Devotional

కర్తార్‌పూర్ కథ ఇది

The story of sikh prominent place Kartharpur

సిక్కు మత స్థాపకుడు గురునానక్ దేవ్ 550వ జయంతిని నవంబర్ 29న నిర్వహిస్తారు. దేశంలోని అనేక గురుద్వారాల్లో వేడుకలకు సిక్కులు రెడీ అవుతున్నారు. మన దేశంలోనే కాకుండా పాకిస్థాన్లోని కర్తార్పూర్లో ఉన్న పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవటానికి కూడా భక్తులు భారీ సంఖ్యలో వెళ్తారు. ఈ యాత్ర సాఫీగా సాగటానికి రెండు దేశాలూ వివిధ సదుపాయాలను కల్పించాల్సి ఉంది. వాటి గురించి చర్చించటానికి ఇండియా, పాకిస్థాన్ ఆఫీసర్లు ఈమధ్య సమావేశమయ్యారు.పది మంది సిక్కు మత గురువుల్లో మొదటివారైన గురునానక్ దేవ్ 1469 నవంబర్ 29న పంజాబ్లోని నాన్కానా సాహిబ్లో పుట్టారు (ఆ ప్రాంతం ఇప్పుడు పాకిస్థాన్లో ఉంది). చిన్నతనంలోనే ఆధ్యాత్మిక భావాల వైపు ఆకర్షితులై ఇల్లు వదిలి వెళ్లిపోయారు. వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ దైవసందేశాలను ప్రజలకు బోధించేవారు. దాదాపు 70 ఏళ్లు బతికిన గురునానక్.. జీవితంలోని చివరి దశలో 1539 సెప్టెంబర్ 22న నరోవాల్ జిల్లాలోని కర్తార్పూర్ ఏరియాలో చనిపోయారు.రావి నది ఒడ్డున ఉన్న కర్తార్పూర్లో గురునానక్ దేవ్ నిర్మించిన గురుద్వారా సిక్కులకు పవిత్ర ప్రదేశం. దేశ విభజన వల్ల పాకిస్థాన్‌‌ పరిధిలోకి వెళ్లిపోయిన ఆ సాహిబ్ మన దేశంలో పంజాబ్ రాష్ట్రం గురుదాస్‌‌పూర్ జిల్లాలోని డేరా బాబా నానక్ నుంచి నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇండియా, పాకిస్థాన్ ఇంటర్నేషనల్ బోర్డర్ నుంచి మూడు కిలోమీటర్లు వెళితే ఈ మందిరానికి చేరుకోవచ్చు. ఈ మార్గంలో కారిడార్ నిర్మాణానికి గత ఏడాది నవంబర్ 26న వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేశారు. రెండు రోజుల తర్వాత పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శ్రీకారం చుట్టారు. ఈ కారిడార్ నిర్మాణ పనులు 80 శాతం పూర్తయ్యాయని గురుద్వారా వర్గాలు చెబుతున్నాయి.
**1947లో ఇండియావాళ్లకు నో పర్మిషన్
వివిధ దేశాల భక్తులు గురుద్వారాకు బస్సుల్లో వెళ్లేటప్పుడు పాకిస్థాన్ రేంజర్లు ఆర్మీ కాన్వాయ్తో ఫుల్ సెక్యూరిటీ కల్పిస్తారు. దేశ విభజన వల్ల 1947లో మనవాళ్లు ఈ ప్రదేశానికి రాకుండా పాకిస్థాన్ ప్రభుత్వం రోడ్డు క్లోజ్ చేసింది. దీంతో బోర్డర్ వద్దకు వెళ్లి టెలిస్కోప్తో చూడాల్సి వచ్చేది. రిపేర్లు, రినోవేషన్ తర్వాత గురుద్వారాను 1999లో రీఓపెన్ చేశారు. ఆ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో లాహోర్కి బస్సు యాత్ర జరిగింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య రోడ్డు, రైలు సదుపాయాలు వచ్చాయి.
**వీసాతో పాక్లోకి ఎంటరైనవాళ్లు కర్తార్పూర్ గురుద్వారా సాహిబ్ సందర్శనకు వెళ్లటానికి ఎలాంటి ఆటంకాలూ ఉండేవి కాదు. కర్తార్పూర్ బోర్డర్ క్రాసింగ్ని ఓపెన్ చేయాలనే అంశం తొలిసారి 1998లో రెండు దేశాల మధ్య చర్చకు వచ్చింది. 1999లో బస్సు దౌత్యం అనంతరం జరిగిన సంప్రదింపుల తర్వాత కర్తార్పూర్ సాహిబ్ గురుద్వారాకు పాకిస్థాన్ మార్పులు చేసింది. ఇండియా బోర్డర్ వద్ద నుంచి చూడటానికి కూడా అనుమతించింది.
**కారిడార్ సంగతేంటి?
