Kids

దత్తత కోసం భారతదేశవ్యాప్తంగా 8677 మంది అనాథ పిల్లలు

8677 Orphan Kids Are Awaiting For Foster Parents In India

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బాలల సంరక్షణా కేంద్రాల్లో 8,677 మంది పిల్లలు దత్తతకు అందుబాటులో ఉన్నట్లు కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా అనేక మంది దంపతులు సంతానం లేక బాధపడుతున్నారు. అయితే దత్తతపై ఉన్న ఓ మూఢవిశ్వాసం ఉండడం వల్ల వీరెవరూ అందుకు ముందుకు రావడం లేదు. ఇటీవల లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈ వివరాలు వెల్లడించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. 6,791 మంది అనాథలు లేదా తల్లిదండ్రుల నుంచి దూరమైన పిల్లలు దేశవ్యాప్తంగా ఉన్న 488 ప్రత్యేక దత్తత ఏజెన్సీల్లో ఆశ్రయం పొందుతున్నారు. అందులో 3,990 మంది ఆడపిల్లలు. అలాగే 4,462 శిశు సంరక్షణ కేంద్రాల్లో మొత్తం 1,706 మంది దత్తతకు సిద్ధంగా ఉండగా.. అందులో 1,043 మంది ఆడపిల్లలు ఉన్నారు. దత్తత తీసుకునే ప్రక్రియను ఇప్పుడు పూర్తిగా ఆన్‌లైన్ చేసినట్లు ఇరానీ వెల్లడించారు. ఏయే సెంటర్లలో ఎంతమంది పిల్లలు ఉన్నారు, వారి వివరాలతో పాటు పూర్తి నియమనిబంధనలను ఆన్‌లైన్‌లో పొందుపరిచినట్లు తెలిపారు. ఇది పూర్తి పారదర్శంగా జరుగుతుందన్నారు. అలాగే ఎవరైనా దత్తత తీసుకునే వెసులుబాటు ఉందన్నారు.

*** నియమ, నిబంధనలు ఇవే…
* భారత్‌లోని ఓ చిన్నారిని భారత పౌరులు లేదా భారత సంతతి వ్యక్తులు లేదా విదేశీ పౌరులు దత్తత తీసుకోవచ్చు.
* వైవాహిక స్థితి, లింగ బేధంతో సంబంధం లేకుండా ఎవరైనా దత్తత తీసుకోవచ్చు.
* ఎవరైనా దంపతులు చిన్నారిని దత్తత తీసుకోవాలనుకుంటే వారి వివాహం జరిగి, కనీసం రెండు సంవత్సరాలు కలిసి ఉండాలి. అలాగే దంపతులిద్దరూ దత్తతకు అంగీకారం తెలపాలి.
* దంపతులకు వారు దత్తత తీసుకునే పిల్లలకు మధ్య వయసులో 25 ఏళ్ల వ్యత్యాసం ఉండాలి.

వీటితో పాటు మరికొన్ని నిబంధనల్ని ఆన్‌లైన్‌లో ఉంచినట్లు ఇరానీ తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న బాలల సంరక్షణ కేంద్రాలన్నీ నిబంధనలకు లోబడి పనిచేయాలని.. లేదంటే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అందులో భాగంగా ఇప్పటికే పలు కేంద్రాలకు నోటీసులు జారీ చేశామని తెలిపారు.