Kids

మీ పిల్లలు బడి అంటే భయపడుతున్నారా?

Is your kid scared to go to school? Here are some tips.

ఇష్టమైనవి తింటూ, నచ్చినప్పుడు నిద్రపోతూ… వేసవిని వెన్నెలగా మార్చుకుని ఆడేసుకున్న చిచ్చర పిడుగుల స్వేచ్ఛకు ఇకపై కళ్లెం పడనుంది. కారణం త్వరలో పాఠశాలలు తెరవడమే. ఇన్నాళ్లూ ఆనందించిన చిన్నారుల్ని మళ్లీ బడిబాట పట్టించాలంటే… ఇప్పటి నుంచే వాళ్లను సిద్ధం చేయడం మంచిది.కొందరు పిల్లలు బడి అంటే చాలు… ఎలా మానాలా అని ఆలోచిస్తారు. ఓ పట్టాన చదవని వారూ ఉంటారు. తోటివారితో దెబ్బలాటలు, చదువుకు సంబంధించిన వస్తువులను పాడుచేసుకోవడం… ఇలా ఎన్నో సమస్యలు సృష్టిస్తారు. అలాంటివేవీ లేకుండా వాళ్లు సాఫీగా స్కూలుకెళ్లేలా చేయడం పెద్ద కష్టమేమీ కాదు.
* దినచర్య పక్కాగా…
ఈ సెలవుల్లో పిల్లలు నచ్చిన సమయానికి నిద్రలేచి ఉంటారు. బడి తెరుస్తున్నారంటే… ఇంకాసేపు ఎక్కువ పడుకునేందుకే చూస్తారు. కానీ ఇకపైనా అదే కొనసాగితే మనకు ఒత్తిడి మొదలవుతుంది తప్ప వాళ్లకు కాదు. అందుకే ఇకనుంచీ వాళ్ల దినచర్య ఓ ప్రణాళిక ప్రకారం ఉండేలా చూడటం మంచిది. ఎంత ఆడుకుంటున్నా, టీవీ చూస్తున్నా సరే… రోజూ రాత్రి తొమ్మిది, తొమ్మిదిన్నర గంటల మధ్య నిద్రపోయేలా చూడండి. అలాగే మర్నాడు కూడా ఆరు గంటలకల్లా నిద్రలేపేయాలి. ఆ తరువాతా ఖాళీగా కూర్చోకుండా కాలకృత్యాలు చకచకా పూర్తి చేయాలంటే మీరు వారి వెంట పడాల్సిందే. టీవీ చూసే సమయాన్ని వీలైనంత కుదించడం, ఫోన్లు అందుబాటులో లేకుండా చూడటమూ ముఖ్యమే. వీటన్నింటికీ తోడు పెట్టిన భోజనం కింద పడేయకుండా తినేలా చూడండి. అవసరమైతే ప్రతి పనికి టైమర్‌ పెట్టండి. దానివల్ల వాళ్లకూ క్రమశిక్షణ అలవడుతుంది.
**చదువు భయం పోయేలా…
స్కూలు తెరుస్తున్నారనగానే కొందరు చిన్నారుల్లో ఆందోళన మొదలవుతుంది. తల్లిదండ్రులేమో అది తెలుసుకునే ప్రయత్నం చేయరు సరికదా బలవంతంగా పంపించేలా చూస్తారు. దానికి కారణం బడి అంటే భయమే. దాన్ని ఇప్పుడే గుర్తించడం అవసరం. ఒకవేళ బళ్లో ఏదయినా సమస్య ఉంటే… మీరు అండగా ఉంటారనే భరోసా వారికి కల్పించాలి. అలాగే స్కూలుకి వెళ్లే ముందు వారిలో ఉన్న భయాలు మీతో పంచుకునే అవకాశం ఇవ్వండి. తోటి పిల్లలతో ఏవయినా సమస్యలు ఉన్నా, టీచర్లతో ఇబ్బంది ఉన్నా మీరు మాట్లాడి పరిష్కరిస్తానని హామి ఇవ్వండి. కొందరు చిన్నారుల్లో పరీక్షలు, గ్రేడ్‌లకు సంబంధించి కూడా ఆందోళన మొదలవుతుంది. అలాంటి సమస్య ఏదయినా ఉంటే… అర్థంకాని సబ్జెక్టుల విషయంలో సాయం చేస్తాననే భరోసా కలిగించండి.
సమీక్ష అవసరమే…