ఇండియా, పాకిస్థాన్ మధ్య రావి నది పారుతోంది. దీన్ని దాటి వెళ్లాలంటే బ్రిడ్జ్ కట్టాలి. ఈ కారిడార్ను ఇండియా.. పంజాబ్ రాష్ట్రం గురుదాస్పూర్ జిల్లాలోని డేరా బాబా నానక్ నుంచి నిర్మించాల్సి ఉందని రాజ్నాథ్సింగ్ కేంద్ర హోం శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చెప్పారు. గురునానక్ 550వ జయంతి కార్యక్రమాలను తాను ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తుంటానని కూడా తెలిపారు. ఆయన తర్వాత అమిత్షా హోం మినిస్టర్ అయ్యాక ఈ యాత్రకు సంబంధించిన అంశాలపై తాజాగా ఆదివారం పాకిస్థాన్లోని వాఘా ప్రాంతంలో రెండు దేశాల ఆఫీసర్లు భేటీ అయ్యారు. బ్రిడ్జికి బదులు మట్టిరోడ్డుతో కాజ్వే కట్టాలని పాకిస్థాన్ అనుకుంటోంది. ఆ ప్రపోజల్ను ఇండియా వ్యతిరేకిస్తోంది. కాజ్వే వల్ల కర్తార్పూర్ సాహిబ్ గురుద్వారా చుట్టుపక్కల ప్రాంతాల్లో వరదలు పోటెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. తమ మాదిరిగానే బ్రిడ్జ్ నిర్మించాలని పాక్ను కోరింది. అయితే ఈ విషయాన్ని పక్క దేశం పెండింగ్లో పెట్టింది. దీంతో కారిడార్ను నవంబర్లో అందుబాటులోకి తెచ్చేందుకు వేరే ఏర్పాట్లు చేయాలని ఇండియా భావిస్తోంది. వాస్తవానికి ఈ కారిడార్ డిమాండ్ ఇప్పటిది కాదు. 20 ఏళ్ల నాటిది. 1999లో లాహోర్ డిక్లరేషన్లో కూడా ఈ అంశాన్నీ చేర్చారు. తర్వాత వివిధ సందర్భాల్లో ఈ విషయాన్ని ఇండియా పాకిస్థాన్కి గుర్తు చేస్తూనే ఉంది. 2004లో ప్రధాని మన్మోహన్సింగ్ కూడా అమృత్సిర్ స్పీచ్లో ఈ టాపిక్ని ప్రస్తావించారు. మతపరమైన మందిరాలకు సంబంధించిన 1974 ప్రొటోకాల్లోనూ కర్తార్పూర్ కారిడార్ను చేర్చాలని మన దేశం డిమాండ్ చేస్తోంది.
**ఆ గురుద్వారా ప్రత్యేకత ఏంటంటే…
ఇండియా, పాకిస్థాన్ను కలిపే కర్తార్పూర్ కారిడార్ నిర్మాణం గురునానక్ దేవ్ 550వ జయంతికి నెల ముందే పూర్తవుతుందని భావిస్తున్నారు. ఈ బోర్డర్ క్రాసింగ్ లింకేజ్ రోడ్డు అందుబాటులోకి వస్తే మన దేశం నుంచి భక్తులు గురుద్వారా దర్బార్ సాహిబ్కి నేరుగా చేరుకోవచ్చు. గురునానక్ దేవ్ మరణించటానికి ముందు సుమారు 18 ఏళ్ల పాటు ఈ ప్రాంతంలోనే ఉన్నారని, సిక్కు మతస్తులను కూడా తొలిసారి ఇక్కడే సమావేశపరిచారని చెబుతుంటారు. తమ మత గురువు శాశ్వత విశ్రాంతి తీసుకున్న ఈ గురుద్వారా అంటే సిక్కులకు ఎంతో భక్తి. ఈ కర్తార్పూర్ సాహిబ్ ఓసారి వరదల వల్ల డ్యామేజ్ అయింది. దీంతో నాటి పాటియాలా మహారాజు, పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్సింగ్ తాత భూపిందర్ సింగ్ పునర్నిర్మించారు. పాకిస్థాన్ ప్రెసిడెంట్ జనరల్ పర్వేజ్ ముషారఫ్ హయాంలో రినోవేట్ చేశారు. ఈ పుణ్యక్షేత్రాన్ని ఇండియా బోర్డర్ నుంచి డైరెక్ట్గా చూడొచ్చు. గురుద్వారా కనిపించకుండా చుట్టుపక్కల అడ్డంగా ఉండే పొడవైన చెట్లను పాకిస్థాన్వాళ్లు ఎప్పటికప్పుడు కొట్టేస్తుంటారు.
**మన దేశం నుంచి 4 సార్లు
ఇండియా నుంచి సిక్కులు కర్తార్పూర్ గురుద్వారా సందర్శనకు ఏటా ముఖ్యంగా నాలుగు సార్లు వెళుతుంటారు. ఒకటి.. బైశాఖి పండగ సందర్భంగా. రెండు.. సిక్కుల ఐదో గురువు అర్జున్ దేవ్ అమరుడైన రోజు. మూడు.. మహా రాజా రంజిత్ సింగ్ వర్ధంతి నాడు. నాలుగు.. గురునానక్ దేవ్ జయంతి రోజు. ఈ నాలుగు సందర్భాల్లో మన దేశ భక్తులు పాకిస్థాన్లోని అన్ని గురుద్వారాలకూ వెళ్లేందుకు డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. కర్తార్పూర్ కారిడార్ నిర్మాణం పూర్తైతే మనోళ్లకు పాస్పోర్టులు, వీసాలు లేకుండానే యాత్రలో పాల్గొనేందుకు వీలుంటుంది.