Politics

నేటి అసెంబ్లీలోని వాడీ వేడీ విశేషాలు

Todays Andhra Assembly Special News

మ్యాటర్ వీక్.. పబ్లిసిటీ పీక్
బడ్జెట్ పై మూడు రోజుల చర్చకు రిప్లయి ఇచ్చిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
అమరావతి.. ఏపీ రాజధాని అమరావతిలో పలువురికి ఊపికితిత్తుల వ్యాధి సోకుతోంది. . ఊపిరాడక పలువురు ఇబ్బంది పడుతున్నారు. ఎందువల్లంటే చంద్రబాబు తాత్కాలిక రాజధాని పేరిట నిర్మించిన భవనాలకు కిటికీలు లేవు. ఎక్కడా కిటికీలు కనిపించవు. అందువల్ల ఉద్యోగులు, ఇతరులు ఊపిరాడక ఇబ్బంది పడుతున్నారు. నెలకోసారి ఆసుపత్రులకు వెళ్ళాల్సి వస్తోందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. . అమరావతి… రాజధానిపై గ్రాఫిక్స్ చూపి ప్రజలను మభ్యపెట్టారు. రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో మలేషియా, సింగపూర్, శ్రీ లంక, లండన్, అమెరికా దేశాలలో కలియ దిరిగారు. ఆయనతో పాటు అప్పటి ఆర్థిక మంత్రి యనమల కూడా విదేశీ పర్యటనలలో పాల్గొన్నారు.రు. ప్రతి విదేశీ పర్యటనలో వీరిద్దరూ కలిసి తిరిగారు.. ప్రపంచ స్థాయిలో రాజధాని నిర్మాణం చేస్తామని ప్రకటించి చివరకు దర్శకుడు రాజా మౌళితో డిజైన్లు వేయించారు. రాజధాని పనుల కోసం కేంద్రం రూ 1500 కోట్లను విడుదల చేయగా ఏపీ కేవలం 277 కోట్లను తన బడ్జెట్ నుంచి విడుదల చేసింది. ఈ పనుల కోసం రూ 1770 కోట్లు ఖర్చు పెట్టారు. అంతర్జాతీయ స్థాయి అని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు డబుల్ రోడ్లను కూడా నిర్మించ లేక పోయారు. నాణ్యతా ప్రమాణాలు లోపించడం వల్ల కట్టడాలలో బయట కంటే లోపలే వర్షపు నీరు ఎక్కువగా కనిపిస్తుంది.
*నీరు చెట్టు..
ఈపథకం కింద ముందు వెనుకా చూడకుండా నిధులను వెచ్చించారు. అయిదు సంవత్సరాల కాలంలో బడ్జెట్ కేటాయింపుల కంటే ఖర్చు ఎక్కువ. ప్రజాధనాన్ని ఇష్టమొచ్చినట్లు నాకేశారు. నీరు చెట్లు పథకం కింద రూ 736 కోట్లకు గాను రూ 4850 కోట్లు వెచ్చించారు. అధికారం నుంచి వైదొలగిన ఏట ఈ పథకానికి రూ161 కోట్లు కేటాయించారు. బకాయిలు సుమారు 1183 కోట్లు మేర ఉన్నాయి. ఘోరాతి ఘోరంగా పాలన సాగించి తన మద్దతుదారులకు ప్రజాధనాన్ని కట్టబెట్టారు. ఈ పథకం వల్ల ప్రయోజనం మాత్రం సున్నా.
*వడ్డీ లేని రుణాలు..
ఈ ఏడాది బ్జడెట్లో అతి తక్కువ నిధులు కేటాయించారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. వచ్చే ఏప్రిల్ లో
ఈవడ్డీ లేని రుణాలను చెల్లించాలి. వచ్చే బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయిస్తాం. రైతులకు వడ్డీ లేని రుణ సదుపాయాన్ని కలిస్తాం.గత అయిదు సంవత్సరాలలో ఈపథకం కోసం చంద్రబాబు రూ 11,595 కోట్లకు గాను కేవలం 629 కోట్లు విడుదల చేశారు. అలాంటి వ్యక్తి ఈరోజు మమ్మల్ని వేలెత్తిచూపుతున్నారు.
