NRI-NRT

HR1044 భారతీయుల దశ మారుస్తుందా?

Will HR1044 Pass In The House?

అమెరికాలో శాశ్వత నివాసం, ఉపాధి కోసం ఉద్దేశించిన గ్రీన్ కార్డు బిల్లుపై అమెరికా కాంగ్రెస్లో ఓటింగ్కు సర్వం సిద్ధమైంది. ఈ బిల్లు కాంగ్రెస్ ఆమోదం పొందితే దశాబ్దాల తరబడి గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు భారీగా ప్రయోజనాలు దక్కుతాయి. గ్రీన్ కార్డు విషయంలో అమెరికా ఒక్కో దేశానికి గరిష్టంగా ఏడు శాతానికి మించి ఇవ్వకూడదన్న కోటా నిబంధనలు భారత్ వలసదారులకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి.జనాభా ఎక్కవ ఉన్న దేశాలకు, తక్కువ ఉన్న దేశాలకు ఒకే నిబంధనలు అమలవుతూ ఉండడంతో భారత్, చైనా, ఫిలిప్పీన్స్కు చెందిన వలసదారుల దరఖాస్తులు కుప్పలుతెప్పలుగా పెండింగ్లో ఉన్నాయి. ఈ ఇక్కట్లకు తెరదించడానికి గత ఫిబ్రవరిలో ఫెయిర్నెస్ ఫర్ హై స్కిల్డ్ ఇమ్మిగ్రెంట్ యాక్ట్ (హెచ్ఆర్1044) బిల్లును భారత సంతతికి చెందిన సెనేటర్ కమలా హ్యారిస్ తన సహచరుడు మైక్లీతో కలిసి సెనేట్లో ప్రవేశపెట్టారు.ఇదే తరహా బిల్లును కాంగ్రెస్ ప్రతినిధుల సభలో జో లాఫ్రెన్, కెన్బర్గ్లు ప్రవేశపెట్టారు. ప్రతినిధుల సభలో మొత్తం 435 సభ్యులకు గాను రిపబ్లికన్, డెమొక్రాట్ పార్టీకి చెందిన 310 మందికి పైగా ప్రజాప్రతినిధుల మద్దతు ఈ బిల్లుకు ఉంది. 203 మంది డెమొక్రాట్లు, 108 మంది రిపబ్లికన్లు ఈ బిల్లుకు కో స్పాన్సరర్లుగా ఉన్నారు. 290 ఓట్లు బిల్లుకు అనుకూలంగా వస్తే దీనిపై ఎలాంటి చర్చలూ, సవరణలూ లేకుండా ఆమోదం పొందుతుంది.
*భారతీయులకు కలిగే ప్రయోజనాలేంటి?
భారతీయుల డాలర్ డ్రీమ్స్ సాకారమయ్యే రోజు ఎంతో దూరంలో లేదు. ఏకంగా 3 లక్షల మంది భారతీయులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న వలస విధానం వల్ల ఇండియాకు చెందిన అత్యంత ప్రతిభావంతులు, ఐటీ వృత్తి నిపుణులు ఎక్కువగా నష్టపోతున్నారు. అతి పెద్ద ఐటీ కంపెనీలు కూడా తక్కువ వేతనాలకు భారతీయుల్ని నియమిస్తూ వారి శ్రమను దోపిడీ చేస్తున్నాయి. గ్రీన్కార్డు బిల్లు దేశాల కోటా పరిమితిని ఎత్తివేయడంతో పాటుగా కుటుంబాల ప్రాతిపదికన వలస వీసా కోటాను 15శాతానికి పెంచనుంది.
అమెరికాలో ఉద్యోగాలు చేయడానికి వీలుగా హెచ్1బీ వీసా దారులకు ఈబీ కేటగిరీ కింద ప్రతి ఏటా 1.4 లక్షల మందికి గ్రీన్ కార్డులు జారీ చేస్తున్నారు. ఏడు శాతం కోటా నిబంధనలతో ఒక్కో దేశం 9,800కు మించి ఎక్కువ కార్డులు పొందలేదు. ఫలితంగా జనాభా అత్యధికంగా ఉండే ఇండియా, చైనా వంటి దేశాల నిపుణులు గ్రీన్ కార్డు కోసం ఎ క్కువ కాలం ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పుడు ఇక ఆ ఎదురుచూపులకు తెరపడినట్టే.
