Editorials

పాకిస్థాన్ జోలికి రావొద్దు-భారత్‌ను హెచ్చరించిన చైనా

China Warns India On Not To Target Pakistan

ఈ నెల 13, 14 తేదీల్లో కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో జరుగనున్న షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో) సదస్సు సందర్భంగా పాకిస్థాన్‌ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడకూడదని భారత్‌కు చైనా పరోక్షంగా సూచించింది. పాక్‌నే కాకుండా ఏ దేశాన్ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు ఉండకూడదని కోరింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ మాల్దీవులు, శ్రీలంక దేశాల పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈస్టర్‌డే నాడు లంకలో జరిగిన ఉగ్రదాడులను ఎండగడుతూ మోదీ ప్రసంగం సాగింది. ఈ నేపథ్యంలో ఎస్‌సీవోలో కూడా ప్రధాని మోదీ ఇదే అంశాన్ని లేవనెత్తుతారన్న ఉద్దేశంతో చైనా ముందుగానే వంకర బుద్ధి చూపింది. ఈ సందర్భంగా చైనా విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఝాంగ్‌ హన్‌హూయ్‌ మీడియాతో మాట్లాడారు. ‘ఎస్‌ఈవో భద్రత, అభివృద్ధి అనే రెండు అంశాల మీద దృష్టి సారించనున్నాం. ఈ సమావేశం ఏర్పాటు చేసేది వివిధ దేశాలను ఉద్దేశించి మాట్లాడటానికి కాదు. ప్రధాన అంతర్జాతీయ, ప్రాంతీయ సమస్యలకు ఇక్కడ పెద్ద పీట వేయనున్నాం’ అని తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎండగట్టి పాకిస్థాన్‌ను ఏకాకిగా మార్చడానికి ఎస్‌ఈవో వేదికగా అడుగులు పడాలని ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహం రచిస్తున్న తరుణంలో చైనా ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. ఎస్‌సీవో వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ సమావేశం కానున్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన తర్వాత ఇరువురు నేతలు భేటీ కానుండటం ఇదే తొలిసారి. చైనాలోని భారత రాయబారి విక్రమ్ మిశ్రి మాట్లాడుతూ గతంలో పలు అంతర్జాతీయ సదస్సుల సందర్భంగా ప్రధాని మోదీ, జిన్‌పింగ్ సమావేశమయ్యారని, త్వరలో కిర్గిస్థాన్‌లో జరగనున్న ఎస్‌సీవో సదస్సు సందర్భంగా మళ్లీ భేటీ కానున్నారని చెప్పారు. మరోవైపు పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌- మోదీ భేటీ రద్దయింది. ఈ సమావేశం సందర్భంగా ఇరువురు నేతలు సమావేశం అవుతారని తొలుత వార్తలు వచ్చాయి. కానీ, భేటీ జరిగే సూచనలు కనిపించడం లేదని విదేశాంగశాఖ పేర్కొంది. రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు హాజరయ్యే ప్రధాని మోదీ అధికారిక కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొంటారని వెల్లడించింది.