*మద్యం దుకాణాలు…..
మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే బెల్టు షాపులను బంద్ అయ్యేలా చూసింది. రెండోదశలో మధ్యం షాపులను ప్రభుత్వమే నడిపిస్తుంది. ఇప్పటి దాకా ప్రయివేటు వ్యక్తులు వీటిని నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం లిక్కర్ అమ్మకాలను చేపట్టడం వల్ల బెల్టు షాపులు లేకుండా చూడ వచ్చనేది ప్రభుత్వ అభిప్రాయం. చివరగా మద్యంపై నిషేదాన్ని అమలు చేస్తాం.దశల వారీగా ఈకార్యక్రమం కొనసాగుతుంది.
*వ్యవసాయం..
రైతులకు మా ప్రభుత్వం చేయూత నిస్తోంది. పగలే 9 గంటల విద్యుత్తును వ్యవసాయ రంగానికి అమలు చేయాలని విధాన నిర్ణయాన్ని తీసుకున్నాం. ప్రస్తుతం 60 శాతం ప్రాంతాలకు ఈమేరకు కరెంటు ఇస్తున్నాం. పంటల బీమా కోసం రూ 1160 కోట్లు, రైతు భరోసా కోసం రూ 8750 కోట్లు కేటాయించాం. దీని వల్ల నిరుపేద రైతులతో పాటు కౌలు రైతులకు ఉపకారం ఒనగూరుతుంది..
. *యువత..టూరిజం..
దీని కింద కేటాయింపులు తక్కువగా ఉన్నాయట వారికి. ఈ పద్దు కింద గత ప్రభుత్వం గత ఏడాది రూ 2063 కోట్లను
కేటాయించి కేవలం రూ 603 కోట్లను వెచ్చించింది. ఈ ఏడాది బడ్జెట్ రూ 538 కోట్లు. తేడా గమనించిండి. విశాఖ కోకో మ్యాచ్ చూస్తూ 2018లో అమరావతిలో ఒలింపిక్స్ పోటీలు నిర్వహిస్తానని గతంలో చంద్రబాబు ప్రకటించారు. ఆ విధంగా మా టలు చెప్పబోం. కోతల ప్రభుత్వం మాది కాదు.
*పరిశ్రమలు..
అమరావతి రాజధాని ప్రాంతంలో కంప చెట్టుండగా పరిశ్రమలు పెద్ద ఎత్తున వచ్చాయని టీడీపీ ప్రచారం చేసుకుంది. ఆ పరిశ్రమలు ఎక్కడ ఉన్నాయో తెలియటం లేదు. గత ఏడాది రాయితీల కింద బడ్జెట్లో రూ 3500 కోట్లు కేటాయించి చివరకు ఖర్చు పెట్టింది రూ 740 కోట్లు మాత్రమే ..ఐటీ పరిశ్రమలు అడుగంటిపోయాయి. ఐటీలో కంప్యూటర్లను కనిపెట్టిన చంద్రబాబు ఈ రంగానికి చేసిందేమీ లేదు.
*మానిఫెస్టో..
అట్టడుగున ఉన్న నిరుపేదలను ఆదుకోవాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. మానవ వనరుల ప్రగతికి తగిన చర్యలు
తీసుకుంటున్నాం. అమ్మ ఒడి పథకంకు రూ 6,600 కోట్లు, ఫీజు రీయింబర్స్ మెంట్ అమలుకు రూ 4 వేల కోట్లు, పాఠశాల్లో మౌలిక సదుపాయాల కోసం రూ 1500 కోట్లు కేటాయించాం. టీడీపీ హయాంలో ఈ రంగాలకు అతి తక్కువ నిధుల కేటాయింపు జరిగింది. ఏపీలోని ఆపన్నులలో మొత్తం 80 శాతం ప్రజలను ఆదుకునే పథకాలను ఈ ఏడాదే మొదలు పెట్టాం.
*గొర్రెలకు బీమా సదుపాయం
పశువులకు బీమా పథకం ప్రస్తుతం అమలులో ఉంది గొర్రెలకు బీమా సదుపాయం ఇప్పటి దాకా లేదు.
