: వాతావరణం చల్లగా ఉన్నప్పుడు దీన్ని ఎంచుకుంటే చాలు. ఈ దుపట్టా కేవలం సల్వార్లకే కాదు, చీరలమీదా వేసుకోవచ్చు. జర్దోసీ, అద్దాలు, స్టోన్‌వర్క్‌… ఇలా ఈ దుపట్టాలో చాలా ప్రత్యేకతలే కనిపిస్తాయి.
ఇకత్‌: పలాజో, చిన్న కుర్తా వేసుకున్నప్పుడు ఈ డిజైను ఉన్న దుపట్టా ఎంచుకుంటే చాలు.
పాంపాంలతో: ఇప్పుడు ఇదే ట్రెండ్‌. కాటన్‌ దుపట్టాల అంచుల్లో పాంపాంలు వేలాడుతూ ఆకట్టుకునేలా కనిపిస్తాయి. జీన్స్‌, చిన్న కుర్తాలమీదకు బాగుంటుందిది.
ఇవనే కాదు.. మధుబని పనితనం, కాంతవర్క్‌, జర్దోసీ, అద్దాలు… ఇలా భిన్నమైనవి ఇప్పుడు కనిపిస్తున్నాయి.

*** దుపట్టాలు వేసుకోవడం కూడా కళే. ఎలాగంటే…
ఎల్బో స్టైల్‌: లెహెంగాలు ఎంచుకుంటున్నారా… దుపట్టాను వెనుక నుంచి తీసుకొచ్చి.. మోచేతుల మీదుగా ముందుకు వేసుకోవాలి. మహారాణి లుక్‌ వస్తుంది.
వన్‌ ఆర్మ్‌: భారీ పనితనం ఉన్న మెరిసే దుపట్టా ఎంచుకుంటున్నప్పుడు ఒక భుజంమీదనుంచి తీసుకుని మరో చేతిమీద వేసుకోవాలి. సల్వార్‌సూట్లు లెహెంగాలమీదకు బాగుంటుందీ స్టైల్‌. అయితే అంచులు ఆకట్టుకునేలా ఉండాలి.
వన్‌సైడెడ్‌ షోల్డర్‌: ఒక వైపు వేసుకుని… కాస్త వెడల్పుగా చేసుకుని పిన్ను పెట్టుకుంటే చాలు. ఫుల్కారీ, కలంకారీ, బాందినీ, బెనారస్‌ దుపట్టాలు వేసుకుంటున్నప్పుడు ఇలా ప్రయత్నించొచ్చు.
టూ సైడెడ్‌: ఒక వైపు స్టెప్స్‌ తరహాలో పెట్టుకుని మరోవైపు జాలువారేలా వదిలేయాలి. లెహెంగాలమీదకు బాగుంటుందిది.