*మనోళ్లలో 90 శాతం మందికి లబ్ధి
గ్రీన్కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న భారతీయుల్లో ఇప్పటివరకు ప్రతీ ఏడాది 25 శాతం మందికి మాత్రమే మంజూరవుతూ వచ్చాయి. కొత్త చట్టం రూపుదాల్చితే వచ్చే పదేళ్లలోనే 90 శాతానికిపైగా భారతీయులకు గ్రీన్ కార్డులు లభిస్తాయని యూఎస్సీఐఎస్ (యునైటెడ్ స్టేట్స్ సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్) అంచనా వేస్తోంది.
**విదేశాల్లో భారతీయం
*కెనడాలో 51% పైకి
కెనడాలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న భారతీయుల సంఖ్య భారీగా పెరిగినట్టు ఆ దేశ ప్రభుత్వ వలస విభాగం వెల్లడించింది. 2018 సంవత్సరానికి 39,500 మందికిపైగా భారతీయులకు ఈ ఏడాది గ్రీన్ కార్డులు మంజూరైనట్టు ఒక నివేదికలో తెలిపింది. 2017తో పోల్చి చూస్తే గ్రీన్ కార్డులు 51శాతం పెరిగినట్టు కెనడా ఇమ్మిగ్రేషన్, రిఫ్యూజీ అండ్ సిటిజన్ షిప్ నివేదిక వివరించింది. కెనడాలో జస్టిన్ ట్రాడ్యూ నేతృత్వంలో ప్రభుత్వం ఈ ఏడాది ఎక్స్ప్రెస్ ఎంట్రీ సిస్టమ్ విధానం ద్వారా ఏకంగా 92 వేల మంది వలసదారులకు శాశ్వత నివాసం కోసం అనుమతులు మంజూరు చేసింది.
దీని ప్రకారం 46శాతం మంది భారతీయులకు కెనడా పౌరసత్వం వస్తే, ఆ తర్వాత స్థానం నైజీరియన్లు, చైనీయులు ఉన్నారు. అమెరికాలో వలస విధానాన్ని కఠినతరం చేయడం, హెచ్1బీ వీసాలు లభించడం కష్టమైపోవడం, గ్రీన్కార్డు మంజూరులో జాప్యాలు, వలసదారుల జీవిత భాగస్వాములకు ఉద్యోగ అవకాశాలు కరువైపోవడంతో భారతీయుల చూపు ఈ మధ్య అమెరికా నుంచి కెనడా వైపు తిరిగింది. దానికి తగ్గట్టుగానే అక్కడి ప్రభుత్వం రికార్డు స్థాయిలో శాశ్వత నివాసం కోసం వీసాలు మంజూరు చేసింది.
*షార్జా గోల్డెన్ వీసా
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి చెందిన పారిశ్రామికవేత్త లాలో శామ్యూల్కు శాశ్వత నివాసాన్ని కల్పిస్తూ మొదటిసారిగా షార్జా గోల్డ్కార్డు వీసా మంజూరు చేసింది. కింగ్స్టన్ హోల్డింగ్స్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన లాలో శామ్యూల్ గత కొన్నేళ్లుగా యూఏఈలో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తూ అరబ్ ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపు పొందారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) అభివృద్ధి కోసం ఈ మధ్య కాలంలో పెట్టుబడుల్ని ఆకర్షించడానికి, ఆర్థికంగా దేశాన్ని పరుగులు పెట్టించడానికి గోల్డెన్ కార్టు వీసా వివిధ దేశాల పారిశ్రామికవేత్తలకు మంజూరు చేస్తోంది.