గొర్రెల బీమా నిధులను మా ప్రభుత్వం విడుదల చేస్తుంది. హౌసింగ్ బడ్జెట్ ను రూ 3500 కోట్ల నుంచి రూ 8,500 కోట్లకు పెంచాం.ఆరోగ్య శ్రీ లో ప్రతి జబ్బుకు ఉచిత చికిత్స ఉంటుంది. పింఛన్ల కోసం రూ 15 వేల కోట్లు కేటాయించాం. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు పింఛన్ను రూ 2 వేలకు పెంచారు. మా ప్రభుత్వం ప్రతి నెలా రూ 2,250 పింఛన్ ను నిరుపేదలకు ఇస్తోంది.
*దోమలపై దండయాత్రా?
చంద్రబాబు తన హయాంలో దోమలపై దండయాత్ర ప్రకటించారు. కర్నూలు సర్కిల్ రోడ్డులో చంద్రబాబు కట్ అవుట్ ఏర్పాటు చేశారు. చంద్రబాబుకు తలపై కిరీటం పెట్టి చేతిలో కత్తి ఉండేలా… దోమ చిత్రం చిన్నగా కనిపించేలా కటౌటు పెట్టారు. ఇది చూసి ప్రజలు నవ్వుకున్నారు. దోమలపై దండయాత్ర అంటూ చంద్రబాబు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఆయన ప్రవేశ పెట్టిన పథకాల పేర్లు కూడా గొప్పగా ఉన్నాయి. నీరు..చెట్లు, వనం ..మనం, మీ ఇంటికి మీ భూమి, హ్యాపీ సండే, జల హారతి, దోమలపై దండయాత్ర లాంటి పేర్లు చూస్తే మాటర్ వీక్..పబ్లిసిటీ పీక్ అని చెప్పవచ్చు
*రుణ మాఫీ
గత ఎన్నికలకు ముందు రుణ మాఫీ చేస్తానని రైతులకు హామీ ఇచ్చిన చంద్రబాబు చివరకు మోసం చేశారు. రూ 87 వేల కోట్లకు గాను రూ 24 వేల కోట్లను విడుదల చేశానని ప్రకటించి రూ1 5 వేల కోట్లను మాత్రమే మాఫీ చేశారు. చివరకు తన ఓట్ ఆన్ అకౌంటు బడ్జెట్లో దీనికి నిధులను కేటాయించ లేదు. నాలుగు, అయిదో విడత రుణ మాఫీ బకాయిలు రూ 7925 కోట్లు. నాలుగో విడత కింద రూ 3600 కోట్లు, అయిదో విడత కింద రూ 4325 కోట్లు పెండింగులో ఉన్నాయి.
*అప్పులు పెరగవు
మా ప్రభుత్వ హయాంలో అప్పులు పెరిగే అవకాశం లేదు. ఉన్న ఆర్థిక వనరులను సద్వినియోగపరిచేందుకు చర్యలు
తీసుకుంటాం. ప్రజలపై భారాన్ని మోపబోము. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫిస్కల్ లోటు ప్రతి ఏడాది నమోదు అయ్యింది. ఫిస్కల్ లోటు 3.58 శాతం ఉండాలి. ప్రతి ఏడాది ఎఫ్ఆర్ బీఎం లక్ష్మణ రేఖను చంద్రబాబు దాటి అప్పులు చేశారు. 2016.17 లో దీనిశాతం 4.42 , 2017.18లో 4.07 శాతం నమోదైంది. మా ప్రభుత్వ హయాంలో ఈీశాతం 3.26 శాతం లోగానే ఉంటుంది. అందువల్ల అప్పు పెరిగే ప్రమాదం లేదు. మాది సంక్షేమ ప్రభుత్వం, బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలను ఆదుకునే సర్కారు మాదని బుగ్గన రాజేంద్రనాథ్ వివరించారు.
1.40 ఏళ్లు అనుభవమున్న వారైనా రూల్స్ ఫాలో అవ్వాల్సిందే: జగన్…….
