Politics

పాలమూరు ముద్దుబిడ్డ జైపాల్‌రెడ్డి

పాలమూరు ముద్దుబిడ్డ జైపాల్‌రెడ్డి - First South Indian To Receive Best Parliamentarian Award

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఎస్‌. జైపాల్‌రెడ్డి(77) కన్నుమూశారు.

కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన  ఈనెల  20న గచ్చిబౌలిలోని ఏషియన్‌ గ్యాస్ర్టో ఎంట్రాలజీ ఆసుపత్రిలో చేరారు.

అప్పటి నుంచి చికిత్సపొందుతూ ఈరోజు తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు.

తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్‌జిల్లా మాడుగులలో 1942 జనవరి 16న జన్మించారు.

ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. జైపాల్‌ రెడ్డి తల్లిదండ్రులు సూదిని దుర్గారెడ్డి, యశోదమ్మ. మాడుగుల, నల్గొండ జిల్లా దేవరకొండలో జైపాల్‌రెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం జరిగింది. 

ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ఇంగ్లీష్‌ లిట్‌రేచర్‌లో పట్టా పొందారు.

విద్యార్థి దశనుంచి జైపాల్‌రెడ్డి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవారు.

కాంగ్రెస్‌ అత్యవసర పాలనను వ్యతిరేకిస్తూ ఆపార్టీకి రాజీనామా చేసి జనతాపార్టీలో చేరారు. 

1985 నుంచి 88 వరకు జనతాపార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1980లో మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ఇందిరాగాంధీపై పోటీ చేసి జైపాల్‌రెడ్డి ఓటమిపాలయ్యారు. 

ఐదుసార్లు ఎంపీ, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ..

1969లో తొలిసారి మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టిన జైపాల్‌రెడ్డి .. నాలుగు సార్లు అదే నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించారు.

1984లో మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తొలిసారి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు.

1999, 2004లో మిర్యాలగూడ నుంచి ఎంపీగా గెలుపొందారు. 1990, 1996లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

జూన్‌ 1991 నుంచి 1992 వరకు రాజ్యసభాపక్ష నేతగా వ్యవహరించారు.

1999 నుంచి 2000 వరకు సభాహక్కుల ఉల్లంఘన కమిటీ ఛైర్మన్‌గా పనిచేశారు. ఐకే గుజ్రాల్‌ కేబినెట్‌లో కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 

మన్మోహన్‌సింగ్‌ హయాంలో పెట్రోలియం, పట్టణాభివృద్ధి, సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేశారు. 

1998లో ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పురస్కారం అందుకున్నారు.

దక్షిణాది నుంచి తొలిసారి ఉత్తమ పార్లమెంటేరియన్‌ పురస్కారం అందుకున్న నేతగా జైపాల్‌రెడ్డి గుర్తింపు పొందారు.