పిల్లల చదువు విషయంలో మీరు, వాళ్లు కిందటేడాది చేసిన పొరబాట్లు ఏంటో ఒకసారి సమీక్షించుకోవడానికి ఇదే సరైన సమయం. వారి ఇష్టాలు ఎంతవరకూ నెరవేరాయి… రాబోయే సవాళ్లు… వంటివన్నీ పరిగణించండి. వీటన్నింటి ఆధారంగా ఓ ప్రణాళిక ఇప్పుడే సిద్ధం చేయండి. వాళ్లు రోజూ చదువుకు కేటాయించే సమయం మొదలు… నిద్రాహార వేళలు, మిగిలిన అంశాలు, ఆసక్తులు వంటివి గమనించి దినచర్యను తయారుచేయాలి. అందులో ఆటలకు సమయం తప్పకుండా ఉండాలి. పిల్లలు దానికి అనుగుణంగా మానసికంగా సిద్ధమవుతారు. ఆ ప్రకారం నడుచుకుంటారు. ఒత్తిడి సమస్య కూడా అదుపులో ఉంటుంది. అన్నింటినీ సమన్వయం చేసుకోగలుగుతారు. చదువులో రాణిస్తారు.
** గుర్తు చేయండి…
సెలవుల రూపంలో దాదాపు రెండు నెలలు చదువుకి దూరమయ్యారు. మళ్లీ పాఠాలు, హోంవర్క్‌కి అలవాటు పడాలంటే కొంత సమయం పడుతుంది. అందుకే ఈ వారమంతా గతేడాదిలో జరిగిన పాఠ్యాంశాల్ని ఓ సారి మననం చేసుకునేలా చూడండి. కొన్ని ప్రాజెక్టులు ఇచ్చి వారిని పూర్తి చేయమనండి. ఆ లక్ష్యాలను చేరితే చిన్న చిన్న కానుకలు అందివ్వండి. ఇవన్నీ చదువుపై ఆసక్తిని పెంచుతాయి. స్కూలుకి వెళ్లాక త్వరగా చదువుపై దృష్టి కేంద్రీకరించడానికి తోడ్పడతాయి.
** అన్నీ నచ్చేలా…
పిల్లలు స్కూలుకి వెళ్లాలంటే… వారిని ఆకట్టుకునేలా ఏదో ఒక విషయం ఉండాలి. అందుకే వారు మెచ్చే స్టేషనరీ ఎంచుకోండి. స్పైడర్‌మ్యాన్‌, చుట్కీ రూపంలో ఉన్న బాక్సులు, నచ్చిన రంగు పెన్సిళ్లు, పెన్నులు, వివిధ ఆకృతుల్లో ఎరేజర్లు, స్కూలుబ్యాగు, నీళ్లసీసా… ఇలా అన్నీ భిన్నంగా ఉండేలా చూడండి. వీటి ఎంపికలో వారి అభిరుచికే ఓటేయండి. వాటిని స్నేహితులకు ఎప్పుడెప్పుడు చూపిద్దామా… అనే ఉత్సాహంతో కూడా పాఠశాలకు వెళ్లేందుకు పిల్లలు ఆసక్తి చూపిస్తారు.
** ఆరోగ్యం కూడా ముఖ్యమే…
పిల్లలు బడికి వెళ్లడానికి ముందే ఓ సారి ఆరోగ్య పరీక్షలు చేయించండి. దీనివల్ల అనారోగ్యం పేరుతో వాళ్లు తరచూ బడి మానేసే పరిస్థితి ఉండదు. వీటన్నింటితోపాటు రాబోయేది వానాకాలం కాబట్టి… వాళ్లు ఆరోగ్యంగా ఉండేలా ఆహారం విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ముఖ్యంగా తృణధాన్యాలతో చేసిన చిరుతిళ్లు, పండ్లు, కూరగాయలు, రకరకాల రోటీలు, పలావ్‌లు… ఇలా వాళ్లకు రోజూ ఇవ్వబోయే బాక్సుకు సంబంధించిన జాబితా కూడా తయారు చేయండి. మీకూ కంగారు ఉండదు.
**స్నేహితులతో సరదాగా…
పిల్లలు మామూలు రోజుల్లోనే స్కూలుకు వెళ్లాలంటే నానా యాగీ చేస్తారు. ఇప్పుడు ఇన్ని రోజుల సెలవుల తరువాత మళ్లీ బడి అంటే ఎంత కష్టంగా భావిస్తారో చెప్పక్కర్లేదు. ఆ భావన వారిలో పెరగకుండా ఉండాలంటే… పిల్లలకు నచ్చే అంశాలెన్నో స్కూల్లో ఉంటాయనే విషయాన్ని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేయండి. గతేడాది మీ చిన్నారితో కలిసి చదువుకున్న వారితో ఓ సారి ఫోనులో మాట్లాడించండి. వీలైతే అంతా కలిసి గడిపేలా చూడండి. ఈ చిన్న ప్రయత్నం వారిని ఎంతో ఉత్సాహంగా బడికి వెళ్లేలా చేస్తుంది. స్కూలంటే భయం కూడా పోతుంది.