సీట్ల కేటాయింపుపై ఏపీ అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరిగింది. డిప్యూటీ లీడర్లకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు స్పీకర్‌ను కోరారు. దీనిపై స్పందించిన అధికార పక్షం నిబంధనలను అనుసరించే అచ్చెన్నాయుడికి సీటు కేటాయించామని తెలిపింది.సభా సంప్రదాయాలు పాటించాలని చంద్రబాబు కోరడంతో.. తనను ఎవరు బెదిరించలేరని స్పీకర్ తమ్మినేని అసహనం వ్యక్తం చేశారు. దీనిపై ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ.. ప్రశ్నపై సమాధానం ముగిసిన తర్వాత ఎలా అవకాశం ఇస్తారని ప్రశ్నించారు.ఇదే అంశంపై అంబటి రాంబాబు స్పందిస్తూ.. చంద్రబాబు సింపతీ డ్రామాలు ఆడుతున్నారని.. ప్రజల్లో సానుభూతి కోసమే ప్రతిపక్షనేత డ్రామాలని ఎద్దేవా చేశారు. చర్చకు అడగటంలో తప్పులేదని అంతేకాని బెదిరిస్తే బెదిరిపోయే వారు ఇక్కడ ఎవరు లేరని అంబటి హెచ్చరించారు.ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందిస్తూ సీట్ల కేటాయింపు సభ నిబంధనల ప్రకారమే జరిగిందని తేల్చి చెప్పారు. తమ సభ్యుడు శ్రీధర్ రెడ్డి మొదటి నుంచి కూడా ఒకే సీటులో కూర్చొంటున్నారని.. బాబు పక్కనే కూర్చోవాలని అతను ఆశపడుతున్నాడని జగన్ సెటైర్లు వేశారు.ఆరు సార్లు ఎమ్మెల్యే అయినా.. మొదటి సారి ఎమ్మెల్యే అయినా ఒకటే రూల్స్ బుక్ ఫాలో అవ్వాలని సీఎం అన్నారు. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ.. ఆంగ్ల అక్షరాల క్రమంలో సభ్యులకు సీట్లు కేటాయిస్తారని దాని ప్రకారం అచ్చెన్నాయుడు ముందు వరుసలో ఉండాలన్నారు.గతంలో ఎన్టీఆర్, వైఎస్‌లు సీఎంలుగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలను ఆయన గుర్తు చేశారు. అధికారపక్షం తమపై చేసే విమర్శలక సమాధానాలు ఇచ్చుకోలేని పరిస్ధితి లేనప్పుడు తామంతా ఇక్కడ కూర్చోవడం కూడా దండుగని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యుల బలం ఎక్కువగా ఉందని నన్ను బెదిరంచాలని చూస్తే తాను భయపడనని చంద్రబాబు స్పష్టం చేశారు.
2. సీట్ల కోసం కొట్టుకుంటే.. బడ్జెట్‌పై చర్చ ఎప్పుడు: జగన్………
అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యుల వైఖరిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసహనం వ్యక్తం చేశారు. ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైన జీరో అవర్ ఇంతవరకు పూర్తికాలేదని.. కేవలం రెండు ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇచ్చామని .. బడ్జెట్‌పై ఎప్పుడు చర్చ జరగాలని ఆయన ప్రశ్నించారు.సీట్లెక్కడ ఉండాలి… ఎవరి పక్కన కూర్చోవాలంటూ ప్రతిపక్ష సభ్యులు సమయాన్ని వృథా చేస్తోందంటూ జగన్ మండిపడ్డారు. అనంతరం అంబటి రాంబాబు మాట్లాడుతూ.. అచ్చెన్నాయుడు లావుగా, పొడుగ్గా ఉన్నారనే అన్నాము తప్పించి ఎటువంటి అసభ్యపదజాలాన్ని వినియోగించలేదన్నారు. డిప్యూటీ లీడర్లకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు స్పీకర్‌ను కోరారు. దీనిపై స్పందించిన అధికార పక్షం నిబంధనలను అనుసరించే అచ్చెన్నాయుడికి సీటు కేటాయించామని తెలిపింది. సభా సంప్రదాయాలు పాటించాలని చంద్రబాబు కోరడంతో.. తనను ఎవరు బెదిరించలేరని స్పీకర్ తమ్మినేని అసహనం వ్యక్తం చేశారు.
3. కొత్త జిల్లాలకు ఎన్టీఆర్‌, అల్లూరి పేర్లు పెట్టాలి
పరిపాలనా సౌలభ్యం, ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందించే లక్ష్యంతో రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటును పరిశీలిస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ శాసనమండలిలో వెల్లడించారు. ఈ అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాల ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అయితే జిల్లాల ఏర్పాటుకు ముందే ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని సభ్యులు సూచించారు. కమిటీ ద్వారా అధ్యయనం చేయటం లేదా అఖిలపక్షం ద్వారా సలహాలు స్వీకరించాలని కోరారు. ప్రత్యేకంగా గిరిజన జిల్లా ఏర్పాటు చేసే క్రమంలో పరిపాలన సౌలభ్యంగా ఉండేలా జిల్లా కేంద్రాన్ని ఎంపిక చేయాలని ఎమ్మెల్సీలు సంద్యారాణి, సోము వీర్రాజు సూచించారు. గిరిజన నియోజకవర్గాలను కలిపే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కొత్త జిల్లాలకు ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు, ఫూలే వంటి మహనీయుల పేర్లు పెట్టాలని ఎమ్మెల్సీ రాము సూర్యారావు సూచించారు.
4. ఏపీ అసెంబ్లీలో సీట్ల కేటాయింపుపై వాగ్వాదం
ఏపీ అసెంబ్లీలో సీట్ల కేటాయింపు అంశం చర్చకు వచ్చింది. అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరీలు ఒకరి సీటులో మరొకరు కూర్చొన్నారని వైకాపా అభ్యంతరం తెలపడంతో వివాదం మొదలయ్యింది. సీట్లు కేటాయింపు విషయంలో.. డిప్యూటీ లీడర్లకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని ప్రతిపక్షనేత చంద్రబాబు డిమాండ్ చేశారు. స్పీకర్ ఈ విజ్ఞప్తిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే రూల్ ప్రకారమే డిప్యూటీ లీడర్‌గా అచ్చెన్నాయుడికి సీటు కేటాయించామని అధికారపక్షం తెలిపింది. తర్వాత ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి అనిల్‌కుమార్ చేసిన విమర్శలపై సమాధానం ఇచ్చేందుకు సమయం ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేసింది. దీంతో సభలో గందరగోళం నెలకొంది.
5.బుగ్గన-బుచ్చయ్య చౌదరి మధ్య ఆసక్తికర వ్యాఖ్యలు
ఏపీ అసెంబ్లీలో ఇవాళ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. దీంతో సభలో్ స్పీకర్‌తో సహా అందరూ నవ్వుకున్నారు. బుగ్గన మాట్లాడుతూ ‘‘బుచ్చయ్య చౌదరి గారు పాపం అక్కడి నుంచి నడుచుకుంటూ ఆయన సీటు ఆక్యూఫై చేసుకోడానికి రావడం జరిగిందని, ఇవాళ మంచి డ్రస్‌తో చాలా స్మార్ట్‌గా.. హ్యాండ్‌సమ్‌గా ఉన్నారని’’ అన్నారు. మంత్రి వ్యాఖ్యలపై స్పందించిన గోరంట్ల మాట్లాడుతూ ‘‘నేను స్మార్ట్‌గానే ఉంటా.. కొత్తగా చెప్పేది కాదు. నాకు 73 నడిచి 74 వచ్చింది. మరి ఆర్థిక శాఖ మంత్రి గారికి నా వయసు వచ్చేసరికి నడుస్తారో? నడవరో? నాకైతే తెలియదు గానీ, తాను ఇంకో 20 ఏళ్లు నడవగలనని, తన తండ్రి 105 ఏళ్లు బతికారని, అందువల్ల నాకేమీ పర్వాలేదని’’ అన్నారు. ‘ఆల్ వేజ్ అ యామ్ స్మార్’ అని బుదులిచ్చారు. దీంతో సభలో అందరి మధ్య నవ్వులు విరిసాయి.
6. డబ్బుల్లేవ్‌ ‘టోల్‌ ‘ కట్టాల్సిందే: గడ్కరీ
ప్రభుత్వం దగ్గర తగినన్ని నిధులు లేవని..ఈ కారణంగానే టోల్‌ వ్యవస్ధ కొనసాగుతున్నదని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ. ప్రజలు మంచి సేవలను కోరుకుంటున్నట్లయితే టోల్‌ఫీజు కట్టాల్సిందేనన్నారు. ఇవాళ (మంగళవారం) లోక్‌సభలో రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు గ్రాంట్ల డిమాండ్‌పై జరిగిన చర్చపై సమాధానమిచ్చారు గడ్కరీ. గడిచిన ఐదేళ్ళలో ప్రభుత్వం 40 వేల కిలోమీటర్ల జాతీయ రహదార్లను నిర్మించిందని తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో టోల్‌ వసూలు పై కొంత మంది సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడంపై గడ్కరీ సమాధానమిస్తూ… చెల్లించగల సామర్థ్యమున్న ఆయా ప్రాంతాలలో వసూలు చేస్తున్న టోల్‌ ఫీజును గ్రామీణ, పర్వత ప్రాంతాలలో రోడ్ల నిర్మాణానికి ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. టోల్‌ వ్యవస్ధ కొనసాగుతుందని, మారుతున్న కాలంతో పాటు టోల్‌ పీజులు మారతాయని చెప్పారు మంత్రి నితిన్‌ గడ్కరీ.
7. అధికారపక్షాన్ని ఇరుకున పెట్టేందుకు టీడీపీ వ్యూహాలు
ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. సమాచార లోపంతోనే అధికారపక్ష సభ్యులు దూకుడుగా వెళ్తున్నారన్న చంద్రబాబు.. ప్రతి అంశంలోనూ ఎదురుదాడి చేయాలని పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.. హ్యాపీ రిసార్ట్స్‌లో నిర్వహించి టీడీఎల్పీ సమావేశంలో సభలో ఎలా వ్యవహరించాలన్న దానిపై పలు సూచనలు చేశారు.ఆ తర్వాత టీడీపీ వ్యూహ కమిటీ సభ్యులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. అసెంబ్లీలో టీడీపీపై ఆరోపణలు చేసేందుకే వైసీపీ సభా సమయాన్ని దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. ప్రజా సమస్యలు పరిష్కరించలేక టీడీపీని టార్గెట్ చేస్తున్నారని అన్నారు. పోలవరం పనులు టీడీపీ 5 ఏళ్లలోనే 66 శాతం పూర్తిచేసిందని కానీ వైసీపీ అసత్య ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. కేంద్రం నుంచి పెండింగ్ నిధులు తేలేక వైసీపీ ఎదురుదాడి అస్త్రాన్ని ఎంచుకుందని చంద్రబాబు మండిపడ్డారు.
8. తెలంగాణకు ఇప్పటి వరకు కేంద్రం చేసింది ఏమీ లేదు – టీఆర్‌ఎస్ ఎంపీ
విభజన హామీలు.. బడ్జెట్‌లో వ్యవసాయ కేటాయింపులపై పార్లమెంట్‌ దద్దరిల్లింది. లోక్‌సభలో కేంద్రం తీరుపై ఏపీ, తెలంగాణ ఎంపీలు మండిపడ్డారు. ఎన్నికల ముందు రైతులకు పలు హామీలు ఇచ్చిన కేంద్రం.. బడ్జెట్‌ కేటాయింపుల్లో అస్సలు పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. ఇటు రాజ్యసభలో విభజన హామీలు అమలు చేయడం లేదని టిఆర్‌ఎస్‌ ఎంపీ కేకే నిలదీశారు. విభజన హామీలకు కట్టుబడి ఉందని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ హామీ ఇచ్చారు.రాజ్యసభలో విభజన హామీలపై కేంద్రాన్ని తెలుగు ఎంపీలు నిలదీశారు. తెలంగాణకు ఇప్పటి వరకు కేంద్రం చేసింది ఏమీ లేదని టీఆర్‌ఎస్‌ ఎంపీ కేకే నిలదీశారు. ట్రిపుల్‌ ఐటీ, ట్రైబల్‌ యూనివర్శిటీ తదితర ఇనిస్టిట్యూలు ఏర్పాటు చేస్తామన్న కేంద్రం.. అసలు నిధులు విడుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.